డీవైఎఫ్‌ఐ నాయకుల అరెస్టుకు సీపీఐ(ఎం) ఖండన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జాబ్ క్యాలండర్ విడుదల చేయాలనీ, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఆందోళనా కార్యక్రమంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్రకమిటీ ఖండించింది. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే రూ.రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు కేవలం 56 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని తెలిపారు. జాబ్ క్యాలెండర్ అమలు పరుస్తామంటూ హైదరాబాద్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. జూన్ రెండున నియామక పత్రాలను ఇస్తామని ఆర్భాటం చేసి ప్రచారం చేసిందని తెలిపారు.
ఇవేమీ అమలు చేయలేదని పేర్కొన్నారు. నిరుద్యోగ జేఏసితోపాటు డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది నిరుద్యోగులు, డీవైఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో సచివాలయ ముట్టడికి వెళ్తూ డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌తోపాటు అనేక మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్భందించారని తెలిపారు. నిరుద్యోగులపై ప్రభుత్వం తీవ్రమైన నిర్భందం ప్రయోగించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఉద్యోగాలు అడిగితే నిర్బంధిస్తారా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, జాబ్ క్యాలండర్‌ను విడుదల చేయాలనీ, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అరెస్టులను నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన నిరసన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఉద్యోగాలు అడిగితే నిర్బంధిస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES