– అశ్వారావుపేట అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా
– ప్రజాసేవే నా లక్ష్యం
– ఛైర్పర్సన్ జూపల్లి శశికళ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మహిళా దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ తొలి ఛైర్పర్సన్ జూపల్లి శశికళ తో నవతెలంగాణ ప్రతినిధి ప్రత్యేకంగా మాట్లాడారు.గృహిణిగా ఉన్న స్థితి నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన తన ప్రయాణం,మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యాలు,మహిళల సాధికారతపై ఆమె అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
ప్రశ్న: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మీరు చెప్పాలనుకునే సందేశం ఏమిటి?
శశికళ: మహిళలు తమపై నమ్మకం ఉంచుకుని ముందుకు సాగాలి.కుటుంబ బాధ్యతలతో పాటు సమాజానికి సేవ చేయగల శక్తి మహిళల్లో ఉంది.విద్య,ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా విజయాలు సాధించగలరు.
ప్రశ్న: గృహిణిగా ఉన్న మీరు రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది?
శశికళ: నేను నామినేషన్ వేసే వరకు సాధారణ గృహిణినే.ప్రజల మధ్య పెద్దగా పరిచయం కూడా లేదు.అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మా కుటుంబం రాజకీయంగా ముందుకు వచ్చింది. పార్టీ నాయకుల ప్రోత్సాహం,ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చాను.
ప్రశ్న: మీ రాజకీయ ప్రవేశానికి కారణం ఏమిటి?
శశికళ: నా భర్త జూపల్లి రమేష్ బాబు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న సీనియర్ నాయకుడు. ఆయనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శనం,ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సహకారం ఉంది. మొదట ఆయన ఛైర్పర్సన్‌గా పోటీ చేయాలని అనుకున్నారు.అయితే రిజర్వేషన్ మహిళలకు రావడంతో నేను ఛైర్పర్సన్‌గా పోటీ చేశాను.
ప్రశ్న: మీ భర్త వైస్ ఛైర్పర్సన్‌గా ఉండటం మీకు ఎలా సహాయపడుతోంది?
శశికళ: ఆయనకు రాజకీయ అనుభవం ఎక్కువ.పరిపాలనలో ఆయన సలహాలు నాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.ఇద్దరం కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేస్తున్నాం.
ప్రశ్న: అశ్వారావుపేట మున్సిపాలిటీ ప్రత్యేకత ఏమిటి?
శశికళ: ఇది నియోజకవర్గ కేంద్రం. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా మహిళా ఓటర్లు అధికంగా ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
ప్రశ్న: మహిళల అభివృద్ధి కోసం మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
శశికళ: మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నాం.ప్రభుత్వ పథకాలు ప్రతి మహిళకు చేరేలా కృషి చేస్తున్నాం.
ప్రశ్న: ఛైర్పర్సన్‌గా మీ ప్రధాన లక్ష్యం ఏమిటి?
శశికళ: అశ్వారావుపేటను అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం నా లక్ష్యం. రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం కోసం కృషి చేస్తున్నాం.
ప్రశ్న: మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఏమి చేయాలి?
శశికళ: మహిళలు భయపడకుండా ముందుకు రావాలి. కుటుంబం కూడా వారిని ప్రోత్సహించాలి. మహిళలు నాయకత్వం వహిస్తే సమాజంలో మంచి మార్పులు వస్తాయి.
ప్రశ్న: మహిళా దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట మహిళలకు మీ సందేశం ఏమిటి?
శశికళ: మహిళలు తమ శక్తిని గుర్తించాలి. కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలి. మహిళలు ముందుకు వస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుంది.



