నవతెలంగాణ-హైదరాబాద్: సర్కార్ కొలువుంటే ఏమి చేసినా..చేయకున్నా అడిగెదెవర్నీ కొందరు ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. వాళ్లు చక్కదిద్దాల్సిన పనులను పక్కకు పెట్టి..డ్యూటీలో పిచ్చిచేష్టలకు పునుకుంటారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో చోటు చేసుకుంది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన పంతులమ్మ..ఎంచక్కా క్లాస్ రూంలోనే జుట్టు వేసుకుంటూ..ఆయిల్ మసాజ్ చేసుకుంటుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. సదురు టీచర్ తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ టీచర్‌పై కఠిన తీసుకోవాలని కామెంట్ల రూపంలో డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు అసలే సర్కార్ బడులంటే చిన్నచూపు.. అరకొర మౌలిక సదుపాయలతో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల శాతం పడిపోతుంది. నాణ్యతలేని చదువులకు తోడు ఆయా ప్రభుత్వాల ఆదరణ లేక, ఉన్నా ఎటువంటి నిర్మాణాత్మక పాత్ర పోషించక చాలా చోట్ల సర్కార్ బడులు కాలం వెళ్లదిస్తున్నాయి. పిల్లల శాతం తక్కువ ఉందనే సాకుతో.. విలీనం పేరుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ బడులను ఎత్తేసే కుట్ర జరుగుతోంది. ఈక్రమంలో ఈ తరహా ఘటనలు జరగడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి ఉపాధ్యాయుల తీరుతో ప్రభుత్వ బడుల ప్రతిష్ట దిగజారుతుందని విద్యావేత్తలు మండిపడుతున్నారు.