Sunday, March 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్టాన్లీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

స్టాన్లీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో శనివారం హైదరాబాద్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్‌ కలెక్టర్‌ హరిచందన దాసరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుతామని అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకోవడానికి, మహిళల హక్కుల కోసం అవగాహన పెంచడానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా గొప్ప బలమనీ, తల్లి, ఉపాధ్యాయురాలు, శాస్త్రవేత్త, వైద్యురాలు, నాయకురాలు వంటి అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని వివరించారు. విద్య, విజ్ఞానం, క్రీడలు, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపిస్తున్నారని అన్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో మహిళలు అసమానత, వివక్ష, హింస వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందుతుందనీ, కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి అవుతుందని అన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం వారి సామర్ధ్యాన్ని ప్రోత్సహించడం చాలా అవసరమని చెప్పారు. భారత్‌లో అనేక మంది గొప్ప మహిళలున్నారనీ, వారు తమ కృషితో దేశానికి గొప్ప పేరు తెచ్చారని గుర్తు చేశారు. అది అందరికీ ఉన్నతమైన ప్రేరణ అని అన్నారు. స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ బిఎల్‌ రాజు మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ఎంతో ముఖ్యమైన సాధనమని చెప్పారు. మహిళలు విద్యావంతులైతే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీ కార్యదర్శి, కరస్పాండెంట్‌ కె కృష్ణారావు, యాజమాన్య సభ్యులు టి రాకేశ్‌రెడ్డి, ఆర్‌ ప్రదీప్‌రెడ్డి, డీన్‌ ఏ వినరుబాబు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఏ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -