- న్యూజిలాండ్‌తో భారత్ రెండో వన్డే నేడు
- విజయమే లక్ష్యంగా బరిలోకి టీమ్ ఇండియా
- మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
న్యూజిలాండ్ వన్డేల్లో వరుస (9) విజయాల జోరుకు వడోదరలో బ్రేక్ వేసిన టీమ్ ఇండియా.. నేడు రాజ్‌కోట్‌లో సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి వన్డేలో టాస్ ఓడినా.. విజయం కోసం భారత్ ఆఖరు వరకు పోరాడేలా చేసింది. అనుభవలేమి జట్టుతోనే భారత్‌కు పోటీ ఇచ్చామనే ఆత్మవిశ్వాసం కివీస్ శిబిరంలో కనిపిస్తోంది. రాజ్‌కోట్‌లో ధనాధన్ జోరుతో సాధికారిక విజయం సాధించాలనే ఉత్సాహం గిల్‌సేనలో కనిపిస్తోంది.
నవతెలంగాణ-రాజ్‌కోట్
వడోదరలో న్యూజిలాండ్ ఓడినా.. మ్యాచ్‌ను 99వ ఓవర్‌కు తీసుకొచ్చిన ఉత్సాహం ఆ జట్టు డ్రెస్సింగ్‌రూమ్‌లో సుస్పష్టం. ఏమాత్రం అనుభవం లేని ఆటగాళ్లతోనే బలమైన భారత్‌ను విజయం కోసం శ్రమించేలా చేశామనే భావన ఆ జట్టులో కనిపిస్తోంది. రాజ్‌కోట్ వన్డేలో విజయం కోసం పోరాడేందుకు కివీస్‌కు వడోదర మ్యాచ్ స్ఫూర్తిగా నిలుస్తోంది. భారత్‌కు విరాట్ కోహ్లి, న్యూజిలాండ్‌కు డార్లీ మిచెల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇరు జట్ల నుంచి ఈ ఇద్దరు బ్యాటర్లకు తోడుగా సహచర బ్యాటర్లు మెరిస్తేనే నేడు రాజ్‌కోట్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే నేడు.
నితీశ్‌కు అవకాశం?
స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బ్యాటర్ ఆయుశ్ బదోనికి జట్టులో చోటు లభించింది. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జట్టులో ఉన్నాడు. దీంతో వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి, ఆయుశ్ బదోనీలలో ఒకరిని తుది జట్టులోకి ఎంచుకోనున్నారు. చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేసర్ హర్షిత్ రానాను ఆల్‌రౌండర్‌గా పరిగణిస్తున్నాడు. ఈ సమీకరణాలు చూస్తే.. నితీశ్‌కు అవకాశం లభించేది అనుమానంగానే ఉంది. విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ కొనసాగించగా.. రోహిత్ శర్మ సైతం జోరందుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ తనదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో రాహుల్ ముందుకొచ్చే అవకాశం లేకపోయినా.. ఆఖర్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాలని అతడు ఎదురుచూస్తున్నాడు. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవీంద్ర జడేజాతో కలిసి కుల్‌దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు.
మరోవైపు న్యూజిలాండ్ శిబిరంలో పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదు. లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ వడోదరలో నిరాశపరిచాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ జైడెన్ లెనాక్స్‌ను ఆదిత్య స్థానంలో తీసుకునే ఆలోచన లేకపోలేదు. హెన్రీ నికోల్స్, మిచెల్ హేలు బ్యాటింగ్ లైనప్‌లో కుదురుకున్నారు. సీనియర్లు డెవాన్ కాన్వే, విల్ యంగ్, డార్లీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రాస్‌వెల్‌పై కివీస్ బ్యాటింగ్ భారం పడనుంది. బంతితో మరోసారి పేసర్ కైల్ జెమీసన్ న్యూజిలాండ్‌కు కీలకం కానున్నాడు. రాజ్‌కోట్‌లో టాస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. మంచు ప్రభావం ఉన్నప్పటికీ.. ఇరు జట్లు అందుకు తగినట్టుగా అలవాటు పడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 350 ప్లస్ పరుగులు చేయటంపై ఫోకస్ పెట్టనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్, రవీంద్ర జడేజా, హర్షిత్ రానా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డార్లీ మిచెల్, మిచెల్ హే (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకల్ బ్రాస్‌వెల్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జెమీసన్, జాక్ ఫౌల్క్స్, ఆదిత్య అశోక్.



