Sunday, October 5, 2025
E-PAPER
Homeసమీక్షసామాజిక స్పృహతో… రేపటి కాలం కవిత్వం..!

సామాజిక స్పృహతో… రేపటి కాలం కవిత్వం..!

- Advertisement -

Poets are the unacknowledged legislators of the world అంటారు షెల్లీ. ఎదిరెపల్లి కాశన్న కొన్ని సందర్భాల్లో రాసిన కొన్ని కవితలు చదివితే మనకు షెల్లీ మాటలు గుర్తుకు వస్తాయి. మూల చుక్క, తిరుగబడే నిషిద్ధున్ని తర్వాత ముచ్చటగా మూడోసారి తనదైన శైలి కవనాలతో సమాజాన్ని ప్రభావితం చేయడానికి ‘రేపటి కాలం’ పేరుతో మన ముందుకు వచ్చారు కాశన్న. ‘ఆకలి, అవమానం, అంటరానితనం, పేదరికం నన్ను వెంటాడినవి. ఆ గాయాల బాధలు అధిగమించి సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తుతూ, ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ ‘అస్తిత్వ చైతన్యం’ కోసం కవిత్వం ద్వారా సమాజ పోకడలో ప్రశ్నిస్తూనే ఉంటానంటారు’ కవి.

”పుట్టలా పెరిగిన ఆస్తులుంటే/ పెద్దల సభకు అర్హులు/ త్యాగం సేవ/ సామాజిక న్యాయం దండగ” అంటూ పుస్తకంలోని మొదటి కవితలోనే నేటి రాజకీయాలపై ‘అందరిదీ అదే దారంటూ’ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉన్నవాళ్లు పోట్లాడాల్సిన సమరంలో వెనకడుగు వేసిన వాళ్ళు పదవుల పందెంలో విజేతలైండ్రు! అంటూ తన అసహనాన్ని అక్షరాలుగా వ్యక్త పరుస్తున్నారు. విజయం తొలిమెట్టు.రేపటి కాలానికి ఆమె విజయపతాకమనీ, నికత్‌ విజయాన్ని,స్వర్ణ పతాకాన్ని తెలంగాణ కీర్తిగా అభివర్ణించారు. ఓ కవితలో కులం కంపుతో నిండిన కడుపులను చూడండి/ దేశం వెనుకబడడానికి మీలాంటి అజ్ఞానులే /అంటూ తన అక్షరావేశాన్ని ప్రదర్శిస్తారు.

వీరుల త్యాగాన్ని పడమరలో ఉరితీస్తే/తూర్పున ఉదయిస్తుంది!! అంటూనే శాంతి మార్గంలో మబ్బులెన్నో కమ్మినా / విప్లవ తోవన చైతన్యపు పోరుతో నిరంతర గానం చేస్తున్నారు. చిన్న మొక్కను చూసి ఆకాశానికి జ్వరం మొదలైంది!
కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది/అబద్ధం ఏనాటికీ నిజం కాదంటూ… ఇంకా యుద్ధం మొదలవ్వలేదని ఇప్పుడిప్పుడే కాస్త భూమి వేడెక్కుతుందని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ఎదుగుతున్న కొద్దీ/ కాలం ఆత్మవంచనకు గురి చేసిందని,ప్రలోభాల ఉచ్చులో పడి పతనం దరికి చేరితే, వాళ్ళు చేసే తప్పుడు పనులకు శిక్ష మనం అనుభవించాలంటూ క్షమించరాని నేరాన్ని లెక్కించారు.

అధికారాలు మీకు/అవమానాలు మాకు/ నీటిమీద రాతల/గాలి మాటల, బూటకాలే నీదంతా/ శూన్య హస్తాల స్వాతంత్య్రం! మాకెందుకంటూ మేము మనుషులమే/ఈ దేశ మూలవాసుల బతుకుల గురించి గట్టిగానే ప్రశ్నించారు.
పనికిరాని పాఠాలు చెప్పే కన్నా/ జాతీయవాదం నూరి పోయండి/మనకు,దేశానికి మంచిదే పంతుళ్లూ/ఇకనుండైనా దేశభక్తి పాఠాలు బోధించండంటూ దేశాన్ని రక్షించడం కోసం… ఉపాధ్యాయులు నేటి నవభారత నిర్మాణంలో విద్యార్థుల్ని కీలక భాగస్వాములుగా మార్చమని ఓ కవితలో చెప్పారు.
దేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన భగత్‌ సింగ్‌, ప్రపంచం మెచ్చిన లౌకిక,ధడ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌, శాంతి, అహింస మార్గాలతో మన దేశ స్వాతంత్య్రానికి బాటలు వేసిన మహాత్మా గాంధీజీ వంటి మహానుభావుల త్యాగ పరిమళాలను తన అక్షరాల గుండా ప్రసరింప జేశారు.

