Wednesday, May 28, 2025
Homeరాష్ట్రీయంశవాలతోనూ యుద్ధం చేస్తారా..?

శవాలతోనూ యుద్ధం చేస్తారా..?

- Advertisement -

– మృతదేహాలు అప్పగించకుండా ఆనవాళ్లు, సాక్ష్యాలు తారుమారు చేసే కుట్ర..
– వాటిని అప్పగించి అంత్యక్రియలు జరిగేలా చూడాలి : సీపీఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
నవతెలంగాణ-ఖమ్మం

మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, తెలుగు రాష్ట్రాల ఇతర నేతలు ఈనెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెంది ఆరు రోజులైనా బంధువులకు వారి మృతదేహాలను అప్పగించకపోవడం కేంద్ర, రాష్ట్ర బీజేపీ, ఏపీ కూటమి ప్రభుత్వ ఫాసిస్టు దుర్మార్గానికి నిదర్శనమని సీపీఐ(ఎంఎల్‌) మాన్‌లైన్‌(ప్రజాపంథా) కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బీజేపీ, టీడీపీ సర్కార్లు చచ్చిన శవాలకు కూడా భయపడి, శవాలతో యుద్ధం చేస్తున్నాయని విమర్శించారు. సోమవారం ఖమ్మంలోని సీపీఐ(ఎంఎల్‌), మాన్‌ లైన్‌(ప్రజాపంథా) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించాలని, అంత్యక్రియలు గౌరవ ప్రదంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్బంధం, బెదిరింపులు ఆపాలని డిమాండ్‌ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి భౌతికకాయాలను అప్పగించడానికి ఆరు రోజులుగా ఆలస్యం చేయడంలో ఆనవాళ్లు, సాక్ష్యాలను కనిపించకుండా చేసే కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల, పోలీసుల ఈ దుర్మార్గ వైఖరి చూస్తే పట్టుకువచ్చి కాల్చి చంపినట్టు వచ్చే వార్తలను విశ్వసించేలా ఉందని అన్నారు. మధ్య భారతంలో నరమేధం సృష్టిస్తున్నారని, సరిహద్దుల్లో చేసే యుద్ధం దండకారణ్యంలో చేస్తున్నారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు విధానంలో భాగంగానే ఇది జరుగుతున్నదని తెలిపారు. అడవుల్లో దొరికే 29 రకాల విలువైన ఖనిజాల కోసం, కార్పొరేట్‌ కంపెనీల లాభాల దాహం కోసం ఈ నరమేధం చేస్తూ, రక్త పీపాసులుగా కేంద్రం మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా నరమేధం ఆపి, శాంతి చర్చలు జరపాలని, శవాలను బంధువులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎన్‌కౌంటర్‌లపై, ఆదివాసీల మరణాలపై న్యాయవిచారణ జరపాలని కోరారు. రాష్ట్ర నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యని, ఇతర రాజకీయ, ప్రజాసంఘాల నేతలను జియానపేట పోనియకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గండమళ్ళ రామయ్య, ఝాన్సీ, మలీదు నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -