మన నడవడిక, శ్రమ చేసే విధానం, పట్టుదల- ఇవన్నీ కలిపితేనే మన వ్యక్తిత్వం. మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి కావలసిన ఏకైక ఆయుధం సరైన వ్యక్తిత్వమే. దానికి సరైన ఉదాహరణ శ్రీకాంత్ జీవితమే అని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకుని, ఎలా జీవితంలో మంచి స్థాయికి, ఎలా ఎదిగాడో ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. మనిషిలో దాగిన అపారమైన శక్తిని బయటకు తీయగల ఒక అద్భుతమైన శక్తి మోటివేషన్. సాధారణ పరిస్థితుల్లో అసాధ్యం అనిపించే లక్ష్యాలను కూడా చేదించడానికి ఇది మనిషిని నడిపిస్తుంది. దానికి అర్జున్ విజయమే ఒక నిదర్శనం. ఒక సాధారణ పల్లెటూరి కుర్రాడు అర్జున్, ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకునే వాడిని మోటివేట్ చేస్తే, అతను సాధించిన విజయమే మోటివేషన్ కున్న శక్తికి నిదర్శనం.
ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరాలనుకుంటాడు. కానీ దానికి కేవలం ఆశ ఉండటం సరిపోదు. దానికి తగిన శ్రమ చేయాలి. మాటలు చెబితే కాదు, పనులు చేయాలి. దానికి కషి, ప్రయత్నం అవసరం. కషి లేని ఆశ, పునాదిలేని ఇల్లు నిలబడదు. చాలాసార్లు మన చుట్టూ ఉన్న ”ప్రతికూల పరిస్థితులు” వల్లనో, లేక మన ‘మకిలి పట్టిన ఆలోచన విధానం’ వల్లనో, ఆ కషి సరైన రీతిలో సాగదు. అప్పుడు మనం అనుకున్న లక్ష్యం చేరడం కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం మోటివేట్ చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. ప్రపంచం మనల్ని వెనక్కి లాగుతుంటే మనం మనల్ని పట్టుకోవాలి. అదే నిజమైన బలం, అదే నిజమైన తెలివి.
భయం వచ్చినప్పుడు మనం అప్రమత్తంగా మారిపోతాం. ఆనందం వచ్చినప్పుడు మన హావభావాలు మారిపోతుంటాయి. అలాగే మోటివేషన్ కూడా మన జీవితంలో ఒక సహజ స్పందనగా మారాలి. మన జీవన విధానంలో ఇది భాగం కావాలి. కేవలం మన లక్ష్యం కోసమో ,మన జాబ్ కోసమో మాత్రమే కాకుండా మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి, పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటానికి మోటివేషన్ ను, ఒక ఎమోషన్ లాగా మన మనసులోకి ఎక్కించుకోవాలి.
ఒత్తడిని ఎలా అధిగమించాలి? కృషికి సరైన మార్గం ఏమిటి? మరియు విజయానికి నిజమైన కొలమానం ఏమిటో ఈ రచన స్పష్టం చేస్తుంది. విజువలైజేషన్ టెక్నిక్, ప్రాబ్లం సొల్యూషన్ మెథడ్ మరియు మోటివేషన్ ను, ఒక కొత్త ఎమోషన్ గా మార్చుకునే విధానం – ఇవన్నీ మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి. మీ విజయానికి నిజమైన సూత్రాలను తెలుసుకోవడానికి, మీరు ఊహించని శక్తిని మీలో నింపుకోవడానికి, ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
- కె.పి.అశోక్ కుమార్
9700000948



