– షబ్బీర్ అలీ, అజహారుద్దీన్ బీజేపీ ఎమ్మెల్యేపై ధ్వజం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని 19 నుంచి 25 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వీరితపాటు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరేళ్ల శారద పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అహంకారం వీడితేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ఏమీ చేయలేదని అన్నారు. గతంలో చేయని వ్యక్తి రేపు మున్సిపల్ ఆ పార్టీకి అస్తగతమైతే ఏమి చేస్తాడనే నమ్మకం ప్రజలకు లేదని వ్యాఖ్యానించారు. అధికార గర్వం పెరిగితే చిన్నా, పెద్దా అనే తేడా ఉండదని, అహంకారం వల్లనే పెద్ద నాయకులకూ ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు మృదు స్వభావులై ఉండాలని, వార్డు సమస్యలను తమ ఇంటి సమస్యలుగా భావించి పరిష్కరించే వారినే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆరు గ్యారంటీలను వేగంగా అమలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని తెలిపారు. రైతు భరోసా ద్వారా రైతులకు ఎకరాకు రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని, గత రెండేళ్లలో సుమారు 51,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
మైనారిటీల విద్య, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరేళ్ల శారద మాట్లాడుతూ, గతంలో ఇందిరమ్మ పాలనలో మహిళలకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ, నేడు ఆరు గ్యారంటీల ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




