Friday, November 21, 2025
E-PAPER
Homeజాతీయంనిర్బంధ ఈ-కేవైసీతో…కార్మికులకు 'ఉపాధి' గండం

నిర్బంధ ఈ-కేవైసీతో…కార్మికులకు ‘ఉపాధి’ గండం

- Advertisement -

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్న కార్మికుల ఉపాధికి ఇప్పుడు ఎసరు వచ్చింది. ఈ పథకం కింద లబ్ది పొందుతున్న కార్మికులందరికీ ఈ-కేవైసీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణం. ప్రైవేటు పరిశోధనా గ్రూపు లిబ్‌టెక్‌ ఇండియా లిమిటెడ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఉపాధి పథకంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కార్మికులలో సుమారు సగం మంది, మొత్తం కార్మికులలో మూడింట రెండు వంతుల మంది నేటి వరకూ తమ ఈ-కేవైసీలను పూర్తి చేయలేదు. ఉపాధి కార్మికులు తాజా పరిచిన ఆధార్‌ వివరాలు అందజేసి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో ఈ-కేవైసీ సమర్పించాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలకూ ఇటీవల సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచే మంత్రిత్వ శాఖ దీనిఅమలును మొదలు పెట్టింది. ఉపాధి పథకం కింద దేశంలో 26 కోట్ల మంది కార్మికులు పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 11.3 కోట్ల మంది క్రియాశీలక (యాక్టివ్‌) కార్మికులు. ఈ నెల 12వ తేదీ నాటికి మొత్తం కార్మికులలో 68.8 శాతం మంది, క్రియాశీలక కార్మికులలో 46.9 శాతం మంది తమ ఈ-కేవైసీలను పూర్తి చేయలేదు.

ఈ-కేవైసీని పూర్తి చేసే కార్మికులు తమ ఫొటోగ్రాఫ్‌లను అందించాల్సి ఉంటుంది. దీనిని రిఫరెన్స్‌ చిత్రంగా ఉపయోగిస్తారు. హాజరు నమోదు కోసం పని ప్రదేశంలో కార్మికుడిని ఫొటో తీసిన ప్రతి సందర్భంలోనూ దానిని రిఫరెన్స్‌ చిత్రంతో సరిపోలుస్తారు. రెండు ఫొటోలు మ్యాచ్‌ అయితేనే కార్మికుడి హాజరు నమోదవుతుంది. లేనిపక్షంలో పనికి అనుమతించరు. పని ముగిసినప్పుడు తీసే ఫొటోతో రిఫరెన్స్‌ చిత్రం మ్యాచ్‌ కాకపోతే చేసిన పనికి వేతనమూ రాదు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా కార్మికులు ఈ-కేవైసీ పొందలేకపోతున్నారని లిబ్‌టెక్‌ ఇండియాలో పనిచేస్తున్న పరిశోధకుడు రాహుల్‌ స్వయోరా చెప్పారు. వలసల కారణంగా సకాలంలో ఈ-కేవైసీ సమర్పించలేకపోతున్న కార్మికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నదని ఆయన తెలిపారు. సుశిక్షితులైన సిబ్బంది లేకపోవడం, స్మార్ట్‌ఫోన్ల కొరత, గ్రామీణ-మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్‌ సౌకర్యం కొరవడడం వంటి కారణాలతో ఈ-కేవైసీ ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. మధ్యప్రదేశ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మొత్తం కార్మికులలో 93.9 శాతం, క్రియాశీలక కార్మికులలో 90.5 శాతం మందికి ఈ-కేవైసీలు లేవు. గుజరాత్‌, హర్యానా రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -