భారత్, ఆసీస్ నాల్గో టీ20 నేడు
మ.1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
కంగారూ పర్యటనలో భారత జట్టు తొలిసారి అనూహ్య పరిస్థితి చవిచూస్తోంది. ఆసీస్‌తో భారత్ టీ20 సిరీస్‌లో తలపడుతున్నా.. కంగారూ అభిమానుల్లో ఈ సిరీస్‌పై ఆసక్తి లేకపోవటం ఆశ్చర్యకరం. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ సన్నద్ధతపై ఫోకస్ ఉండటంతో చివరి రెండు టీ20లు ధనాధన్ మేనియాతో ఉనికి చాటుకుంటాయా? ఆసక్తికరం. సిరీస్‌లో ఆధిక్యంపై కన్నేసి భారత్, ఆస్ట్రేలియా నేడు నాల్గో టీ20లో తలపడుతున్నాయి.
నవతెలంగాణ-గోల్డ్‌కోస్ట్
ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో మూడు మ్యాచులు ముగిసినా.. ఏ జట్టుకు స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. హోబర్ట్‌లో అదిరే విజయంతో పుంజుకున్న టీమ్ ఇండియా నేడు గోల్డ్‌కోస్ట్‌లో 2-1తో తిరుగులేని ఆధిక్యంపై కన్నేసింది. కీలక ఆటగాళ్లు యాషెస్ సిరీస్ సన్నద్ధతకు జట్టును వీడినా ఆతిథ్య ఆస్ట్రేలియా బలంగానే కనిపిస్తోంది. నేటి మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సిరీస్‌ను కోల్పోయే పరిస్థితి లేకపోవటంతో గోల్డ్‌కోస్ట్‌లో రసవత్తర సమరం లాంఛనమే.
శుభ్‌మన్, సూర్య మెరిసేనా?
పొట్టి ఫార్మాట్‌లో భారత్ మెరుగ్గా ఉంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమి.. ఈ ఫార్మాట్‌లో విధ్వంసక ఓపెనర్లను కాదని శుభ్‌మన్ గిల్‌ను ఎంచుకోవటం విమర్శలకు అవకాశం కల్పిస్తోంది. శుభ్‌మన్ గిల్ తొలి మూడు మ్యాచుల్లో వరుసగా 37, 5, 15 పరుగులే చేశాడు. ఆసీస్ పేసర్లు పవర్‌ప్లేలోనే గిల్‌ను డగౌట్‌కు చేర్చుతున్నారు. సూర్యకుమార్ యాదవ్‌దీ ఇదే పరిస్థితి. గత పది ఇన్నింగ్స్‌ల్లో సూర్య అర్థ సెంచరీ సాధించలేదు. ఆసీస్‌తో మూడు మ్యాచుల్లో వరుసగా 39, 1, 24 పరుగులు చేశాడు.
హోబర్ట్‌లో వచ్చీ రాగానే దూకుడుగా ఆడినా.. వికెట్ నిలుపుకోలేదు. యువ ఆటగాళ్లు వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మలు భారత బ్యాటింగ్ లోతును మరోసారి నిరూపించారు. లోయర్ ఆర్డర్‌లో ఈ ఇద్దరు భారత్‌కు కీలకం. అభిషేక్ శర్మ భీకర ఫామ్‌లో ఉండగా.. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ ధనాధన్ జోరు చూపించాల్సిన అవసరం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రాలతో కలిసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం దూబె బంతితోనూ రాణిస్తే నేడు గోల్డ్‌కోస్ట్‌లో భారత్‌కు ఎదురులేదు.
మాక్స్‌వెల్ వస్తున్నాడు
విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ గాయ నుంచి కోలుకుని ఆసీస్ శిబిరంలో చేరాడు. ట్రావిశ్ హెడ్, హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ అందుబాటులో లేకపోయినా.. మాక్స్‌వెల్ రాకతో ఆసీస్ బలంగానే ఉంది. కెప్టెన్ మిచెల్ మార్ష్, యువ బ్యాటర్ టిమ్ డెవిడ్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, వికెట్ కీపర్ జోశ్ ఇంగ్లిశ్‌లు నేడు ఆతిథ్య జట్టుకు కీలకం కానున్నారు. నాథన్ ఎలిస్, కుహ్నేమాన్, జేవియర్ బార్ట్‌లెట్‌లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
పిచ్, వాతావరణం
గోల్డ్‌కోస్ట్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచులే జరిగాయి. అందులో ఓ మ్యాచ్ పది ఓవర్లకు కుదించబడింది. దీంతో పిచ్ స్వభావం గురించి స్పష్టమైన అంచనా లేదు. ఈ స్టేడియంలో బ్యాటర్ల స్ట్రయిక్‌రేట్ అధికం. ఫలితంగా భారీ స్కోర్లకు అవకాశం మెండుగా ఉంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివం దూబె, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జశ్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : మాట్ షార్ట్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోశ్ ఇంగ్లిశ్ (వికెట్ కీపర్), టిమ్ డెవిడ్, మిచ్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్, నాథన్ ఎలిస్, మాట్ కుహ్నేమాన్.



