Friday, May 23, 2025
Homeప్రధాన వార్తలుబీజేపీతోపొత్తు పెట్టుకుంటారా?

బీజేపీతోపొత్తు పెట్టుకుంటారా?

- Advertisement -

ప్రజల్లో సందేహాలు
మీరు ఆ పార్టీపై పరిమితంగా మాట్లాడటంతో వచ్చిన సమస్య
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించామన్న భావన బలంగా వెళ్లింది :
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘గత నెలలో వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రజతో త్సవ సభలో మీరు బీజేపీపై పరిమితంగా మాట్లాడటంతో భవిష్యత్తులో కమలం పార్టీతో మనం పొత్తు పెట్టుకుంటామన్న ఊహాగానాలు మొదలయ్యాయి…’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కొద్ది రోజుల క్రితం లేఖ రాసినట్టు సమాచారం. ఈ మేరకు ఒక లేఖ గురువారం బయటకొచ్చింది. సభ విజయవంతమైనందుకు తన తండ్రికి ఆమె అభినందనలు తెలుపుతూనే పాజిటివ్‌, నెగెటివ్‌తో కూడిన కొన్ని అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి సహకరించామన్న భావనను అధికార కాంగ్రెస్‌ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రకటిస్తారు.. మార్గనిర్దేశనం చేస్తారని అందరూ భావించినట్టు తెలిపారు. జడ్పీ చైర్మెన్లు, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా చాలా మంది కేసీఆర్‌ను కలవలేకపోతున్నామంటూ బాధపడుతు న్నారని వివరించారు. కొంత మందికి మాత్రమే ఆ అవకాశం దక్కుతోందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. తక్షణమే పార్టీ ప్లీనరీని నిర్వహించాలని సూచించారు. ఈ విషయాలపై కాస్త సీరియస్‌గా ఆలోచించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారని కవిత తెలిపారు. బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషించకపోవడం చాలా మందికి నచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం గురించి ప్రస్తావిస్తారని అందరూ భావించినట్టు తెలిపారు. మొత్తంగా అధినేత నుంచి మరింత పదునైన విమర్శలను పార్టీ శ్రేణులు ఆశించినట్టు లేఖలో పేర్కొన్నారు. వక్ఫ్‌ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. పాత ఇన్‌చార్జీలనే నియమించడంతో.. పాత పద్దతిలోనే ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న సమాచారం వచ్చిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ-ఫామ్‌లు ఇన్‌చార్జీల ద్వారా కాకుండా.. అధినాయకత్వమే నేరుగా ఇవ్వాలని సూచించారు. ఎల్కతుర్తి మీటింగులో సభా వేదికపైకి కేసీఆర్‌ వచ్చే వరకు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వారితో మాట్లాడించి ఉంటే బాగుండేదని కవిత అభిప్రాయపడ్డారు. ధూం.. ధాం.. కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమైందన్నారు. భాజపాను టార్గెట్‌ చేయాలని వ్యక్తిగతంగా తాను కూడా అనుకున్నానని, వారి బాధితురాలిని కాబట్టి అలా అనుకుని ఉండొచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ విఫలమైందని, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచనలు శ్రేణుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత సుదీర్ఘంగా లేఖ రాసినందుకు క్షమించాలని కవిత పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -