– సీబీఐ దర్యాప్తుపై హైకోర్టుకు హామీనిచ్చిన రాష్ట్ర సర్కారు
– ఘోష్ కమిషన్ రిపోర్టుతో విచారణ చేయొద్దని ఆదేశం
– కేసు అక్టోబర్ ఏడుకు వాయిదా
– కాళేశ్వరం పిటిషన్లపై కేసీఆర్, హరీశ్‌రావుకు వెసులుబాటు
నవతెలంగాణ-హైదరాబాద్
ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ నివేదిక సిఫారసులకు అనుగుణంగా దర్యాప్తు ఉండదనీ, కేసీఆర్, హరీశ్‌రావుపై చర్యలు కూడా తీసుకోబోమని హామీనిచ్చింది. ప్రభుత్వ హామీలను రికార్డు చేసిన హైకోర్టు అందుకు అనుగుణంగా మధ్యంతర ఉత్వర్వులను వెలువరించింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా పిటిషనర్లపై చర్యలు తీసుకోరాదనీ, కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేయరాదని, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రిపోర్టు ఆధారంగా ముందుకెళ్లాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, పర్యవేక్షణ తదితరాలపై జాతీయ ప్రాజెక్టు భద్రతా మండలి (ఎన్‌డీఎస్‌ఏ) రాష్ట్రానికి ఇచ్చిన మధ్యంతర, తుది నివేదికల ఆధారంగా విచారణకు అనుమతిచ్చింది. పీసీ.ఘోష్ కమిషన్ రిపోర్టుపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు వేర్వేరుగా వేసిన మధ్యంతర పిటిషన్లతోపాటు.. జీవో 6 ద్వారా ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్‌ను సవాల్ చేసిన ప్రధాన పిటిషన్లపై విచారణను అక్టోబర్ ఏడో తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులిస్తూ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏకే.సింగ్, జస్టిస్ జీఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ఆదేశించింది.
పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నదని రాష్ట్ర సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి బెంచ ముందు వాదించారు. పిటిషనర్లు కమిషన్ రిపోర్టును సవాలు చేశారనీ, ఇప్పుడు సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో చర్యలు తీసుకోరాదని వారు ఆందోళనతో వేసిన మధ్యంతర పిటిషన్లపై విచారణ అవసరం లేదని వాదించారు. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టు పెట్టాక చర్యలు ఏమైనా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారా? అని చీఫ్ జస్టిస్ ఏజీని ప్రశ్నించారు. అసెంబ్లీలో సమగ్రంగా చర్చ జరిగిందనీ, చర్యలపై నిర్ణయం తీసుకోలేదని వాదించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీబీఐ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తుందనీ, ప్రభుత్వానికి సీబీఐ రిపోర్టు మాత్రమే ఇస్తుందని చెప్పారు. కమిషన్ రిపోర్టు ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉండదనీ, ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళుతుందని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయని వివరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను అనుమతిస్తూ రాష్ట్ర సర్కారు విడుదల చేసిన జీవో కాపీని హైకోర్టుకు అందజేశారు. సీబీఐ దర్యాప్తునకు జారీ చేసిన ఆదేశాల్లో వ్యక్తిగతంగా ఎవరి పేర్లు కూడా లేవనీ, ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడమే ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ నిరంజన్‌రెడ్డి కూడా వాదించారు.
కేసీఆర్, హరీశ్‌రావు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు దామా శేషాద్రినాయుడు, ఆర్యమ సుందరం వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని రికార్డు చేసి ఆమేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బెంచ్‌ను కోరారు. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టు పెట్టి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన అవినీతి మూలాలన్నీ బయటపడ్డాయని, అవినీతిపరులపై చర్యలు తప్పవని నేరుగా సీఎం చెప్పారని వాదించారు. తీరా కమిషన్ రిపోర్టుపై ఏ చర్యలు తీసుకోకుండానే అసెంబ్లీ ముగిసిందని చెప్పారు. నిజంగానే కమిషన్ రిపోర్టులో అవినీతి ఎక్కడ ఉందో తేలిఉంటే చర్యలు ఎందుకు తీసుకోలేదని అడిగారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేయకుండానే సీబీఐ దర్యాప్తు చేయాలనే నిర్ణయాన్ని సీఎం ప్రకటించారని ప్రస్తావించారు. కమిషన్ రిపోర్టుపై చర్యలు తీసుకోకుండా, అసెంబ్లీ తీర్మానం చేయకుండా సీబీఐ దర్యాప్తునకు జివో ఇవ్వడం వెనుక అనేక అనుమానాలు కూడా ఉన్నాయని వాదించారు. కమిషన్ రిపోర్టును పూర్తిగా పక్కకు పెట్టాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుని ఉంటే ఆ రిపోర్టులోని అంశాలను సీబీఐ దర్యాప్తును కోరుతూ రాష్ట్రం ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఎందుకు పేర్కొన్నారని అడిగారు.
ఇరుపక్షాల వాదనల తరువాత హైకోర్టు ధర్మాసనం.. ‘ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై సుప్రీం కోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన ఏర్పాటైన ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యం తర ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు చేయరాదని కూడా ఆదేశించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ రిపోర్టుల ఆధారంగానే సీబీఐ దర్యాప్తు ఉండాలంది. తదుపరి ఉత్త ర్వులు జారీ చేసే వరకు పిటిషనర్లు కేసీఆర్, హరీశ్ రావులపై చర్యలు తీసుకోరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మెయిన్, మధ్యంతర పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు పిటిషన్లు దాఖలు చేయాలనీ, కౌంటర్లపై పిటిషనర్లు రిప్లరు కౌంటర్లు వేయాలని సూచిస్తూ అక్టోబర్ ఏడో తేదీకి విచారణను బెంచ్ వాయిదా వేసింది.
ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టుతోనే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES