Monday, March 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమహిళలకు గుర్తింపు కరువు

మహిళలకు గుర్తింపు కరువు

- Advertisement -

– దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతోంది అతివల నైపుణ్యాలను గుర్తించండి
– త్వరలో కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటీలు
– జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై త్వరలో శుభవార్త
– మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ
– దానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందుతున్న ప్రతిపక్షాలు : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మనదేశంలోని మహిళలకు, వారి శ్రమకు గుర్తింపు కరువైందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఇంకా వివక్ష కొనసాగటం శోచనీయమని అన్నారు. అమెరికాలోనూ వివక్ష ఉందనీ, అయితే అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. మన దేశంలో కూడా అదే రకమైన గుర్తింపును మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. మహిళా జర్నలిస్టులు చెడును నియంత్రించడంలో తగిన పాత్ర పోషిస్తారనీ, సమాజం వారిని విశ్వసిస్తుందని తెలిపారు. ప్రపంచ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే… మహిళలు ఆర్థికంగా ఎదిగి న దేశాలే అభివృద్ధి సాధించాయని చెప్పారు. కానీ ఇండియాలో అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం తరపున ఒక వ్యవస్థగా మహిళలకు సమున్నత స్థానం కల్పిస్తున్నామని సంతృప్తిని వ్యక్తం చేశారు. మహిళల్లోని నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించాలంటూ సంస్థలకు, కంపెనీలకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌ లోని ప్రజా భవన్‌లో సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ…మహిళలకు తమ పార్టీ మొదటి నుంచి ఎనలేని గౌరవాన్ని, గుర్తింపును ఇచ్చిందన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్‌ పదవుల్లో మహిళలను కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించామని, ఏఐసీసీ అధ్యక్షురాలిగా కూడా మహిళలు పని చేశారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు తగిన గుర్తింపును ఇస్తున్నట్టు చెప్పారు. మంత్రుల నుంచి మొదలుకుని వివిధ శాఖల్లో ప్రత్యేక అధికారులుగా మహిళలనే నియమించామని వివరించారు. ఏసీబీ, విజిలెన్స్‌ లాంటి ముఖ్య విభాగాలతోపాటు ఎప్పుడూ పురుషులే ఉండే ఎస్‌ఐబీలో ఒక మహిళా అధికారికి అవకాశమిస్తే 700 మంది నక్సలైట్లు లొంగిపోయేలా ఆమె ప్రతిభ చూపించారని ప్రశంసించారు. అవకాశమిస్తే మహిళలు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని సీఎం వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలోని అక్కచెల్లెండ్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించటంతోపాటు వెయ్యి బస్సులకు వారిని యాజమానులను చేసి కార్పొరేట్‌ కంపెనీ లతో మహిళలు పోటీ పడేలా ప్రోత్సహిం చామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నా రు. వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లకు వారిని యజమానులను చేసినట్టు చెప్పారు. మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకు నేందుకు వీలుగా హైటెక్‌ సిటీలో వెయ్యి కోట్ల విలువైన మూడున్నర ఎకరాల స్థలంలో 150 స్టాల్స్‌తో మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయటానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని.. తమ కృషికి అందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓఆర్‌ఆర్‌ లోపల ప్రాంతాన్ని కాలుష్యరహితంగా, జీవనయోగ్య నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 2026 డిసెంబర్‌ నాటికి 2,800 ఆర్టీసీ డీజీల్‌ బస్సులను పూర్తిగా ఈవీలుగా మార్చబోతున్నట్టు తెలిపారు. రెండు లక్షల ఆటోలను ఈవీ కిందికి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కళాశాలలకు వెళ్లే ఆడపిల్లలకు ఈవీ స్కూటీలను త్వరలోనే అందజేయబోతున్నామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న ఎస్టీపీలు సరిపోవడం లేదని సీఎం తెలిపారు. చెత్త ఎత్తివేయడం, మూసీ ప్రక్షాళన, దోమల నియంత్రణ తదితర సమస్యలకు ఎలాంటి కార్యాచరణ అవసరమో చెప్పాలని మేధావులు, జర్నలిస్టులను కోరారు. సబర్మతీ, గంగానదిని ప్రక్షాళన చేసినప్పుడు మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ప్రశ్నించారు. నగరంలోని ఏడెకరాల్లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో 50 శాతానికి పైగా బఫర్‌ జోన్‌లో ఉందని గుర్తు చేశారు. అయితే అక్కడి కొనుగోలుదారులు బాధితులుగా మారకుండా వారికి ప్రత్యామ్నయ స్థలంతోపాటు భవన నిర్మాణ ఖర్చులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ వాస్తవాన్ని విస్మరించిన ప్రతిపక్షాలు సానుభూతి కోసం రాజకీ యాలు చేస్తు న్నాయని విమర్శించారు. ఎన్జీటీ రూల్స్‌ను తాను కూడా మార్చలేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంతో చర్చించకుండా, వారు గతంలో చేయని పనిని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా చేయొద్దనే దురుద్దేశంతో కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.

ప్రజా పాలనలో మహిళలకు ప్రాధాన్యత : మంత్రి పొంగులేటి
కార్యక్రమంలో పాల్గొన్న సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పురుషులకు ఏ మాత్రం తక్కువ కాకుండా అవసరమైతే ఎక్కువగానే మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నదని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లను కూడా వారి పేరు మీదనే ఇస్తున్నదని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మహిళలకు అన్ని రకాలుగా అండగా ఉంటోందని గుర్తు చేశారు. ఇంట్లో అనేక సమస్యలున్నా… మహిళా పాత్రికేయులు వాటన్నింటినీ అధిగమించి రాణిస్తున్నారని అభినందించారు.



మహిళా పాత్రికేయులకు సన్మానం
ప్రముఖ వార్తా పత్రికలు, న్యూస్‌ ఛానళ్లలో పని చేసే సీనియర్‌ మహిళా పాత్రికేయులను, సీనియర్‌ సబ్‌ ఎడిటర్లను ముఖ్యమంత్రి, మంత్రులు, ఈ సందర్భంగా శాలువా, మెమోంటో లతో సత్కరించారు. సన్మానం అందుకున్న వారిలో నవతెలంగాణ సీనియర్‌ సబ్‌ ఎడిటర్లు టి.శశికళ, వి.ఆశాభారతి, ఎన్‌టీవీ రిపోర్టర్‌ రాధిక తదితరులున్నారు. అంతకు ముందు మహిళా జర్నలిస్టులకు వృత్తిపరమైన అంశాలపై పలు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, మహ్మద్‌ అజహరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

పలు ఉత్పత్తుల కొనుగోలు…
అనంతరం హైటెక్‌ సిటీలోని శిల్పారామంలోగల ఇందిరా మహిళా శక్తి బజార్‌కు మహిళా జర్నలిస్టులను అధికారులు తీసుకెళ్లారు. అక్కడి పలు స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో తయారు చేసిన చేనేత వస్త్రాలు, హ్యాండీక్రాఫ్ట్‌ ఉత్పత్తులను వారితో కొనుగోలు చేయించారు. ఇందిరా మహిళా బజార్‌ డిప్యూటీ సి.ఈ.ఓ సౌజన్య మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని ఉత్పత్తులకు అమెజాన్‌ లాంటి బహుళజాతి సంస్థలతో మార్కెటింగ్‌ను చేయిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ టి.కామేశ్వర రావు, డీజీఎం సీ.ఎస్‌.జనని, ఎ.జి.ఎం రాజేష్‌ సిన్హా, చీఫ్‌ మేనేజర్లు సి.వి.కిరణ్‌ సాయి కుమార్‌, రజనీష్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.

గతంలో గడీ.. నేడు ప్రభాభవన్‌…
గత పాలనలో హైదరాబాద్‌ నడిబొడ్డున గడీగా ఉన్న భవనా(కేసీఆర్‌ నివాసం-ప్రగతి భవన్‌)న్ని తమ ప్రభుత్వం ప్రజా భవన్‌గా మార్చి ప్రజలందరికీ ప్రవేశం కల్పించిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. అప్పట్లో ప్రజలను రాకుండా వారు నిషేధిస్తే, కేసీఆర్‌ పాలనలోకి రాకుండా ప్రజలు ఆయన్నే నిషేధించారని ఎద్దేవా చేశారు. అహంభావం, ఆయుధాలతో కాకుండా భావజాల యుద్ధంతో గెలుపును సాధించవచ్చని వ్యాఖ్యానిం చారు. గత పాలనకు భిన్నంగా అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనిం పజేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మహిళా జర్నలిస్టులు కూడా తమ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. తెలంగాణను మహిళా ప్రాధాన్యత రాష్ట్రంగా మార్చుకుందామని సూచిం చారు. వారి రక్షణకు కమిటీలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. జర్నలిస్టుల ఇండ్లస్థలాలపై త్వరలో శుభవార్త చెబుతామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీనిచ్చారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాలు సుప్రీంకోర్టు తీర్పుతో ఆగిపో యాయని గుర్తుచేశారు. అందువల్ల మరోసారి చట్టపరమైన చిక్కులు రాకుండా న్యాయనిపుణులతో చర్చిస్తు న్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే అవాస్తవాలపై ఫిర్యాదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామనీ, అందుకోసం ఒక చట్టాన్ని రూపొం దిస్తామని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చిస్తా మని పేర్కొన్నారు. డెస్క్‌, ఫీల్డ్‌ జర్నలిస్టులకు తేడా లేదని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

పరిధిని గుర్తించండి మీడియా అకాడమీ చైర్మెన్‌ శ్రీనివాసరెడ్డి
మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వేరు, వర్కింగ్‌ జర్నలిస్టులు వేరని తెలిపారు. రాజ్యాంగంలో సామాన్యులకు ఉన్న స్వేచ్ఛే పాత్రికేయులకూ ఉందని, పరిధిని గుర్తించాలని సూచించారు. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా తప్పు చేస్తే ఫిర్యాదు చేయడానికి వ్యవస్థ ఉందని చెప్పారు. సోషల్‌ మీడియాపై అలాంటి వ్యవస్థ లేదని, అందుకే పోలీస్‌ స్టేషన్లలోనే ఫిర్యాదుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. సోషల్‌ మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తోందని అభినందించారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఉపయోగించే భాష ఘోరంగా ఉంటోందని అభిప్రాయపడ్డారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ సీహెచ్‌ ప్రియాంక కార్యక్రమానికి స్వాగతం పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -