బుమ్రాపై ఇంకా తేల్చలేదు
భారత సహాయక కోచ్ రయాన్
బర్మింగ్‌హామ్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్‌తో ‘టెండూల్కర్- అండర్సన్’ ట్రోఫీ రెండో టెస్టులో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని టీమ్ ఇండియా సహాయక కోచ్ రయాన్ తెలిపాడు. భారత్, ఇంగ్లాండ్ రెండో టెస్టు బుధవారం నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో జరుగుతుంది. నాలుగు రోజులుగా ఎడ్జ్‌బాస్టన్‌లో కఠోర సాధన చేస్తున్న టీమ్ ఇండియా తుది జట్టు కూర్పుపై కుస్తీ పడుతోంది. ఇంగ్లాండ్ రెండో టెస్టుకు ఎటువంటి మార్పులు లేకుండా ఆడనుండగా.. భారత్ పలు మార్పులు చేయాలని ఆలోచన చేస్తుంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా అసిస్టెంట్ కోచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై స్పందించాడు.
కాంబినేషన్‌పై ఆలోచన
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇద్దరు స్పిన్నర్లతో ఆడతామని కచ్చితంగా చెప్పగలను. కానీ ఇద్దరు స్పిన్నర్లుగా ఎవరిని ఎంచుకోవాలనే తర్జనభర్జన నడస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ బాగా చేస్తున్నాడు. ఏ కాంబినేషన్‌తో వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఎంచుకోవాలా? ఆల్‌రౌండర్ స్పిన్నర్‌ను తీసుకోవాలా? అనేది తేలాల్సి ఉంది. పిచ్‌పై ప్రస్తుతం 11మీమీ పచ్చిక ఉంది. బుధవారం రోజు వర్షం సూచనలు సైతం ఉన్నాయి. ఈ పిచ్‌పై స్లో బౌలర్లకు వికెట్ల వేట సులభతరం. ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టేందుకు ఎటువంటి దళాన్ని ఎంచుకోవాలనే ఆలోచన చేస్తున్నాం. 400/3తో ఉన్నప్పుడు టెయిలెండర్ల గురించి, బ్యాటింగ్ చేయగల బౌలర్ గురించి ఆలోచన అక్కర్లేదు. కానీ 200/5తో ఉన్నప్పుడు సమీకరణాలు మారిపోతాయని రయాన్ అన్నాడు.
ఆఖరు నిమిషంలోనే..!
భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్, పని భారంతో ఐదు టెస్టుల్లో మూడింటిలోనే ఆడనున్నాడు. తొలి టెస్టులో ఆడిన బుమ్రా ఇప్పుడు విశ్రాంతి తీసుకుని లార్డ్స్‌లో ఆడతాడా? లేదంటే ఇక్కడే ఆడి మూడో టెస్టులో రెస్ట్ తీసుకుంటాడా? అనేది తేలాల్సి ఉంది. ‘బుమ్రా రెండు రోజులుగా నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ సాధన చేస్తున్నాడు. ప్రస్తుతానికి అతడు సౌకర్యవంతంగా కనిపిస్తున్నాడు. కానీ, బుమ్రా తుది జట్టులో నిలిచే అంశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. మ్యాచ్‌కు ముందు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోగలమని’ రయాన్ తెలిపాడు. బర్మింగ్‌హామ్ టెస్టులో మూడు రోజులు (1, 3, 5) వర్షం సూచనలు ఉన్నాయి. ఆటకు వర్షం మూడు రోజులు ఆటంకం కలిగించే పరిస్థితులు ఉంటే.. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశాలు స్వల్పం అవుతాయి. దీంతో ఈ టెస్టులో బుమ్రాను ఆడించే అవసరం లేదనే భావన సైతం టీమ్ మేనేజ్‌మెంట్‌లో కనిపిస్తోంది!.