Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిభాషలను బలిచేస్తారా?

భాషలను బలిచేస్తారా?

- Advertisement -

మానవ నాగరికత వికాస ప్రస్థానంలో భాష సజీవమైన పాత్ర పోషిస్తున్నది. భాషలు లేకుండా ఏ జ్ఞాన సమపార్జన కూడా సాధ్యం కాదు. విద్యావికాస క్రమమంతా భాషలతో ముడిపడినదే. ఆధునిక రాజ్యాలలో వ్యవస్తీకృతమైన విద్యను పౌరులకు అందివ్వడం భాషల ద్వారా మాత్రమే సాధ్యమైంది. తొలి అక్షరమే భాషతో మొదలవుతుంది. ప్రపంచీరణ నేపథ్యంలో భాషల పట్ల విద్యారంగంలో ఒకింత చిన్న చూపు కనపడుతున్నది. ప్రాధమిక స్థాయిలోనే మొదలైన ఈ దృష్టి ఉన్నత విద్యారంగానికి వచ్చేసరికి మరింతగా పెరిగింది. సాధారణ డిగ్రీ స్థాయిలో భాషా బోధన పట్ల ఉన్నత విద్యా వ్యవహారాలను చూసే అధికార వ్యవస్థకు వాటి అవసరమే కనిపించడం లేదు. ఇటీవల తెలంగాణా ఉన్నత విద్యామండలి యూజీసి నిర్దేశాల మేరకు అనే కారణంతో 2019 నుండి డిగ్రీ మూడవ సంవత్సరంలో కూడా కొనసాగుతున్న మెదటి, రెండవ భాషల బోధనను రద్దు పరుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, భాషలకు కేటాయించిన 20 క్రెడిట్లను 12కి తగ్గించాలని, మరోసారి 16 అని, 18 అని గందరగోళ పరుస్తూ ఆయా విశ్వవిద్యాలయాలకు ‘ఆదేశాలను’ జారీచేసింది. ఇప్పటిదాకా కొనసాగుతున్న 150 క్రెడిట్ల స్థానంలో విద్యార్థుల మీద భారం తగ్గించే నెపంతో వ్యవస్థలో భాగమైన వారితో ఏ సంప్రదింపులు చేయకుండానే ఏకపక్షంగా భాషలను బలిచేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ సరికొత్త విధానం మొత్తంగా భాషలు, భాషా బోధన డిగ్రీ స్థాయిలో అవసరం లేదనే యాంత్రిక వైఖరిని తెలియచేస్తున్నది.

మళ్లీ అదే చివరి సంవత్సరంలో నైపుణ్యాలా పెంపు పేరా, విలువల చేర్పు పేరుతో భాషలు నెరవేర్చే ప్రయోజనాన్ని తిరిగి ప్రవేశ పెడుతున్నది.నిజానికి అలాంటి ప్రయోగాలేవి డిగ్రీస్థాయిలో ఏ మాత్రం ఫలప్రదం కాలేదు. ఆయా రాష్ట్రాల్లో డిగ్రీ విద్యపైన ఆజమాయిషీ అనేక పొరలుగా సాగిస్తూ గందరగోళానికి గురిచేస్తున్నాయి. దేశ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజిసి), రాష్ట్రాల స్థాయిలో ఉన్నత విద్యామండలి, విద్యావిషయాల్లో విశ్వవిద్యాలాయాలు, మళ్లీ పెద్ద డిగ్రీ కళాశాలలు స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నాయి. అనుబంధ కాలేజీలపైన విశ్వవిద్యా లయాలు పర్యవేక్షణ చేస్తున్నాయి. సర్వీసు, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలను ఉన్నత విద్యా కమి షనరేట్‌ చూస్తుంది. నిజానికి యూజీసి, ఉన్నత విద్యామండలి వంటి వాటి పాత్ర సలహా పూర్వకమైనదే గాని తప్పని సరైనది కాదు. ఆయా విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా తమ పరిధిలోనే విద్యా ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. ఇటీవలి కాలంలో దీంట్లో ఏ వ్యవస్థ క్రియాశీలంగా ఉంటే వారిదే పైచేయి అవుతున్నది. యూజిసి ‘ఆదేశాల’ పేరుతో విద్యామండలి ఏకపక్షంగా వ్యవహారిస్తున్నది. అలా అని యూజిసి అన్ని నిర్దేశాలను తుచా తప్పక పాటిస్తారా అంటే అదీలేదు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులను నియమించే అధికారంలో యూజిసి ప్రతిపాధనలను నిరద్వందంగా తిరస్కరించిన రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిరసించాడు. యూజిసి నిబంధనల మేరకు కళాశాలల్లో బోధన పీరియడ్లు వారానికి పదహారుం డాలి. ఇక్కడ ఎప్పుడు ఎంత ఉంటాయో ఎవరికీ తెలియదు. ఒక డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదాను ఇవ్వాలంటే 90శాతం శాశ్వత ప్రాతిపదికన ఎంపికైన భోదనా సిబ్బంది ఉండాలి. పిహెచ్‌డి పట్టా పొంది ఉండాలి. కళాశాల బోధనా సిబ్బంది పదవి విరమణ వయస్సు 65ఉండాలి అవేమి అమలు కావడమేలేదు. యూజిసి పేరుచెప్పి భాషలను బలిపీఠం ఎక్కించే పనికి ఏకపక్షంగా పూనుకున్నారు. ఏ సంస్కరణలు అయినా వాంచనీయమా కాదా అని ఆవ్యవస్థలో భాగస్వాములైన వారిని సంప్రదించడం కనీస ప్రజాస్వామిక బాధ్యత. ఇప్పుడు అవేమి లేవు. ‘ఉన్నత’ అధికారపీఠం మీద ఎవరు కూర్చుంటే వాళ్ల ఇష్టాను సారం నడవడం విద్యావ్యవస్థకు తీవ్రనష్టం తెస్తున్నది.
మరోవైపు డిగ్రీ పూర్తి కాగానే జాబ్‌ ‘మార్కెట్‌’ లోకి వెళ్లే విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, నైతిక, మానవీయ విలువలు లేవని జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనేశక్తి లేక ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారని ఈ పెద్దలే సెలవిస్తున్నారు. సాహిత్యం నైతిక, మానవీయ విలు వల్ని ప్రోది చేస్తూ, వ్యవస్తీకృతం చేసే పని చేస్తుంది. భాషా బోధన విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచడమే కాకుండా మానవ సంబంధాలను మెరుగుపరిచేలా దోహదపడుతుంది. భావోద్వేగాలను స్థిరపరుస్తుంది. ప్రకృతి పట్ల, తోటి మనుషుల పట్ల సున్నితమైన స్పందనలను పెంపొందిస్తుంది. కేవలం సాంకేతిక కారణాలతో యాంత్రిక దృష్టితో తీసుకున్న ఈ నిర్ణయం భాషా బోధనకు, భాషలకు మాత్రమే గొడ్డలి పెట్టు కాదు మొత్తంగా విలువల పరివ్యాప్తిని అడ్డుకుని సాంస్కృతిక జీవితాన్ని విధ్వంసం చేసే ప్రమాదం ఉన్నది. దీని ఫలితంగా వేలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడటమే కాదు, భవిష్యత్‌లో భాషా భోదనా రంగంలో ఉద్యోగ నియామకాలు నిలిచి పోతాయి. ఈ నిర్ణయాన్ని ఉన్నత విద్యా మండలి వెనక్కి తీసుకొని డిగ్రీ చివరి సంవత్సరంలో కూడా భాషా బోధన జరిగేలా యధాతధ స్థితిని కొనసాగించాలి.

  • సతీష్‌ బైరెడ్డి
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad