Thursday, April 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలులేబర్‌కోడ్‌లు వెనక్కి తీసుకోండి

లేబర్‌కోడ్‌లు వెనక్కి తీసుకోండి

- Advertisement -

లేదంటే సమరశీల పోరాటాలే
ట్రేడ్‌ యూనియన్‌ నేతల హెచ్చరిక
లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో బ్లాక్‌డే
కార్మిక సంఘాల నిరసన ర్యాలీ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మోడీజీ..ఆ నాలుగు లేబర్‌ కోడ్‌లను వెనక్కి తీసుకోండి.. లేదంటే..గద్దె దిగిపోండి.’ అంటూ ట్రేడ్‌ యూనియన్‌ నేతలు హెచ్చరించారు. కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయకపోతే సమరశీల పోరాటాలను ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ల అమలుకు నిరసనగా బుధవారం హైదరాబాద్‌లో కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ‘బ్లాక్‌డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ గూడ చౌరస్తా నుంచి చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా కార్మిక శాఖ కార్యాలయం వరకు నల్ల జెండాలు, బ్యాడ్జీలు, బ్యానర్లు చేతబూని నల్ల చొక్కాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

‘ పోరాడి సాధించుకున్న హక్కులను హరించటం సిగ్గు..సిగ్గు, కార్మికులకు ఉరితాళ్లుగా మారిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలి, పని గంటలు పెంచితే.. మోడీని గద్దె దించుతాం, కార్పొరేట్లకు తాబేదార్‌ మోడీ డౌన్‌డౌన్‌, కార్మికుల ఐక్యత వర్థిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జరిగిన సభలో ఐఎన్‌టీయూసీ నాయకులు ఆర్‌.డీ చంద్రశేఖర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాలరాజ్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె. సూర్యం, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌, బీఆర్‌టీయూ అధ్యక్షులు జి. రాంబాబు యాదవ్‌, ఏఐయూటీయూసీ నాయకులు భరత్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను అమలు చేస్తే దేశంలోని 47 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు, 25 కోట్ల సంఘటిత ఉద్యోగ, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో ప్రజల ఆర్థిక వ్యవస్థ దిగజారుగుతున్నదని అన్నారు. నిరుద్యోగం, దరిద్య్రం పెరుగుతోందని తెలిపారు.

ప్రజాస్వామిక హక్కులపై దాడులు పెరుగుతున్నాయని విమర్శించారు. సమ్మె చేసే, నిరసన తెలిపే హక్కులను కేంద్రం హరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే కార్మిక, ప్రజా, రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ, రమ, విఎస్‌. రావు, జె. మల్లిఖార్జున్‌, కె. ఈశ్వర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్‌, ఎం. పద్మశ్రీ, పుప్పాల శ్రీకాంత్‌, కూరపాటి రమేష్‌, పి. సుధాకర్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ అధ్యక్ష, కార్యదర్శలు ఎం దశరథ్‌, జె. కుమారస్వామి, సిటీ నాయకులు కె. అజయ్ బాబు, మహేందర్‌, జి రాములు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు నర్సింహా, బి. వెంకటేష్‌, నగర ప్రధాన కార్యదర్శి యాదగిరి, ప్రేమపావని, కిషన్‌, ఐఎన్‌టీయుసి నాయకులు నాగన్న గౌడ్‌. రమణారెడ్డి, ఐఎఫ్‌టీయూ శివబాబు, అనూరాధ, అరుణక్క, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎల్‌. పద్మ, నగర కార్యదర్శి ప్రదీప్‌, కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మెన్‌ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -