Friday, March 13, 2026
E-PAPER
Homeమానవిమహిళల సాహస యాత్ర

మహిళల సాహస యాత్ర

- Advertisement -

ముఫ్పై మంది యూకే మహిళలు… వెయ్యి కిలో మీటర్ల ప్రయాణం… భారతదేశంలో చెన్నై నుండి గోవా వరకు సాగే ఓ సాహస యాత్ర ఇది. మన దేశంలోని మహిళలు, పిల్లలకు మద్దతు ఇచ్చేందుకు అవసరమైన డబ్బు సేకరించే లక్ష్యంతో ఆ విదేశీ వనితలు లెట్స్‌ గోవా 2026 ఆటో-రిక్షా ర్యాలీలో ప్రయాణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోదరభావాన్ని ప్రదర్శించే విధంగా ఈ 35 మంది మహిళా వ్యవస్థాపకులు చేస్తున్న ఆ సాహస యాత్ర గురించి మరిన్ని వివరాలు…

‘సమూహం స్థాపకురాలిగా నేను దీన్ని ఒక సవాలుతో కూడిన సాహసోపేతమైన అనుభవంగా చూస్తున్నాను. మహిళలు అత్యంత క్లిష్ట పరిస్థితులను తట్టుకుని విజయం సాధించగలరని నిరూపించడానికి ఇది ఓ అవకాశం. ఇది ఒక సామాజిక లక్ష్యంతో కలిపినప్పుడు, సంతృప్తి భావన మరింత ఎక్కువగా ఉంటుంది’ అని యూకేలోని కెన్సింగ్టన్‌ అండ్‌ చెల్సియా గ్రూప్‌ (కెకె గ్రూప్‌) వ్యవస్థాపకురాలు ఎమ్మా సేల్‌ అంటున్నారు. ఓర్పు, స్నేహం, దాతృత్వాన్ని మిళితం చేస్తూ, ఈ ర్యాలీ మహిళా వ్యవస్థాపకుల స్థితిస్థాపకత, దృఢ సంకల్పానికి చిహ్నంగా ఉంది.

రెండు రోజుల్లోనే…
మార్చి 3న ఉదయం 9 గంటలకు చెన్నై నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ఆటో ప్రయాణం సాహసయాత్రను గుర్తు చేస్తుంది. మహిళలు, పిల్లలకు మద్దతు ఇచ్చేందుకు నిధులు సేకరించేందుకు, అవగాహన కల్పించేందుకు ఈ ప్రయాణాన్ని ఓ వేదికగా ఉపయోగిస్తున్నారు. ‘ఈ ప్రయాణం కోసం మేము రెండు రోజుల్లోనే ఆటో నడపడం నేర్చుకున్నాం. నగరం చుట్టూ తిరుగుతూ ఎంతో ఆస్వాదించాం. ఇప్పుడు మేము రోడ్‌ ట్రిప్‌ కోసం ఎదురు చూస్తున్నాం’ అని యూకేలో ఓ ప్రచురణ సంస్థ నడుపుతున్న ఫ్రాంకీ జేమ్స్‌ చెప్పారు. గత ఏడాది కూడా ఆమె ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా…
ది సిస్టర్‌హుడ్‌ గ్రూప్‌తో కలిసి నిర్వహించిన ఈ ర్యాలీ నగరాలు, పట్టణాలు, రహదారుల మీదుగా ప్రయాణిస్తుంది. ఇది సంకల్పం, సంఘీభావంతో పాటు ఓ అర్థవంతమైన సామాజిక ప్రభావాన్ని సృష్టించాలనే ఉమ్మడి నిబద్ధతను సూచిస్తుంది. ‘ఆటో నడపడం కోసం, కంఫర్ట్‌ జోన్‌ నుండి బయటకు వచ్చి ఊహించని సవాళ్లను ఎదుర్కోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచే విలువైన జీవిత అనుభవం’ అని ఫ్రాంకీ జేమ్స్‌ అన్నారు. ‘సాధారణంగా పురుషుల కన్నా మహిళల్లో సహకరించే గుణం ఎక్కువ. అలాగే బహుళ పనులు సమర్థవంతంగా చేయగలరు. మనలో చాలా మంది మా సహోద్యోగులతో సన్నిహితంగా ఉంటారు. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా వ్యాపార సమావేశాలలో పాల్గొన్నారు’ అని ఎమ్మా సేల్‌ జతచేస్తుంది.

