ఒక దట్టమైన అడవిలో అనేక రకాల జంతువులు నివసించేవి. ఎండాకాలంలో వాటికి ఒకే ఒక నీటి ఆధారం అడవి మధ్యలో ఉన్న చిన్న కొలను. ఎండ తీవ్రంగా ఉండడంతో, చిన్న చిన్న నీటి గుంటలన్నీ అడుగంటాయి. దాహం తీర్చుకోవడానికి మిగిలిన జంతువులన్నిటికీ ఆ కొలనే దిక్కు.
అదే అడవిలో ఒక పొగరుబోతు ఏనుగు ఉండేది. అది తన బలాన్ని చూసుకుని చాలా అహంకారంగా ఉండేది. ఆ పొగరుతో కొలనును పూర్తిగా తన సొంతం చేసుకుంది. ఏ జంతువునూ నీళ్లు తాగనిచ్చేది కాదు. చిన్న జంతువులు దాహం వేసి బతిమాలినా, వాటిని తరిమికొట్టి, దాడిచేసి బాధపెట్టేది. ఆ ఏనుగు వల్ల, జంతువులన్నీ దాహం తీర్చుకోవడానికి పది క్రోసుల దూరంలో ఉన్న ప్రమాదకరమైన దారిలో నదికి వెళ్లాల్సి వచ్చేది.
ఏనుగు ఆగడాలు ఎక్కువ కావడంతో, జంతువులన్నీ సమావేశమై ఆ తీవ్రమైన సమస్యను గురించి మాట్లాడుకున్నాయి. ఏనుగును బతిమాలినా లాభం లేదని, ఎలాగైనా దాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఆ సమయంలో, చిన్నదైనా చాలా తెలివైన ఒక కుందేలు ముందుకు వచ్చింది. ఆ పొగరుబోతు ఏనుగును తనే లొంగదీస్తానని ధైర్యం చెప్పింది. అప్పుడు జంతువులు, ”ఒకప్పుడు పులి మీసాలు మెలివేసిన దానివి, ఈ ఏనుగు మదాన్ని తప్పక అణచేస్తావు” అంటూ కుందేలుపై నమ్మకం ఉంచాయి.
?కుందేలు బాగా ఆలోచించి, తన ప్రణాళికతో ఆ రాత్రి చీకటిలోనే పది క్రోసుల దూరం నడిచి నది దగ్గరకు వెళ్లింది. నీటిలో ఉన్న మొసళ్ళ నాయకుడిని పిలిచి, తమ అడవిలోని కష్టాన్ని వివరించింది.
”మిత్రమా, మీరు మాకు ఈ సాయం చేస్తే, మేము మీకు అడవిలోని మంచి పండ్లు, దుంపలు తెచ్చిపెడతాము, మీ మేలు మర్చిపోము. మీకు కూడా కావలసినంత రుచికరమైన ఏనుగు మాంసం దొరుకుతుంది” అంటూ మొసళ్లకు ఆశచూపుతూ బతిమాలింది. ”పని పూర్తికాగానే కొలను ఖాళీ చేసి వెళ్ళాలి” అని షరతుపెట్టింది. మొసళ్లు ఏనుగు మాంసానికి ఆశపడి ఆ షరతును అంగీకరించి, సాయం చేయడానికి వెంటనే బయలుదేరాయి.
ఆ రాత్రే, కుందేలుతో కలిసి కొన్ని మొసళ్ళు కొలను దగ్గరకు వచ్చి దాక్కున్నాయి. ఏనుగు మేతకు వెళ్లిన వెంటనే, మొసళ్లు కొలనులోకి చేరి, నీటిలో కనబడకుండా మాటు వేశాయి.
మేతమేసి తిరిగి వచ్చేదాక కొలను వద్ద ఎదురుచూచి, ఏనుగు దగ్గరకు రాగానే కుందేలు,
”ఏనుగా! నా మాట విని నీ గర్వాన్ని వదిలి, అందరితో కలిసిపో. సాటి జంతువులకు నీళ్లు తాగే అవకాశం ఇవ్వు. ఇది నీకు నా చివరి అవకాశం,”
అని గట్టిగా చెప్పింది. ఆ మాటలకు ఏనుగుకు కోపం వచ్చింది.
”చిన్న జీవివి నాకే సలహా చెబుతావా? నిన్ను తొక్కి చంపుతాను! వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు” అంటూ కోపంగా ఘీంకరిస్తూ కొలనులోకి దిగింది.
ఏనుగు నీళ్లు చిమ్ముకుంటూ లోపలికి వెళ్లగానే, అదను చూసి! కొలనులో మాటు వేసి ఉన్న మొసళ్లు ఒక్కసారిగా ఏనుగుపై దాడి చేశాయి. మొసళ్లు గట్టిగా ఏనుగు కాళ్లు, తొండం పట్టుకుని నీటి లోపలికి లాగడం మొదలుపెట్టాయి. ఊహించని ఈ దాడికి ఏనుగు భయపడింది. బాధతో పెద్దగా అరిచింది. తన బలం అంతా ఉపయోగించినా, మొసళ్ల పట్టు నుంచి కదలలేకపోయింది. అహంకారంతో చెలరేగిన ఆ ఏనుగుకు, తోటి జంతువులను బాధపెట్టినందుకు తగిన శిక్ష పడింది.
అడవి జంతువులన్నీ వచ్చి కుందేలుకు ధన్యవాదాలు చెప్పాయి. వాటి దాహం తీరింది, ఏనుగు పీడ వదిలింది. ఆనందంగా జంతువులన్నీ,
”బలం కంటే తెలివే గొప్పది. తెలివే గెలిచింది. ఇకపై, ‘ఏనుగు మదం కుందేలు అణచినట్టు’ అనే సామెతను మనం ప్రచారం చేద్దాం!” అని చెప్పుకున్నాయి. చిన్న కుందేలు తెలివి అడవిలో అందరికీ స్వేచ్ఛను, శాంతిని అందించింది.
– డా. పోతగాని సత్యనారాయణ, 9182531202