అతని పాట రోదన/ రోదనే మంచి పాట/కన్నీటి చుక్క ఒక దశ్యం/ ఒక్కటొక్కటిగా రాలి సముద్రమైతది/దాహంతో దేపరిల్లుతున్న పెదాలు/ వినసొంపైన పాటను/చెవులు రెక్కించి వింటున్నాయి/ ఒకడు పుడతాడు/సమాజంకై జీవిస్తాడు!! వంటి బలమైన వాక్యాలు పుస్తకంలోని చాలా కవితల్లో పాఠకుల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మనలోని ప్రశ్నల్ని మనమే ప్రశ్నించుకొని, జవాబు వెతుక్కోమంటూ కొంచెం ఘాటుగానే చెప్తుంటాయి.
ఇవి చౌకీదారు మాటలా/ చౌకబారు మాటలా/ చావు నోట్లో తలపెట్టి ప్రజలు మింగలేక కక్కలేక చస్తున్నారు/ ఆకలి చావుల్లో,అత్యాచారాల్లో, హత్యల్లో నా దేశం ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌! అంటూ ఆవేదన తడిసిన అక్షరాలతో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు రచయిత.

జీవన పోరాటంలో ఆమె రాల్చిన కన్నీటి చుక్కలు మేఘమై,ఒక రాగమై వెళ్ళిపోయిందని, నువ్వు నా కళ్ళ ముందు లేని వేళ/నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న/ కన్నీటి సిరానై రాస్తున్న..! అమ్మా …అంటూ రచయిత తన అమ్మ గురించి నీ ముద్దుల కొడుకుగా నన్ను గారాబంగా పెంచావు కదా..! అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ..! నీకు వందనం అంటూ అమ్మ జ్ఞాపకాలలో… కొన్ని కన్నీటి చుక్కలను రాలుస్తారు. పాఠకుల గుండెల్ని తన కన్నీటి అక్షర తడిలో తడిసిపోయేలా చేశారు.
ఎర్ర బస్సుగా పురుడు పోసుకుని పల్లె వెలుగై వికసించి పొద్దుతో పోటీపడుతున్న ఆర్టీసీ జీవితాంతం పోరాటమంటూ ఆర్టీసీ కార్మికుల గురించి, ప్రయాణికుల గురించి తనదైనశైలిలో ఓ కవితలో పేర్కొన్నారు.

ఇలా పుస్తకం నిండా అన్ని కవితల్లో సామాజిక అంశాలను ముడిపెట్టి,ప్రజా సమస్యలపై కొంచెం వ్యంగంగా, కొన్ని సందర్భాల్లో సూటిగా కాశన్న తన ఆలోచనలను అక్షరాగ్నులుగా మలిచారు. ఎవరు అవునన్నా కాదన్నా రేపటి కాలం నలుపుదే!! అంటూ ఒక కవితలో తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. కాశన్న ఆలోచనలతో,భావాలతో మనం ఏకీభవించిన, ఏకీభవించకపోయినా సరే..! ఆయన రచనలు చదివి మనం విశ్లేషించవచ్చు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, ఆయన జీవన విధానం ఏదైనాప్పటికీ ప్రజాస్వామ్య బద్ధంగా కాశన్న రచనలను మనం స్వాగతించి ఓ కరచాలనం అందిద్దాం. అంతిమంగా ఏం గెలుస్తుందో.. ”రేపటి కాలం” మనుగడకు,సత్యానికి వదిలేసి వారి కలం నుంచి ఇంకా ఎన్నో కవిత్వ సంపుటాలు రావాలనీ, అభినందిస్తూ… మనఃస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం.

  • ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -