గజల్ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవారు మీర్జా గాలిబ్, జావేద్ అక్తర్‌తో పాటు గజల్స్ పాడేవారిలో పినాజ్ మసాని, పంకజ్ ఉదాస్ వంటి వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఉత్తర భారత దేశీయులైన వీరు గజల్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి చేశారు. అలాగే మన తెలుగు వారిలోనూ గజల్స్ రాసేవారు, పాడేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో గడ్డం శ్యామల ఒకరు. మనసులోని భావాలను వ్యక్తపరచుకోవడానికి గజల్స్ ఒక మంచి ప్రక్రియగా భావించి, తెలుగులో దాదాపు పదిహేను వందల గజల్స్ రాశారు. ఒక సాహితీ వేత్తగా, ఆధ్యాపకురాలిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో కవితలు, పద్యాలు, కథలు రాసి గజల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమెతో మానవి సంభాషణ…
మీ కుటుంబ నేపథ్యం?
మా సొంత ఊరు నల్లగొండ, ప్రస్తుతం ఉంటుంది మాత్రం హైదరాబాద్‌లో. మాది మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబం. అమ్మ గడ్డం కృష్ణ కుమారి, నాన్న గడ్డం లలిత మోహన్ రావు. మా నాన్న పీడబ్ల్యూడీలో పనిచేసేవారు. నాకు మూడేండ్లు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఆ తర్వాత మా అమ్మ ఆపేసిన చదువును కొనసాగించి టీచర్ ఉద్యోగం చేసి మమ్మల్ని చదివించారు. మేము ఏడుగురం ఆడపిల్లలం. మా అక్క ఒకరు నెలల పిల్లగా ఉన్నప్పుడే చనిపోయారు.
మీ విద్యాభ్యాసం?
ప్రాథమిక విద్య రామన్నపేట నల్లగొండ జిల్లాలో జరిగింది. అమ్మ అక్కడ టీచరుగా చేసేది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నల్లగొండ రామగిరి ప్రభుత్వ బాలికల పాఠశాలలో సాగింది. తర్వాత నల్లగొండలోనే గీతా విజ్ఞానాంధ్ర కళాశాలలో డీఓఎల్, బీఓఎల్ చదివాను. అంటే ఇది డిగ్రీతో సమానం. తెలుగు సాహిత్యం ప్రధానం. ఆ తర్వాత 1979లో హైదరాబాద్ వచ్చి ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో తెలుగులో ఎం.ఏ.చేశాను. మహిళా గోల్డ్ మెడల్ సాధించాను. ఆ తర్వాత చాలా విరామం తర్వాత అంటే పెండ్లి తర్వాత 1996-98 మధ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పూర్తి చేశాను.
రచనా వ్యాసంగం ఎప్పుడు ప్రారంభించారు?
డిగ్రీలో ఉండగా మొదలయింది. కానీ ఏ పత్రికలకూ పంపలేదు. ఎం.ఏ.లో మాత్రం రేడియోలో నా రచనలు చదివి వినిపించేదాన్ని. కవుల గురించి వ్యాసాలు రాసే దాన్ని. ఆకాశవాణిలో జానపద గేయాలు పాడేదాన్ని.
మీ వృత్తి? ప్రవృత్తి?
ఎం.ఏ.అయిన వెంటనే 1982లో హైదరాబాద్ లోని ఓ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా 35 ఏండ్లు పని చేశాను. 2017లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందాను. ఎన్‌ఎస్‌ఎస్ వంటి అదనపు బాధ్యతలు కూడా నిర్వహించాను. ఇక ప్రవృత్తి గురించి చెప్పాలంటే మొదటినుండి పుస్తకాలు చదవడం, పాటలు పాడడం, వినడం చాలా ఇష్టం. నాకోసం కొంత సమయం కేటాయించుకున్న తర్వాత అంటే 2007 నుండి సాహిత్య వ్యాసాలు, కథలు(కొన్ని), వచన కవితలు రాయడం మొదలుపెట్టాను. కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇప్పటి వరకు తొమ్మిది పుస్తకాలు ముద్రించాను. ఇప్పుడు గజళ్ళు, విమర్శనా గ్రంథాలు, పాటలు, వచన కవితలు, పద్యాలు(కొన్ని) రాస్తున్నాను. ఇంతే కాక మా సంస్థ కొమర్రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నాను.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీరు చేసే కార్యక్రమాలు?
గజల్ సాహిత్యంపై ప్రేమతో 2019 నుండి సినారే గజల్ అవార్డులు ఇస్తున్నాము. ప్రస్తుతం గజల్ సాహిత్య ప్రయాణం సాగుతుంది. తెలుగు గజల్ గుర్తింపు కోసం శ్రీ త్యాగరాయ గానసభ వేదికగా గజల్ సప్తాహం నిర్వహించాము. గజల్ సంకలనాలు ప్రచురించాము.
మీకు గజల్స్ రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
తెలుగు సాహిత్యంలో గజల్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా దాశరథి గారితో ప్రవేశించింది. తర్వాత చాలా విరామం తరువాత సినారే గారి గజళ్ళ రచన జరిగింది. నేను 2012 ఫేస్‌బుక్‌లోకి ప్రవేశించాను. అప్పటివరకు కథ, కవిత, వ్యాసం పద్యం వంటివి తెలుగులో రాసాను. ఎఫ్.బి.లో కొంతమంది తెలుగు గజల్ అనే సమూహాన్ని మొదలు పెట్టారు. సహజంగా మా గురువుగారైన సినారే గజళ్ళు చదివి ఆ ప్రక్రియపై అభిమానం పెంచుకున్నాను. దాంతో ఆ సమూహం నన్ను ఆకర్షించింది. గజల్ కవులు పెన్నా, వాహెద్, గాయని జ్యోతిర్మయి వంటి వారు గజల్ లక్షణాలు, ఛందో రీతులు తెలియచేసారు. అవి చదివి గజళ్ళు రాయడం మొదలు పెట్టాను. మన ఆంతరంగిక వేదనలకు, పరితాపాలకు, సంతోషాలకు గజల్ ఒక అనువైన ప్రక్రియగా అనిపించింది. మనం ఎవరితోనూ చెప్పుకోలేని భావాలను గజళ్ళుగా రాయడం సబబుగా అనిపించింది. ముఖ్యంగా తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పొచ్చు. అందరికీ అర్థమయ్యే పదాలతో కూడినదే గజల్. ఇది గానయోగ్యమైనది కూడా. నాకు ముందు నుండీ పాటలన్నా, సంగీతమన్నా చాలా ఇష్టం. అందువల్ల సంగీతానికి, సాహిత్యానికి సమ ప్రాధాన్యం ఉన్న గజల్ ప్రక్రియ నన్ను ఆకర్షించింది.
మీ దృష్టిలో గజల్ అంటే?
నేను 55 ఏండ్ల వయసులో గజల్ రాయడం మొదలు పెట్టాను. నా అనుభవం నుండి చెప్పేది ఏమిటంటే గజల్ అంటే హృదయోల్లాసి. దాని భావం కాంత మనసులాగా వెంటనే అర్థం కాదు. అది అర్థం చేసుకుంటే ఆ ఆనందం అంతులేనిది. సుందర సుకుమారమైన ప్రేమైక భావన గజల్. ప్రేమంటే శారీరక ప్రేమ కాదు. నాయిక అలభ్యమైనప్పుడు వియోగంతో తన మనసును తాను ఊరడించుకుంటూ చేసే ఆత్మ నివేదనం గజల్. ఇది కేవలం నాయికా నాయకుల మధ్యే కాదు తల్లి, పిల్లల మధ్య, స్నేహితుల మధ్య ఇలా ఏదైనా ఆ ప్రేమ దూరమైనప్పుడు వేదనతో మనలో మనకి జరిగే అంతరంగ మథనానికి అక్షర రూపం గజల్. గజల్ భావానికి మేలి ముసుగు ఉంటుంది. అది తెలుసుకోవాలి.
మీ ఇంటి నుండి ప్రోత్సహం?
మా వారు కొమర్రాజు జ్ఞానకుమార్, నాకు మేనమామ. రిటైర్డ్ బ్యాంకు అధికారి. తాను సింగర్ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటారు. ఎన్నో సన్మానాలు పొందారు. గజల్ సప్తాహం ఇద్దరం కలిసేచేసాము. పిల్లల సహకారం కూడా చాలా ఉంది.
నేటి మహిళలకు మీరిచ్చే సందేశం?
ఆ కాలం నుండీ ఈ కాలం దాకా మహిళలు అనేక వేదింపులకు గురవుతున్నారు. మహిళల సమస్యలకు సరియైన పరిష్కారాలు దొరకడం లేదు. అందుకే మహిళలు ఆర్థిక స్వావలంబన, ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి. ఇంటి నుండి బయట వారి వరకు మహిళలను డీ గ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నీకేమీ రాదు, నీకేమీ తెలియదు అనే మాటలు వినిపిస్తుంటాయి. ప్రారంభంలోనే వాటిని ఖండించాలి. అలా కాకుండా ‘పోనీలే’ అని ఊరుకుంటే దాని వల్ల మనం న్యూనతా భావానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆ అవకాశం ఎవరికీ ఇవ్వొద్దు. మనమేంటో నిరూపించుకునే దిశగానే సాగిపోవాలి. గజల్ రాసే వాళ్ళల్లో ఇప్పుడు మహిళలే ఎక్కువ. వారి శ్రమను, ఆశయాలను గజల్ ద్వారా తెలుపుకుంటున్నారు.
అప్పటి తరానికి ఇప్పటి తరానికి తేడా?
అప్పుడు ఆర్థిక స్వావలంబన తక్కువ. అన్నింటికీ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చేది. ఏదైనా వస్తువు కొనాలన్నా ఎవరో ఒకరి తోడు కావాల్సిందే. ఇప్పుడు మహిళలు ఎన్నో విజయాలను సాధిస్తు న్నారు. మనలాంటి తరం మహిళలు, మనం ఎలాగున్నా మన పిల్లలకు స్వేచ్ఛనిచ్చి అన్ని విషయాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. అది తర్వాత తరం వారు సరిగా అర్థం చేసుకొని తమ ప్రయాణం సాగిస్తే బాగుంటుంది.
మీరు అందుకున్న పురస్కారాలు?
చాలా అందుకున్నాను. అందుకో ముఖ్యమైనవి నెలవంక నెమలీక – గజల్ కలహంస పురస్కారం, గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వారి గజల్ సాహిత్య పురస్కారం, లేఖిని సంస్థ మాతృదేవోభవ పురస్కా రం, అమృతలత అపరూప గజల్ అవార్డు-2025, తెలుగం సాహితీవనం మహిళా ప్రతిభా పురస్కారం- 2025, జ్యోట్గా సంస్థ నుండి గజల్ పురస్కారం. అలాగే వివిధ బుక్ రికార్డ్స్ కూడా పొందాను.
– పాలపర్తి సంధ్యారాణి
గజల్ సాహిత్యంలో మహిళలే ఎక్కువ
- Advertisement -
- Advertisement -