Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeమానవిరైల్వేలో మహిళ శ‌క్తి

రైల్వేలో మహిళ శ‌క్తి

- Advertisement -

సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ మహిళలు అడుగుపెట్టలేని రంగమంటూ లేదు. ప్రతి రంగంలోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అందులో భాగంగానే రైల్వేలో ఐదు ముఖ్యమైన విభాగాలలో బాధ్యతలు చేపట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. వాణిజ్య, ఆపరేటింగ్‌, ఫైనాన్స్‌, సెక్యూరిటీ, మెడికల్‌ విభాగాలలో కీలక పాత్ర పోషిస్తూ దక్షిణ మధ్య రైల్వేలో చరిత్ర సృష్టించారు. మొదటిసారిగా అక్కడ మహిళా అధికారులు నాయకత్వం వహిస్తున్నారు. ఆ ఐదుగురు మహిళా మణుల సంక్షిప్త పరిచయం నేటి మానవిలో…

కె.పద్మజ (ఐఆర్‌టీఎస్‌) ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ ప్రస్తుతం ఆపరేటింగ్‌ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అరోమా సింగ్‌ ఠాకూర్‌ (ఐఆర్‌పీఎఫ్‌ఎస్‌) ఇన్స్పెక్టర్‌ జనరల్‌ కమ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ (IG-cum-PCSC)గా భద్రతా విభాగాన్ని నిర్వహిస్తున్నారు. టి.హేమ సునీత (IRAS) SCR ఫైనాన్స్‌ విభాగానికి ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా, ఇతి పాండే (ఐఆర్‌టీఎస్‌) ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా వాణిజ్య విభాగాన్ని, డాక్టర్‌ నిర్మల నరసింహన్‌ (IRAS) SCR ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెడికల్‌ డైరెక్టర్‌గా వైద్య విభాగాన్ని నడిపిస్తున్నారు.

సవాళ్లు ఉన్నప్పటికీ..
దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఈ ఐదు కీలకమైన విభాగాలాను అందరూ మహిళా అధికారులే నిర్వహిస్తున్నారు. ఇది భారతీయ మహిళలందరూ గర్వించదగిన విషయం. పైగా రైల్వే అత్యంత ముఖ్యమైన విభాగాలుగా పేరుగాంచిన వీటి నిర్వహణ అత్యంత క్లిష్టమైనది. ప్రయాణీకుల భద్రత, ఉద్యోగుల శ్రేయస్సు వీరి చేతుల్లోనే ఉంటుంది. సరైన నాయకత్వం, నిర్ణయం తీసుకోవడం, సమన్వయం ఈ విభాగాల్లో అత్యంత అవసరం. అంతేకాదు ఈ బాధ్యతల నిర్వహణ అంతర్లీనంగా అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. అయినప్పటికీ ఈ మహిళా అధికారులు ప్రతి అంశాన్ని అత్యంత సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్నారు.

డాక్టర్‌ నిర్మలా నరసింహన్‌
(ఐఆర్‌హెచ్‌ఎస్‌ 1989 బ్యాచ్‌)

డిసెంబర్‌ 2024లో ఈమె ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెడికల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వైద్య విభాగానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమె ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రయాణీకులకు అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో మొత్తం 8 ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో లాలగూడలోని 380 పడకల సెంట్రల్‌ రైల్వే ఆసుపత్రి, విజయవాడ, గుంతకల్‌, నాందేడ్‌, గుంటూరులోని డివిజనల్‌ ఆసుపత్రులు, తిరుపతి, రాయనపాడు, పూర్ణలోని సబ్‌-డివిజనల్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ జోన్‌లో ఆరు డివిజన్లలో (అంటే సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌, నాందేడ్‌) కార్యాలయాలు, రైల్వే కాలనీలలో మొత్తం 40 హెల్త్‌ యూనిట్లు ఉన్నాయి. ఇవి ఉద్యోగులకు తక్షణ ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తాయి. ఈ విభాగం కీలక బాధ్యతలలో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, ప్రయాణీకులకు అత్యవసర వైద్య సహాయం, పరిశుభ్రత, పారిశుధ్యం మొదలైనవి ఉన్నాయి. గత నాలుగేండ్లలో ఈమె లాలగూడ సెంట్రల్‌ హాస్పిటల్‌లో 64 స్లైస్‌ల సీటీ స్కాన్‌ మెషిన్‌ , ఇన్‌-హౌస్‌ కార్డియాక్‌ క్యాత్‌ ల్యాబ్‌ను ