Wednesday, December 31, 2025
E-PAPER
Homeజాతీయంపైసల్లేక..పసిడే దిక్కు

పైసల్లేక..పసిడే దిక్కు

- Advertisement -

– మూడేండ్లలో నాలుగు రెట్లు పెరిగిన రుణాలు
– తనఖా వ్యాపారంపై మైక్రో ఫైనాన్స్‌ సంస్థల దృష్టి
న్యూఢిల్లీ :
ప్రస్తుత కాలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు బతుకుబండి లాగటం మరింత కష్టతరమవుతోంది. పూట గడవటం కోసం అందినకాడల్లా అప్పులు చేస్తున్నా భారాలు మాత్రం తగ్గటం లేదు. కొద్దో..గొప్పో బిడ్డల భవిష్యత్తు కోసం అప్పట్లో కూడబెట్టి కొనుగోలు చేసిన బంగారు నగలు.. భార్య మెడలోని పుస్తెలనే ఇప్పుడు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు మరింత ఆందోళనకు గురిచేసినా అప్పట్లో దాచుకున్న బంగారమే ఇప్పుడు ఆదుకుంటోంది. పుత్తడి ధర రూ. లక్షన్నరకు చేరువలో ఉండడంతో దాన్ని అమ్మేసేందుకు ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలు సిద్ధమయ్యాయి. ఈక్రమంలోనే గతంలో మార్వాడీల వద్ద బంగారం కుదువ పెట్టే రోజుల నుంచి..ఇప్పుడు మైక్రోఫైనాన్స్‌ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గత కొన్నేండ్లుగా అన్‌సెక్యూర్డ్‌ రిటైల్‌ రుణాలు, డిజిటల్‌ రుణాలపై అనేక విత్త సంస్థల దృష్టి ఉన్నప్పటికీ అత్యంత వేగంగా బంగారం తనఖా రుణాలు పెరుగుతున్నాయని యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ బీఎఫ్‌ఎస్‌ఐ కాన్ఫరెన్స్‌ 2025లో నిపుణులు పేర్కొన్నారు.

పెరుగుతున్న బంగారు ధరలు, సగటు రుణ పరిమాణం పెరగడం, చిన్న పట్టణాలు, గ్రామీణ రుణగ్రహీతల నుంచి నిరంతర డిమాండ్‌ కారణంగా గత మూడేండ్లలో పసిడి రుణాలు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయని తెలిపారు. కొత్త రిటైల్‌ రుణాలలో 60 శాతం కంటే ఎక్కువ చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలే ఉన్నాయని పేర్కొ న్నారు. బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోదగ్గ పూచీకత్తుగా ఉండటమే ఇందుకు నిదర్శనమని భావిస్తున్నారు. పసిడి రుణ మార్కెట్లలో వేగవంతమైన పంపిణీ, సౌకర్యవంతమైన తిరిగి చెల్లింపు ఎంపికలు, తక్కువ ప్రభావవంతమైన వడ్డీ రేట్ల కారణంగా అన్‌సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కంటే గోల్డ్‌ లోన్స్‌నే గ్రహీతలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ నివేదిక పేర్కొంది. అనేక బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు రాబోయే రెండేండ్లలో తమ బ్రాంచ్‌ నెట్‌వర్క్‌ అంతటా గోల్డ్‌ లోన్‌ పంపిణీని విస్తరించాలని యోచిస్తున్నాయి. తద్వారా తమ బ్యాలెన్ష్‌ షీట్లను స్థిరంగా చేసుకోవాలని భావిస్తున్నాయి. మైక్రోఫైనాన్స్‌ రుణాల్లో పెరుగుదల పరిమితం కావడంతో ఆ సంస్థలు కూడా బంగారం రుణాలు, ఇతర సెక్యూర్డ్‌ అప్పుల జారీపై దృష్టి సారిస్తున్నాయి. అదే విధంగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఫిన్‌టెక్‌ సంస్థలు తమ వృద్ధి వ్యూహాలపై కీలక దృష్టి సారించాయి. వేగంగా బ్యాలెన్స్‌ షీట్‌ను పెంచుకోవడం, విస్తరణ, ఆస్తి నాణ్యత, సెక్యూర్డ్‌ రుణాల జారీ, లాభదాయకతకు ప్రాధాన్యత ఇస్తున్నాయని నివేదిక తెలిపింది.

గృహ రుణాలు, బంగారం లోన్స్‌, ఆస్తుల తనఖా వ్యాపారం, ఎంఎస్‌ఎంఈ ఫైనాన్సింగ్‌ వంటి రిటైల్‌ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల కార్పొరేట్‌ క్రెడిట్‌, అన్‌సెక్యూర్డ్‌ రిటైల్‌ విభాగాలపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రుణదాతలు ఆస్తుల రద్దును కఠినతరం చేయడం, వసూళ్లపై దృష్టి సారించడంతో మైక్రోఫైనాన్స్‌, చిన్న చిన్న అన్‌సెక్యూర్డ్‌ రుణాలు మందగించాయి. 2025 ఫిబ్రవరి నుంచి బంగారు ఆభరణాలపై రుణాలు మూడంకెల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయని ఇటీవల ఆర్బీఐ ఓ రిపోర్ట్‌లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇది మొత్తం క్రెడిట్‌ విస్తరణ కంటే చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇది రుణగ్రహీతల ప్రాధాన్యతలలో వేగవంతమైన మార్పును సూచిస్తోందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -