బాధితురాలి పరిస్థితి విషమం
నవతెలంగాణ-హలియా
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దుండగులు తీవ్రంగా దాడి చేసి బంగారం దోచుకెళ్లారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఐతగొని సత్తమ్మ(55) శుక్రవారం మధ్యాహ్నం ఒంటరిగా ఇంట్లో ఉండగా.. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై దాడి చేసి బంగారాన్ని దోచుకెళ్లారు. ఆమె ప్రతిఘటించగా.. దుండగులు తీవ్రంగా కొట్టారు.
బాధితురాలి భర్త ఇంటికి వచ్చి చూసేసరికి సత్తమ్మ తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి కనిపించింది. వెంటనే ఆమెను హాలియాలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ సతీష్ రెడ్డి ఎస్‌ఐ సాయి ప్రశాంత్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. బంగారం కోసం ఇంటి దొంగలే ఈ పని చేసి ఉంటారని పోలీసులు, గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు పలువురు అనుమానితులను విచారిస్తున్నారు.