ఎ. నిహారిక, 7 వ తరగతి,
జి. ప. ఉ. పాఠశాల, కుత్బుల్లాపూర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.
అనగనగా గోపాల పురం అనే గ్రామంలో శోభ, ఉష అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ 10 వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇద్దరూ చదువులో పెద్దగా చురుకైనవారు కాదు. శోభకు లెక్కలంటే మహా భయం. టీచర్ చెప్పినా, ఉష చెప్పినా పెద్దగా బుర్రకు ఎక్కేదికాదు శోభకు. ఉషకు ఇంగ్లీషు అంటే భయం. తెలియని భాష. గ్రామర్ ఎంతకూ అర్థం అయ్యేది కాదు. ఇద్దరు 10 వ తరగతి పరీక్ష రాశారు. శోభ లెక్కల్లో, ఉష ఇంగ్లీష్‌లో తప్పారు. ఇక్కడే ఇద్దరి జీవితాలు మలుపు తిరిగాయి.
శోభ వాళ్ళ నాన్నకు మళ్ళీ పరీక్ష ఫీజు కట్టి ఫెయిల్ ఐన లెక్కల పరీక్ష రాయించమని ఎంత మంది నచ్చచెప్పినా అతను వినలేదు. ఇక చదివింది చాలు అని మూడేళ్లు ఇంట్లోనే ఊరికే కూచోబెట్టి మూడేళ్ల తర్వాత శోభకు పెళ్లి చేసి పంపాడు శోభ వాళ్ళ నాన్న. ఉషకు మాత్రం వాళ్ళ నాన్న పరీక్ష ఫీజ్ కట్టి మళ్ళీ పరీక్ష రాయించాడు. ఉష ఈసారి పాస్ అయింది. దాంతో పట్నంలో కాలేజీలో చేర్చాడు ఉష వాళ్ళ నాన్న. దాంతో ఇద్దరు స్నేహితులు మళ్ళీ కలవలేదు. ఉష డిగ్రీ చదివి, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ అయింది. ఉష వాళ్ళ నాన్న ప్రభుత్వ ఉద్యోగం చేసే ఒక ఆఫీసర్ సంబంధం చూసి ఉషకు పెళ్లి చేశాడు. ఉష జీవితం హాయిగా గడుస్తోంది. ఉషకు ఇద్దరు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు. శోభకు కూడా ఇద్దరు పిల్లలు. భర్త తాగుబోతు. తనే ఇళ్లలో పని చేసి పిల్లలకు తిండి పెడుతోంది. పిల్లల చదువులు అంతంత మాత్రమే. పదవ తరగతి వరకు చదివి ఆపేశారు. తల్లికి చేదోడు వాదోడుగా కూలి పనులకు వెళ్తున్నారు. ఇలా కొన్నేళ్లు గడిచాక ఉష ప్రమోషన్ మీద ప్రధానోపాధ్యాయురాలిగా శోభ వుండే ఊరికి వచ్చింది. ఆ ఊరిలో పిల్లలను బడిలో చేర్పించాలని, చదువు లేకుంటే వచ్చే కష్టాలను ప్రచారం చేస్తూ గ్రామంలోని పిల్లల అభివద్ధికి పాటుపడుతోంది ఉష. ఇలా పనుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల ఇంట్లో పనిచేయడానికి పనిమనిషి కావాలని, ఎవరైనా నమ్మకంగా పనిచేసేవారుంటే చెప్పాలని చుట్టుపక్కల వారికి చెప్పింది ఉష.
నాలుగు రోజుల తర్వాత ఒక స్త్రీ ఉష ఇంటికి వచ్చి ”మేడం పనిమనిషి కావాలి అన్నారట.. నన్ను మీ పక్కింటి సుమిత్ర గారు పంపారు” అని చెప్పింది. ఉష ఆమెను గుర్తుపట్టి నువ్వు శోభవు కదూ..అంది. అవును.. నేను మీకెలా తెలుసు అంది శోభ. నన్ను గుర్తుపట్టలేదా.. నేను ఉషను. మనిద్దరం 10 వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. అంటూ.. స్నేహితురాలిని హత్తుకుంది. అవునూ..ఏమిటి నువ్విలా.. పనిమనిషిగా రావటం ఏమిటి? అని ఉష శోభను అడిగింది. శోభ ఏడుస్తూ.. భర్త తాగుబోతుగా మారి ఉన్నదంతా తాగుడుకు తగలేసాడని.. తనే కష్టపడి పిల్లలను పోషిస్తున్నానని చెప్పింది. చిన్నప్పుడు తన తండ్రి మళ్ళీ తనను ఫెయిల్ ఐన పరీక్ష రాయించి ఉంటే.. తానూ చదువుకొని ఉంటే తన జీవితం మరోలా ఉండేదని చెప్పి బాధపడింది. ఉష జరిగింది వదిలేయి. ఇంతకు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగింది. ఇద్దరు అమ్మాయిలు పదవతరగతి పూర్తి చేసి నాకు సాయంగా కూలి పనులు చేస్తున్నారు అని చెప్పింది శోభ. ఉషకు తన స్నేహితురాలి పరిస్థితికి జాలేసింది. బాగా ఆలోచించి ఉష ఒక నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయం శోభతో చెప్పింది. నీ ఇద్దరు కూతుళ్లను హాస్టల్‌లో పెట్టి నేను చదివిస్తాను. మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండే వంటమనిషి మానేసింది, నువ్వు మా బడిలో పిల్లలకు వంట చేసి వడ్డించే పనిలో చేరు అని చెప్పింది ఉష. ఆనందంగా సరే అన్నది శోభ. అలా ఉష తన స్నేహితురాలి కష్టాలు తీర్చడానికి సహాయపడింది.



