- Advertisement -
- ఘనంగా ఇందిర మహిళా శక్తి సంబరాలు..
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. - విద్య, వైద్యం సదుపాయాల కల్పనలో నియోజకవర్గ ముందంజ..
- నవతెలంగాణ – దండేపల్లి: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళల ఆర్థిక అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ.17 కోట్లతో నిర్మించనున్న సోలార్ పవర్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణం, పలు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావులు మాట్లాడారు.
మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. జిల్లాలు 863 స్వయం సహాయకు సంఘాలకు 80 కోట్ల వడ్డీ లేని రుణములను అందించినట్లు తెలిపారు. 17 కోట్ల 75 లక్షలు లోన్ బీమా, ప్రభుత్వ బీమా అందించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో విద్య వైద్య సదుపాయాల కొరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు చేస్తున్న కృషిని వారు అభినందించారు.
నియోజకవర్గ అభివృద్ధికి తాము సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, గిరిజన అభివృద్ధి శాఖ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఐటీడీఏ పిఓ కుష్బూ గుప్తా, జిల్లా ఆటవిశాఖ అధికారి ఆశిష్, ఆయా శాఖల అధికారులు, మహిళా సంఘాల నాయకులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


- Advertisement -