అమ్మమ్మ తొలి పర్యటన
అమ్మమ్మ వయసున్న డార్సీ క్రాఫ్ట్‌కు ఇది భారతదేశానికి తొలి పర్యటన. గతంలో యూకేలో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో మిడ్‌వైఫ్‌గా పనిచేసిన ఆమె ఇటీవలే ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘నా పేషెంట్లలో ఒకరు చావుబతుకుల మధ్య ఉన్నారు. ఆమె నిండు గర్భవతి. ఆ సమయంలోనే ఎమ్మా నన్ను భారతదేశంలో జరిగే ఈ ర్యాలీలో చేరమని ఆహ్వానించింది. దీని ద్వారా సేకరించిన నిధులు మహిళల అభివృద్ధి, తల్లుల ఆరోగ్యం, స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాలకు ఉపయోగించబడతాయి. అందుకే నేను మరో ఆలోచన లేకుండా ఈ ప్రయాణంలో చేరాను’ అంటూ డార్సీ తన కంపెనీ పాలిచ్చే తల్లుల కోసం కొత్తగా తయారు చేసిన బాక్స్‌ను చూపిస్తూ చెప్పింది.

శాశ్వత మార్పుకై…
పాల్గొనేవారందరూ మొదటి రోజు వెల్లూరుకు చేరుకున్నారు. అక్కడి నుండి బెంగళూరు, మైసూరు, మంగళూరు, భట్కల్‌కు ప్రయాణించి చివరికి ఏడవ రోజున గోవాకు చేరుకుంటారు. ‘ఈ ర్యాలీ ప్రపంచ సహకారం అనేది అట్టడుగు స్థాయి ప్రభావాన్ని ఎలా సృష్టించగలదో ప్రదర్శిస్తుంది. ఇది సాహసాన్ని జవాబుదారీతనంతో మిళితం చేస్తుంది. శాశ్వత మార్పును నిర్మించే నాయకులను సృష్టిస్తుంది’ అని మద్రాస్‌ మిడ్‌టౌన్‌ లేడీస్‌ సర్కిల్‌ 7 నుండి పాల్గొన్న ఉలగు పళనియప్పన్‌ అన్నారు. 2025లో జరిగిన ర్యాలీలో 52 మంది పాల్గొని కోటి డాలర్ల కంటే ఎక్కువ సేకరించారు. ఈ ఏడాది కొంత సంఖ్య తగ్గింది. అయినా మరింత దృష్టి సారించారు. ఎమ్మా సేల్‌ నేతృత్వంలో స్ఫూర్తిదాయకంగా ఈ యాత్ర సాగుతోంది.

కొన్ని వారే పరిష్కరించుకుంటారు…
ప్రొఫెషనల్‌ టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ శాస్త్రవేత్తలు, ర్యాలీ అంతటా భద్రత ఆన్‌-రోడ్‌ మద్దతును నిర్వహించడానికి లైసెన్సింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ‘టైర్‌ మార్చడం లేదా ఇంజిన్‌ను స్వయంగా పరిష్కరించడం వంటి చిన్న చిన్న సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం. మేము చేయలేని సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మెకానిక్స్‌ని సంప్రదిస్తాం’ అని ఫ్రాంకీ చెప్పారు. ర్యాలీలో పాల్గొనే బృందంతో పాటు వారి సామాను, విడిభాగాలు, ఇతర నిత్యావసరాలను మోసే బస్సు కూడా వస్తుంది.

సిస్టర్‌హుడ్‌ ర్యాలీ…
మద్రాస్‌ మిడ్‌టౌన్‌ రౌండ్‌ టేబుల్‌ 42 (ఎంఎం ఆర్‌టి42), మద్రాస్‌ మిడ్‌టౌన్‌ లేడీస్‌ సర్కిల్‌ 7 (ఎంఎం ఎల్‌సి7) మద్దతు ఇస్తున్న ఈ ఆటో రిక్షా యాత్ర ఒక సాహసం కంటే ఎక్కువ. ఇది ఒక శక్తివంతమైన లక్ష్యం. లెట్స్‌ గోవా 2026 సహకారం అనేది అట్టడుగు స్థాయిలో ప్రభావాన్ని ఎలా సృష్టించగలదో నిరూపిస్తుంది. సిస్టర్‌హుడ్‌ ర్యాలీ 2026 ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దీని కోసం విరాళాలు సేకరిస్తున్నారు. 2006లో స్థాపించబడిన ఈ ది సిస్టర్‌హుడ్‌ గ్రూప్‌, తన సేవా కార్యక్రమాల కోసం నిధులను సేకరించడానికి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. నిధుల కోసం గతంలో వీరు డ్రాగన్‌ బోటింగ్‌, అమెజాన్‌ రాఫ్ట్‌ రేస్‌, మారథాన్‌ డెస్‌ సేబుల్స్‌లో పాల్గొన్నారు.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -