Saturday, August 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినమ్మకాన్ని వమ్ముచేస్తారా?

నమ్మకాన్ని వమ్ముచేస్తారా?

- Advertisement -

ప్రభుత్వం అన్నది కేవలం పరిపాలన యంత్రాంగం మాత్రమే కాదు. అది ప్రజల నమ్మకాన్ని నెరవేర్చే ఒక సామూహిక బాధ్యత. ఆ నమ్మకం మాటలకన్నా ముఖ్యం. ఎందుకంటే ఒకసారి కోల్పోతే, దాన్ని తిరిగి సంపాదించడం అంతసులువు కాదు. ఈ హంగామాను మనం తాజా సినీ పరిణామాల్లో స్పష్టంగా గమనించవచ్చు. ”పుష్ప-2” బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అనంతరం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి స్వయంగా స్పష్టం చేశారు.’ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు, టికెట్‌ రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వబోము’ అని. ఈ ప్రకటనను ప్రజలు మానవీయ బాధ్యతగా, హితదృష్టితో తీసుకున్నారు. ప్రభుత్వంపై ఆశ పెరిగింది.అయితే, కొద్దిరోజులకే ”గేమ్‌ చేంజర్‌” సినిమాకోసం జీవో జారీచేసి టికెట్‌ ధరలు పెంచడమే కాక, బెనిఫిట్‌ షోలకూ అనుమతినిచ్చింది సర్కార్‌.దీన్ని ఎలా చూడాలి? ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా? ప్రయివేటు పెట్టుబడిదారులకోసమా అన్నది తెలియాలి.జర్నలిస్ట్‌ సతీష్‌ కమల్‌ ఈజీవోపై హైకోర్టును ఆశ్రయించగా, గౌరవ న్యాయస్థానం తాత్కాలిక ఉత్తర్వులతో ఆ జీవోను నిలిపివేసింది. ఇప్పుడు అదే తీరు ”హరిహర వీరమల్లు” సినిమాకూ పునరావృతమవుతోంది. కోర్టు ఉత్తర్వులకూ, ప్రభుత్వ హామీకి వ్యతిరేకంగా మరోసారి జీవో వెలువడింది.ఇలాంటి నిర్ణయాలను ”ఇవి చిన్నచిన్న జీవోలు”గా కొట్టిపారేయడమంటే, పాలనలో స్థిరత్వాన్ని తేలికగా తీసుకోవడమే. ఒక హామీపై నిలబడలేని ప్రభుత్వం నేడు సినీరంగానికి తలవంచితే, రేపు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలోనూ, రైతుల అంశాల్లోనూ వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందన్న అనుమానం ప్రజల్లో కలగడం సహజం.మరి ఇంత చేస్తే సినిమాల్లో సందేశాత్మకంగా ఉండి ప్రజలు తప్పనిసరిగా చూడాల్సినవా? అంటే అది కూడా లేదని వాటిని చూస్తేనే అర్థమవుతోంది. చిన్నసినిమాలు వస్తే వాటికి థియెటర్లు కూడా దొరకడం లేదు. ఇలాంటి పెద్ద సినిమాలు, సమాజంలో విద్వేశాలు, అనైతికతను చూపించే చిత్రాలకు మాత్రం అనేక రాయితీలు, బెన్‌ఫిట్‌ షోలు, టిక్కెట్‌ ధరల పెంపు అనుమతులు ఇవ్వడం సమంజసమేనా? బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపు ద్వారా లాభపడేది కొద్దిమంది బడా నిర్మాతలే. కానీ అసౌకర్యాన్ని అనుభవించేది మాత్రం సామాన్య ప్రేక్షకులు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వం, తాత్కాలిక లాభాల కోసం ప్రయివేటు లాబీల ఒత్తిడికి లోనవడం ప్రజాస్వామ్య పరిపాలనకు తగదు.ఈ పరిణామం ప్రభుత్వ విశ్వసనీయతకు ఒక చిన్న పరీక్షేం కాదు,మౌలికమైన అంశం.హామీ ఇవ్వడంలో కాక, దాన్ని నిలబెట్టుకోవడంలోనే నిజమైన నాయకత్వం తళుకుపడుతుంది.ప్రజల విశ్వాసానికి విలువ లేకపోతే, పాలనకి ఏంవిలువ ఉంటుంది?
– సయ్యద్‌ రఫీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -