చీటికిమాటికి రిపేర్లు.. నీటి సరఫరాలో అంతరాయం
నవతెలంగాణ – దుబ్బాక
నియోజకవర్గంలో తాగు నీటికి కటకట ఏర్పడింది. ప్రజలు గత నెల రోజులుగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే తాగునీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది.
నీటి సరఫరాలో సమస్యలు రాకుండా ఉండేందుకు సంబంధిత అధికారులు ముందస్తుగానే ప్రణాళికలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యం కనిపిస్తోంది. చీటికిమాటికి రిపేర్లు అంటూ నీటి సరఫరా పూర్తిగా బంద్ అవుతుంది. గ్రామాల్లోని వాటర్ ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండడం లేదు.
దీంతో సరిపడా నీళ్లు రావడం లేదు. ఒక్కోసారైతే వరుసగా మూడు, నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మండల పరిధిలోని రామక్కపేట లో మంచినీటి కోసం మహిళలు రోడ్డుపై నిరసన తెలిపారు. స్నానాలకు, బాత్రూంలకు సైతం నీళ్లు రావడం లేదంటూ వాపోయారు. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ఆటంకం లేకుండా మంచినీటి సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు.
కోమటిబండ వద్ద గ్రావిటీ పనులు జరుగుతున్నందున మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాం. ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తవుతాయి. ఆ వెంటనే అంతరాయం లేకుండా నీటిని సరఫరా చేస్తాం – రిపేర్లు పూర్తవగానే అంతరయం లేకుండా సరఫరా… మిషన్ భగీరథ దుబ్బాక డివిజన్ డీఈ విక్రమ్ గౌడ్..