వ్యవసాయ వినియోగదారుల విభజన సరికాదు
ఈఈఈఐ అఖిలభారత ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్తా
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలి : టీజీయూఈఈయూ రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడవ డిస్కంను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఈఈఈఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి సుదీప్ దత్తా డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన తెలంగాణ యునైటైడ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తా మాట్లాడుతూ వ్యవసాయ, ఇతర సబ్సిడీ వినియోగదారులను వేరు చేసి, రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేసేలా మూడవ డిస్కమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 17 డిసెంబర్ 2025న జారీ చేసిన జీవో 44ను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల విడుదలైన ముసాయిదా విద్యుత్ (సవరణ) బిల్లు 2025 నేపథ్యంలో, గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేందుకు పన్నుతున్న కుట్రలో భాగమేనని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ, ఇతర సబ్సిడీ వినియోగదారులను వేరు చేయడం వల్ల ప్రభుత్వ విద్యుత్ సంస్థలు విచ్ఛిన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ దక్షిణ, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక ఒత్తిడికి వ్యవసాయ విద్యుత్ సరఫరా కారణం కాదని అన్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్, నీటి సరఫరా పథకాల కోసం ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలు ఆలస్యంగా రావడం, భారీగా బకాయిలు పేరుకుపోవడం, ఖరీదైన దీర్ఘకాల ట్రాన్స్‌మిషన్, పవర్ కొనుగోలు ఒప్పందాలు, స్వంత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో నిర్లక్ష్యం, మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడటం వల్లే సంస్థలు నష్టాల ఊబిలో కూరుకు పోయాయని అభిప్రాయపడ్డారు. వాస్తవాలను పక్కన పెట్టి కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా తెలంగాణ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసే యత్నాలను రాష్ట్రప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో తెలంగాణ యునైటైడ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వర్‌రావు, నలువాల స్వామి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ఆర్.సుధాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ డిస్కం వల్ల నష్టాలు
మూడవ డిస్కం ఏర్పాటు వల్ల జరిగే నష్టాలపై రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలను ప్రతిపాదించారు. ”మూల సమస్యలు పరిష్కరించకుండా, వ్యవసాయ, ప్రజాసేవ వినియోగదారులను వేరు చేసి కొత్త సంస్థగా రూపొందించడం ద్వారా ప్రభుత్వం కేవలం లెక్కల మార్పిడి చేయాలని చూస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ సమగ్రంగా అభివృద్ధి చెందింది. గ్రామీణ విద్యుద్ధీకరణ, ఫీడర్ విభజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల బలోపేతం, ఏకీకృత ఆపరేషన్ నియంత్రణ సమగ్ర వ్యవస్థగా ఉన్నాయి. 5.2 లక్షలకుపైగా వ్యవసాయ డీటీఆర్‌లు, 2.6 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల ఎల్‌టీ లైన్లు, రూ. 5,000 కోట్ల విలువైన ఆస్తులను మూడో డిస్కమ్‌కు బదిలీ చేయడం సమగ్ర వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. గ్రామీణ, రెండో శ్రేణి పట్టణ ప్రాంతాల్లో బ్రేక్‌డౌన్‌ల సమయంలో నిర్వహణ గందరగోళంగా మారుతుంది. ఆస్తుల బాధ్యతలు విడిపోయి సాంకేతిక, వాణిజ్య నష్టాలు పెరుగుతాయి. ఇంధన లెక్కల నిర్వహణ, ఇంటర్‌ఫేస్ మీటరింగ్, వీలింగ్ చార్జీలపై డిస్కమ్‌ల మధ్య వివాదాలు పెరిగి సరఫరా నాణ్యత దెబ్బతింటుంది” అని సమావేశం తీర్మానించింది.
వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడం వ్యవసాయాన్ని రాష్ట్ర సామాజిక బాధ్యత నుంచి తప్పించి డబ్బులు వసూలు చేసే విధానంగా పేర్కొంది. ”వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను నష్టాలకు కారణంగా చూపించి, వ్యవసాయేతర వినియోగదారుల్లో అది భారం అన్న భావన పెంచే ప్రయత్నం జరుగుతుంది. దీంతో క్రాస్ సబ్సిడీ, ప్రజాసేవ సూత్రాలు బలహీనపడతాయి. భవిష్యత్‌లో టారిఫ్ పెంపులు లేదా సేవల లోపాలను ”సబ్సిడీ రంగాల” మీద నెట్టివేస్తారు. నాణ్యమైన విద్యుత్‌పై పూర్తిగా ఆధారపడిన ఈ రంగాలు. సబ్సిడీ చెల్లింపుల్లో ఆలస్యం లేదా ఆర్థిక ఒత్తిడి వస్తే వీటిపై నేరుగా ప్రభావం పడుతుంది. ప్రభుతం నిధులు విడుదల చేయడంలో అంతరాయం ఏర్పడితే రైతుల తాగు, సాగునీటి, మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. సబ్సిడీ వినియోగదారుల విభజన ప్రయివేటీకరణకు ముందస్తు చర్య. వ్యవసాయం, ప్రజాసేవ వినియోగదారులను వేరు చేసిన తర్వాత, మిగిలిన డిస్కమ్‌లను ”వాణిజ్యపరంగా లాభదాయకం” అంటూ ప్రయివేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించడం సులభతరం అవుతుంది” అని సమావేశం అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 44ను వెంటనే ఉపసంహరించుకునీ, మూడవ డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.



