Tuesday, March 31, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్చ‌లువ‌నిచ్చే మ‌జ్జిగ‌తో

చ‌లువ‌నిచ్చే మ‌జ్జిగ‌తో

- Advertisement -

వేసవిలో చలువ చేసే పదార్థాలకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలా చలువ చేసే పదార్థాల్లో మజ్జిగ ముందు వరుసలో ఉంటుంది. వేసవి తాపం పోవాలంటే ఒక్క గ్లాస్‌ మజ్జిగ తాగితే చాలు మస్త్‌ రిలీఫ్‌ ఉంటుంది. అయితే మజ్జిగను ఎప్పుడూ ఒకటే రీతిలో తాగాలంటే కాస్త బోరింగే. ఇక పిల్లలతై వద్దని ఏడుపు మొహం పెడతారు. అందుకే మజ్జిగను రకరకాల వెరైటీలుగా తాగడంతో పాటు చారులు కూడా చేసుకోవచ్చు. అవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…

పుదీనా మజ్జిగ
కావాల్సిన పదార్థాలు: జీలకర్ర – టేబుల్‌ స్పూన్‌, ధనియాలు – ముప్పావు టేబుల్‌ స్పూన్‌, ఇంగువ – పావు టీస్పూన్‌, ఐస్‌ క్యూబ్స్‌ – రెండు, కొత్తిమీర – కొద్దిగా, పచ్చిమిర్చి – రెండు, పుదీనా ఆకులు – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, బ్లాక్‌ సాల్ట్‌ – అర టీస్పూన్‌, పెరుగు – ఒకటిన్నర కప్పులు.
తయారీ విధానం: జీలకర్ర, ధనియాలు లో ఫ్లేమ్‌లో వేయించాలి. సగం పైనే వేగినాక ఇంగువ వేసి కలిపి మరికాసేపు వేయించాలి. జీలకర్ర, ధనియాలు మంచి గోల్డెన్‌ కలర్‌లోకి మారినాక పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు కొత్తిమీర సన్నగా తరగాలి. పుదీనా ఆకులను కొలత ప్రకారం తీసుకోవాలి. మిక్సీజార్‌లోకి వేయించిన జీలకర్ర మిశ్రమం, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు, ఐస్‌క్యూబ్స్‌, పచ్చిమిర్చి, ఉప్పు, బ్లాక్‌ సాల్ట్‌, పెరుగు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని మీగడ లేని పెరుగును వేసి బాగా కలపాలి. తర్వాత కప్పు పెరుగుకు మూడు కప్పుల చొప్పున నీరు పోసుకోవాలి. మరో ఐదు నిమిషాలు బాగా కలిపి చల్లచల్లగా సర్వ్‌ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా మజ్జిగ రెడీ.

మునక్కాడల మజ్జిగ పులుసు
కావాల్సిన పదార్థాలు: నాలుగు – మునక్కాయలు, అరటీస్పూన్‌ – పసుపు, రుచికి తగినంత – ఉప్పు, రెండు కప్పులు – పెరుగు, నాలుగు టీస్పూన్లు – శనగపిండి, టీస్పూన్‌ – అల్లం, నాలుగైదు టేబుల్‌ స్పూన్లు – నూనె, అరటీస్పూన్‌ – మెంతులు, టీస్పూన్‌ – జీలకర్ర, పచ్చిమిర్చి – పది, కొద్దిగా – కరివేపాకు, రెండు – ఉల్లిగడ్డలు, కొద్దిగా – కొత్తిమీర తరుగు, ఒకటి – నిమ్మకాయ
తయారీ విధానం: మునక్కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వాటిపై తొక్కను తీసి శుభ్రంగా కడగాలి. వెడల్పాటి గిన్నెలో మునక్కాయ ముక్కలు వేసి, అవి మునిగేంత వరకు నీళ్లు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మునక్కాడలు కాస్త మెత్తబడే వరకు బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మరో పెద్ద గిన్నె తీసుకుని అందులో కాస్త పుల్లగా ఉండే పెరుగు, శనగపిండి వేసుకుని విస్కర్‌తో ముద్దలు లేకుండా బాగా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత అందులో మూడు కప్పుల నీళ్లు పోసుకుని మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆయిల్‌ వేడి చేసి అందులో మెంతులను వేసి దోరగా ఫ్రై చేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొద్దిగా అల్లంపేస్ట్‌ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అనంతరం ఉల్లిగడ్డ తరుగు వేసి దోరగా వేయించుకోవాలి. అందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మునక్కాడలను వాటర్‌ వడకట్టి వేసుకుని ఆయిల్‌లో రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అందులో మజ్జిగ మిశ్రమం, మునక్కాడలు ఉడికించుకున్న నీళ్లను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవాలి. అది బాగా మరిగి బుడగలు వస్తున్నపుడు కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి, నిమ్మరసాన్ని పిండి ఓసారి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసుకుంటే చాలు. అంతే కమ్మని మునక్కాడ మజ్జిగ పులుసు రెడీ అవుతుంది!

