మహిళల్లో.. ముఖ్యంగా యాభై ఏండ్లు పైబడిన వారు తరచుగా కీళ్లనొప్పితో బాధపడుతుంటారు. పనులు సరిగ్గా చేసుకోలేక వారి దైనందిన జీవన శైలి అసంతృప్తికరంగా, అసౌకర్యంగానూ మారిపోతుంది. వారి సమస్య కుటుంబ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకోక పోవచ్చు. ‘ఒక వయసు తర్వాత ఇటువంటి నొప్పులు ఆడవాళ్లకు సహజంగానే ఉంటాయి, సర్దుకుపోవాలి’ అన్న ధోరణి వారిలో కన్పించవచ్చు. దాంతో చాలామంది స్త్రీలు నొప్పిని భరిస్తూ, పనులు చేసుకుంటూ ఉండిపోతారు. నిరాశ నిస్పృహలకూ లోనౌతారు. కదలిక కష్టమై చివరికి వారి రోజువారీ జీవితం భారమైపోతుంది. బాధాతరమైపోతుంది. అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయో.. ఎలా ఎదుర్కోవాలో ఈరోజు తెలుసుకుందాం…
కీలు అంటే ఏమిటి?
దానిలో నొప్పి ఎందుకు వస్తుంది?
శరీరంలో కలిగే అవయవ చలన అవసరానికి అనుగుణంగా, రెండు ఎముకల చివరలు/ప్రక్కలు, ఒక స్థానంలో జరగాల్సిన పనిని బట్టి, ఒకదానికి ఇంకొకటి అనుసంధానమైనప్పుడు కీలు ఏర్పడుతుంది. మానవ శరీరంలో సుమారుగా మూడు వందల అరవై కీళ్లు ఉంటాయి. ప్రతి కీలులో కదలికలు సాఫీగా జరగడానికి రెండు ఎముకలను జోడించే మృదులాస్థి (కార్టీలైజ్), స్నాయువులు (లిగమెంట్స్,) కప్పడానికి గుళిక (క్యాప్సూల్), కదలిక సరళంగా జరగడానికి సైనోవియల్ ఫ్లూయిడ్, కంధర బంధనాలు (టెండాన్లు) వంటి కొన్ని భాగాలు ఉంటాయి. కీళ్లలో ఏ భాగానికి గాయమైనా, అంటువ్యాధి సోకినా అందుకు సూచికగా నొప్పితో పాటు తరుచుగా వాపు కూడా మొదలౌతుంది. స్త్రీలు తరచుగా నడుము, వెన్ను, మెడ, మోకాళ్ళు, మోచేతులు, మడెం, మణికట్టు, చేతి వేళ్ల నొప్పితో బాధపడుతుంటారు.
కీళ్ల నొప్పులకు కారణాలు?
కీళ్ళను లయబద్దంగా కాకుండా అతిగా, ఇష్టానుసారంగా, అవిరామంగా వాడడం సర్వసాధారణమైన కారణం. దాని వల్ల లేదా ఇతరత్రా అయ్యే గాయాలు, బెణుకులు, దెబ్బలు, జన్యుపర/అంటు వ్యాధులు, ప్రత్యేకించి వాటికి వెంటనే చికిత్స చేయకపోతే కొన్ని వ్యాధులు, రుగ్మతలు, పరిస్థితులు తీవ్రమై ప్రాణాంతకం కావచ్చు. కీళ్ల నొప్పి క్రీడలు వల్ల అయ్యే గాయాలు, లిగమెంట్ బెణుకులు, వదులుగా ఉన్న/చిరిగిన స్నాయువు లేదా మృదులాస్థి, మృదులాస్థి ముక్కలు అవ్వటం వంటి బాధాకరమైన గాయాల వల్ల కలుగవచ్చు. అలాగే హెపటైటిస్, ఇన్ఫ్లుఎంజా, లైమ్ వ్యాధి, తట్టు, గవదబిళ్లలు, ఆస్టియోమైలైటిస్, రుబెల్లా, సెప్టిక్ లేదా ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్, క్షయ వంటి అంటు వ్యాధుల వల్ల సంభవించవచ్చు.
మహిళలకు వచ్చే సమస్యలు?
స్త్రీలలో రుతువిరతి అనంతరం హార్మోన్ల కొరత వల్ల మోకాళ్లు, మోచేతులు, వెన్నెముక, నడుముకు ఆస్టీయో ఆర్థ్రయిటిస్ అనబడే కీళ్ల వ్యాధి వచ్చే అవకాశమున్నది. పొద్దున నిద్ర నుండి లేచినప్పుడు మంచం దిగడానికి వీలులేనంతగా కీళ్లు బిగుసుకొని ఉండడం, కదిలిస్తే నొప్పి, వాపు రావడం వంటి సూచికలతో ఇది మొదలౌతుంది. వృద్ధాప్యంతో వచ్చే మార్పులలో భాగంగా కీళ్ల నిర్మాణం క్షీణించడం, ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాసిస్, రుమ టాయిడ్ ఆర్థరైటిస్ వంటివి కూడా కీళ్ల నొప్పులకు కారణమవుతాయి.
కీళ్ల సమస్యల సూచికలు ఎలా ఉంటాయి?
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్లలో నిరంతర అసౌకర్యం, తేలికపాటి నుండి తీవ్రమైన నొప్పి. వాపుతో కూడి కదలిక కష్టమౌతుంది. కీలును వంచడం/సాగతీయడం వంటివి చేయలేరు. కండరాలు బలహీనంగా అనిపించవచ్చు. కీళ్లను కదిల్చినప్పుడు క్లిక్కింగ్/పొప్పింగ్ శబ్దం అనుభూతి/ వినపడడం జరుగుతుంది. కీలుపైన చర్మం ఎర్రబడి వెచ్చగా అవ్వొచ్చు. మంటగా ఉండి వాచి, తాకినప్పుడు నొప్పిగా అనిపించవచ్చు. సమస్య తీవ్రమైనప్పుడు కీళ్ల ఆకారంలో మార్పులు లేదా అమరికలో వైకల్యం ఏర్పడవచ్చు.
అన్ని కీళ్లలో నొప్పి ఒకే విధంగా ఉంటుందా?
ప్రభావిత కీళ్లు, అంతర్లీన కారణం, అసౌకర్యాన్ని బట్టి నొప్పి ఉండవచ్చు. సాధారణ కీళ్ల నొప్పి శరీరమంతా బహుళ కీళ్లను ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన దీర్ఘకాలిక కీళ్ల నొప్పి మోకాలు/ భుజం వంటి నిర్దిష్ట కీలులో సంభవిస్తుంది. వాపుతో కూడిన కీళ్ల నొప్పి, వాపు వల్ల కలిగే నొప్పి-రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంత్రిక కీళ్ల నొప్పి-ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వాటిలో అరుగుదల, చిరిగిపోవడం వల్ల కలుగుతుంది. దీర్ఘ కాలంగా బరువులు ఎత్తడం, మోయడం, వంగి పనిచేయడం వంటివి వెన్నెముకపై ప్రభావం చూపిస్తాయి. మోచేతులు, మోకాళ్ళు దెబ్బతింటాయి.
కీళ్లను కాపాడుకోవడం ఎలా?
కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలిసింది కదా! మరి నివారణ చర్యలు కూడా ఇప్పటికే అర్ధమయ్యే ఉండాలి! దైనందిన జీవితంలో సులభంగా, సౌకర్యంగా ఉండేటట్టుగా రోజువారీ పనులు చేసుకోవాలి. మొండిగా శరీరాన్ని, ముఖ్యంగా కీళ్లను, అసలే ప్రయాస పెట్టకూడదు. మానవ శరీరం దాని స్థితిగతుల గూర్చి నిరంతరంగా సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. అవి గ్రహించాలి. ఆ సంకేతాలకు అనుగుణంగానే పనులను చేపట్టాలి. సమర్థత పెంచుకోడానికి క్రమబద్ధమైన జీవనిశైలిని అలవర్చుకోవాలి.
వ్యాయామం, ప్రాణాయామం, సమతుల్య ఆహారం (ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను-అవిసె గింజలు లేదా చేపలు వంటివి), నీరు తగినంత తాగడం, ఆహ్లాదకర వాతావరణంలో గడపడం, సరిపడే నిద్ర, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటివి ప్రతి మనిషి జీవితాన్ని సమర్థంగా నడపటానికి దోహదపడే స్థిరాస్తులు. కీళ్ళు బలంగా ఉండటానికి శారీరకంగా చురుకుగా ఉండడం చాలా అవసరం. బరువులు ఎత్తేటప్పుడు, వ్యాయామం చేసేటప్పుడు ఒత్తిడిని నివారించడానికి సరైన పద్ధతులను ఉపయోగించాలి. కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి మద్దతు ఇచ్చే పాదరక్షలను ధరించాలి. నొప్పి తొలిదశలోనే నియంత్రణ చర్యలు చేపడితే కీలును కాపాడుకోవచ్చు.
చికిత్స..?
కీళ్ల నొప్పికి కారణాలను బట్టి చికిత్స ఉంటుంది. అంటు/జన్యు/ స్వీయరక్షక కారణాలు తెలుసుకోవడానికి వైద్యనిపుణులు కీలులోని సైనోవియల్ ద్రవాన్ని పరీక్షల కోసం తీసుకుంటారు. వ్యాధి నిర్ధారణను బట్టి మందులు సూచిస్తారు. అటువంటి కారణాలేవీ లేనప్పుడు నొప్పిని తగ్గించే మందులు, ఫీజియోథెరపీ, జీవనశైలి సర్దుబాట్లు సూచిస్తారు. వాపు తగ్గించడానికి ప్రతిరోజూ 15-20 నిమిషాలు ఐస్ ప్యాక్‌లను వాడవచ్చు. కీళ్ళు, కండరాల విశ్రాంతి కొరకు హీటింగ్ ప్యాడ్ ఉపయోగించవచ్చు. నివారణ పద్ధతులు, మందులు, జీవన శైలిలో మార్పులు, ఫీజియోథెరపీ, ఇవేవీ పనిచేయక, కీలు తీవ్రంగా దెబ్బతిని ఉంటే, కీలు మార్పిడి శస్త్రచికిత్సను సూచిస్తారు.
- డా|| మీరా, ఎం.డి. రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్


