Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోరా?

సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోరా?

- Advertisement -

యూపీలో ఇప్పటికీ ‘బుల్డోజర్‌ జస్టిస్‌’
రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అలహాబాద్‌ హైకోర్టు

లక్నో : నేరారోపణలు నమోదైన వెంటనే ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. యూపీలో ‘బుల్డోజర్‌ చర్యలు’ ఇంకా కొనసాగుతున్నాయని అలహాబాద్‌ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శిక్ష విధించే అధికారం న్యాయవ్యవస్థకే తప్ప వేరెవరికీ లేదని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు యోగి సర్కారును ప్రశ్నించింది.భారత చట్టాలలో ఇండ్లను కూల్చివేయడం శిక్షగా విధించేందుకు ఎలాంటి నిబంధనలూ లేవు. అయినా, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ పద్దతి సాధారణంగా మారిందని విమర్శలు ఉన్నాయి. 2024 నవంబర్‌లో సుప్రీంకోర్టు.. నేరారోపణలు ఉన్నవారి ఆస్తులను శిక్షగా కూల్చివేయడం అక్రమమనీ, అక్రమ కబ్జాల తొలగింపునకైనా సరైన విధివిధానాలు పాటించాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అతుల్‌ శ్రీధరన్‌, సిద్ధార్థనందన్‌లతో కూడిన ధర్మాసనం… సుప్రీంకోర్టు ఆదేశాలు నిజంగా అమలవుతున్నాయా? నిందితుడి ఇంటిని కూల్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? లేదా పౌరుల హక్కులను కాపాడడమే ప్రభుత్వ బాధ్యతా? అన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నేరం నమోదు అయిన వెంటనే కూల్చివేతలు చేపట్టడం కార్యనిర్వాహక అధికారాన్ని వక్రీకరించినట్టు అవుతుందనీ, ఇలాంటి సందర్భాల్లో కూల్చివేత నోటీసులు జారీ అయిన అనేక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని కోర్టు తెలిపింది. శిక్ష విధించే అధికారం న్యాయవ్యవస్థకే ఉంటుందనీ, కార్యనిర్వాహక శాఖ (ప్రభుత్వం) దానిని చేతుల్లోకి తీసుకోలేదని అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కూల్చివేతను శిక్షగా ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని గుర్తు చేసింది. ఇండ్ల కూల్చివేతపై సమంజసమైన భయం ఉన్నా కూడా పౌరులు కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యలు పౌర హక్కుల పరిరక్షణలో కీలకమైనవిగా మేధావులు, న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -