అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం
81 మిలియన్ చ.అడుగుల భూమి
అసోం బీజేపీ సర్కారు తీరుపై హైకోర్టు షాక్
కేటాయింపునకు సంబంధించిన పత్రాలు కోరిన న్యాయస్థానం
గువహతి : అసోం రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గౌహతి హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం అదానీ గ్రూపునకు 81 మిలియన్ చదరపు అడుగుల భూమి(3000 బిఘాలు)ని అప్పగించాలని నిర్ణయించిన బీజేపీ సర్కారు తీరుపై షాక్‌కు గురైంది. ఇంత భారీ మొత్తంలో భూమిని అప్పగించటంపై కోర్టులో జరిగిన విచారణపై హైకోర్టు జడ్జి జస్టిస్ సంజరు కుమార్ మేధీ అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఆ జడ్జి కూడా నమ్మలేకపోయారు. ”ఇదేమైనా జోకా? మీరు మొత్తం జిల్లాను ఇస్తున్నారా?” అని తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సిమెంట్ కంపెనీ తరఫున వాదించిన న్యాయవాదిని గౌహతి హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం దాదాపు మొత్తం దిమా హసావో జిల్లాను కేటాయించటంపై జడ్జి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ జిల్లా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం స్థానిక తెగల హక్కులు, ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూపునకు కేటాయించిన భూమి ఉమ్రాంగ్సోలో ఉన్నది. ఇది వేడి నీటి బుడగలు, వలసపక్షులు, వన్యప్రాణులకు ప్రసిద్ధి చెందినది.
ఫ్యాక్టరీ కోసం ఆ భూమి అవసరమని న్యాయవాది వాదించారు. దానిని బంజరు భూమిగా తెలిపారు. అయితే జోక్యం చేసుకున్న జడ్జి.. ”అది బంజరు భూమి అని మాకు తెలుసు. 3000 బిఘాలు. ఇదే రకమైన నిర్ణయం? ఇదేమైనా జోకా లేక ఇంకేమైనానా..?” అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇంత మొత్తంలో భూమిని ఒక కంపెనీ కోసం కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. ప్రజాప్రయోజనాలకు అన్నింటి కంటే ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. తాము ఎవరి భూమినీ తీసుకోవటం లేదనీ, టెండర్ ద్వారా లీజు లభించిందని న్యాయవాది వాదించారు. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం జరిపిన భూకేటాయింపు విధానానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని నార్త్‌కాచర్ హిల్స్ అటానమస్ కౌన్సిల్ (ఎన్‌సీహెచ్‌ఏసీ)ని హైకోర్టు జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేశారు.
కాగా హైకోర్టులో జరిగిన ఈ విచారణకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో జడ్జి సిమెంట్ ఫ్యాక్టరీ పేరును అడగటం, దానికి కేటాయించిన 3000 బిఘాల భూకేటాయింపు గురించి తెలుసుకొని ‘మొత్తం జిల్లా…’, ‘3000 బిఘాలు..’ అని పలుసార్లు ఆశ్చర్యపోవటం అందులో కనిపిస్తుంది. ఈ వీడియోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మైనారిటీలు, గిరిజనులు, దళితుల హక్కుల గురించి పట్టని హిమంత ప్రభుత్వం.. బడా వ్యాపారవేత్తలకు మాత్రం లక్షల చదరపు అడుగుల భూమిని కేటాయిస్తున్నదని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
జిల్లానే రాసిస్తారా?
- Advertisement -
- Advertisement -