సంఘాలుగా ఏర్పడితే రుణాలు ఇస్తాం
త్వరలోనే మూసీ ప్రక్షాళన చేపడతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండలో కుట్టుమిషన్లు, చెక్కుల పంపిణీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మహిళలను పురుషులతో సమానంగా, ఆర్థికంగా ఎదిగేలా చైతన్యం చేయాల్సిన అవసరముందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ సంస్థలో కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎవరు ఖాళీగా ఉండొద్దన్నారు. పట్టుదలతో ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలన్నారు. శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పాటయితే వారు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు.
200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో ఉందని, అలాగే నూతన కలెక్టరేట్ కూడా నిర్మాణంలో ఉందని, ఇవన్నీ పూర్తయితే ఎలక్ట్రిషన్, ప్లంబర్ తదితర కోర్సులలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్లుగా నియమిస్తామనివెల్లడించారు. సెట్విన్ చైర్మెన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 25,000 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆఫీస్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, సెట్విన్ ప్రిన్సిపాల్ రేణుక, తదితరులు పాల్గొన్నారు.
త్వరలోనే మూసీ ప్రక్షాళన
అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ త్వరలోనే మూసీ ప్రక్షాళన చేపట్టనున్నామన్నారు. మూసీి వల్ల భూగర్భ జలాలు కలుషితమై నల్గొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండవ దశలో మరో 21 కిలోమీటర్లు మూసీ ప్రక్షాళనకు టెండర్లు పిలుస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్రమానికి ప్రతిపక్షాలు ఎవరు అడ్డుపడవద్దని కోరారు. గతంలో చెప్పిన ప్రకారం డిండి ప్రాజెక్టు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రికి ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు.