సొరకాయ మజ్జిగ చారు
కావాల్సిన పదార్థాలు: పెరుగు – 600 ఎంఎల్‌, ఒకటిన్నర కప్పులు – సన్నని పచ్చికొబ్బరి ముక్కలు, టేబుల్‌ స్పూన్‌ – ఆవాలు, ఒకట్రెండు టేబుల్‌ స్పూన్లు – బియ్యం, నాలుగైదు – పచ్చిమిర్చి, టీస్పూన్‌ – మిరియాలు, అల్లం – అంగుళం ముక్క, సొరకాయ – ఒకటి, రెండు రెమ్మలు – కరివేపాకు, రుచికి సరిపడా – ఉప్పు, పిడికెడు – కొత్తిమీర తరుగు.
తయారీ విధానం: ముందుగా ఒకటిన్నర కప్పుల పచ్చికొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. అందులో మిరియాలు, ఆవాలు, సన్నని అల్లం ముక్కలు, బియ్యం, పచ్చిమిర్చి తుంపలు వేసుకొని తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. ఈలోపు సొరకాయ చెక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కోయాలి. అందులో ఎనిమిది కప్పుల మంచి నీళ్లు, కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. మీడియం ఫ్లేమ్‌లో సొరకాయ ముక్కలు సాఫ్ట్‌గా మారేంత వరకు ఉడికించుకోవాలి. మరీ మెత్తగా మగ్గించకూడదు. ఈలోపు నానబెట్టుకున్న పచ్చికొబ్బరి మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా పట్టి పక్కనుంచాలి. సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో పచ్చికొబ్బరి పేస్ట్‌ వేసి బాగా కలపాలి. స్టవ్‌ను హై-ఫ్లేమ్‌లో ఉంచి రెండు పొంగులు వచ్చేంతే వరకు మగ్గించుకొని దించి చల్లారనివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలో పుల్లని పెరుగును తీసుకుని విస్కర్‌తో ఉండలు లేకుండా బాగా చిలికి కొన్ని నీళ్లు పోసి పలుచగా చేయాలి. దీన్ని చిలికిన సొరకాయ మిశ్రమంలో పోసుకోవాలి. అలాగే సన్నని కొత్తిమీర తరుగు, మూడు నుంచి నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసి బాగా కలుపుకొని తాలింపు వేసుకుంటే సరి.

పాలకూర కాంబోలో
కావాల్సిన పదార్థాలు: పాలకూర – రెండు కట్టలు, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, తాలింపు గింజలు – టీస్పూన్‌, ఎండుమిర్చి – రెండు, వెల్లుల్లి రెబ్బలు – మూడు, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – అర టీస్పూన్‌, పచ్చిమిర్చి – రెండు, ఇంగువ – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – టీస్పూన్‌, పెరుగు – కప్పు, ఉల్లిగడ్డ – ఒకటి, కొత్తిమీర తరుగు – కొద్దిగా.
తయారీ విధానం: పాలకూర శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచాలి. అదే విధంగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని సన్నగా, పొడుగ్గా కట్‌ చేసుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరగాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర చిట్లినాక ఎండుమిర్చి, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఇంగువ, పాలకూర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి మీడియం ఫ్లేమ్‌లో మగ్గించాలి. పాలకూర నూనెలో సరిగ్గా వేగినాక కారం వేసి కలిపి మరికాసేపు వేయించాలి. కారం కూడా మగ్గినాక స్టవ్‌ ఆఫ్‌ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మరో గిన్నెలోకి చిక్కటి పెరుగు, అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. చల్లారిన పాలకూర మిశ్రమంలోకి కలిపి పెట్టుకున్న పెరుగును వేసి బాగా కలపాలి. చివరగా కట్‌ చేసిన ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు వేసి మిక్స్‌ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెరుగు పచ్చడి రెడీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -