– అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ, ఫోన్ల చోరీ
– సరియైన సదుపాయాలు, రక్షణ కల్పించకపోవడంలో వార్డెన్, అధికారుల నిర్లక్ష్యం
– అందోళన చేసిన విద్యార్థి సంఘాల నాయకులు
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని గిరిజన కళాశాల బాలిక వసతి గృహంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగ హాస్టల్ గేట్ లోపలికి చొచ్చుకొని వెళ్లి ఫోన్ల్ ఎత్తుకెళ్లిన ఘటన శోచనీయం అని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ విద్యార్థినిలతో కలిసి శనివారం పట్టణ సీఐ కి ఫిర్యాదు చేశారు. అనంతరం హాస్టల్ దగ్గర విద్యార్థినిలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థి సంఘాల నాయకులతో వసతి గృహ విద్యార్థినిలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో దొంగ లోపలికి ప్రవేశించి బాలికల రూంలోకి చొరబడి 4 మొబైల్ ఫోన్లు దొంగలించి,అడ్డుపడిన అమ్మాయిల గది కి గడియ వేసి పారిపోయిన ఘటన చాలా దారుణమని,అమ్మాయిల భద్రత దృష్ట్యా అందరూ ఖండించాల్సిన విషయం అని అన్నారు. ఆడపిల్లలు ఉండే ఈ వసతి గృహంలో ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ పనిచేయకపోవడం వార్డెన్ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుందన్నారు. వార్డెన్ ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడ వార్డెన్ ఉదయం 10 గంటల వరకు రాకపోవడం విద్యార్థినిల భద్రత, బాధ్యతలని విస్మరించడం కనపడుతుందాని పేర్కొన్నారు పేర్కొన్నారు. అర్ధరాత్రి దొంగ రావడానికి ముఖ్య కారణం అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం వుందని వసథిగృహ విద్యార్తినిలు చెబుతున్నారు. అక్కడ పని చేస్తున్న వాచ్ మెన్ తాగి పడుకోవడం, ప్రశ్నించిన విద్యార్థినిల పట్ల అసభ్యంగా మాట్లాడతారని వాపోయారు.
హాస్టల్లో భోజన మెనూ పాటించకపోవడం, పురుగులు పట్టిన అన్నం పెడుతూ ప్రశ్నించిన వారి పట్ల వంటశాల సిబ్బంది దౌర్జన్యం చేసిన ఘటనలు ఉన్నాయన్నారు. హాస్టల్ వార్డెన్ ని, సిబ్బందిని అధికారులు వెంటనే సస్పెండ్ చేసి, ఆ దొంగ ని వెతికి పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ వ్యవస్థ బాలికల వసథిగృహాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఇలాంటి సంఘటనలు మరి ఎక్కడ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షులు ఐరెని సందీప్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వినోద్ నాయక్, బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.



