Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమెట్రో విస్తరణతో మళ్లీ దేశంలో అగ్రస్థానంలో నిలవాలి

మెట్రో విస్తరణతో మళ్లీ దేశంలో అగ్రస్థానంలో నిలవాలి

- Advertisement -

తుది దశలో ప్రభుత్వ స్వాధీనం ప్రక్రియ : హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌
మెట్రో రైల్‌ ఆఫీస్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు


నవతెలంగాణ-సిటీబ్యూరో
నగర రవాణా రంగంలో హైదరాబాద్‌ మెట్రోను విస్తరించి, దేశంలో మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అన్నారు. సోమవారం హెచ్‌ఎం ఆర్‌ఎల్‌ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఎండీ ఆవిష్కరించి ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు.
గత ఏడాది సంస్థకు అత్యంత కీలకమైనదని చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్‌లో ఉన్న 69 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన భూసేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అదనపు కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

త్వరలోనే ఈ పనులు పట్టాలెక్కనున్నాయని, హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు అత్యంత ముఖ్యమైన సమయమని అన్నారు. ప్రారంభ దశలో హైదరాబాద్‌ మెట్రో ప్రణాళిక ఢిల్లీ మెట్రో ఫేజ్‌-1 కంటే భారీగా రూపొందించి, దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ఢిల్లీ మెట్రో సుమారు 400 కిలోమీటర్లకు విస్తరించగా, హైదరాబాద్‌ మెట్రో 69 కిలోమీటర్ల వద్దే నిలిచిపోయిందన్నారు. ఈ స్తబ్దతను ఛేదించి, మెట్రో విస్తరణ ద్వారా హైదరాబాద్‌ను తిరిగి దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకురావడానికి అందరూ కంకణబద్ధులై పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ డివిఎస్‌.రాజు, సీనియర్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -