Saturday, October 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీనియర్లను విస్మరిస్తారా

సీనియర్లను విస్మరిస్తారా

- Advertisement -

అలిగిన అంజన్‌, సీఎన్‌ రెడ్డి
బుజ్జగించిన కాంగ్రెస్‌ నేతలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌యాదవ్‌ ఎంపికైన తర్వాత కొంత మంది ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, రహమత్‌నగర్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పార్టీపై అలిగారు. సీనియర్లుగా ఉన్న తమను విస్మరిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఇంటికి ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి వెళ్లి చర్చలు జరిపారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం రహమత్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి నివాసానికి కూడా వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా తాము టికెట్‌ కోసం చేసిన ప్రయత్నాలను చెప్పుకున్నారు. నియోజకవర్గంలో వారు చేసిన సేవలను గుర్తించలేదంటూ నేతల ముందు గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ అసంతృప్తిని సద్దుమణిగేలా పార్టీ నాయకత్వం చర్చలు జరిపి, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. పార్టీలో భవిష్యత్తు ఉంటుందనీ, మారిన పరిస్థితుల్లో జూబ్లీహిల్స్‌ను కైవసం చేసుకునేందుకు కలిసి పని చేయాలని కోరారు. అందుకు అంగీకరించిన నేతలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ విజయం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం నవీన్‌యాదవ్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించిందని తెలిపారు. ఆయన విజయం కోసం ప్రతి కార్యకర్త కషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకాన్ని మరింత బలపరచాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి ఎన్నికల్లో అందరినీ సంప్రదించిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు.

జూబ్లీహిల్స్‌లో అంజన్‌ కుమార్‌యాదవ్‌ పోటీ చేయాలని భావించారనీ, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం టికెట్‌ నవీన్‌యాదవ్‌కు కేటాయిం చిందని తెలిపారు. కరోనా సమయంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారనీ, ఆ క్రమంలో ఆయన కూడా కరోనా బారిన పడ్డారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారని కొనియాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌ ఎన్నికల్లో అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. తమ పార్టీలో నియంతృత్వం ఉండదనీ, ఆవేదనను స్వేచ్ఛగా బహిర్గతంగా చెప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ ముషీరాబాద్‌లో గెలిచి ఉంటే మంత్రి అయ్యేవారని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే తమ లక్ష్యమన్నారు. సీఎన్‌రెడ్డి నాయకత్వంలో రహమత్‌నగర్‌ డివిజన్‌లో కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ చేకూర్చాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -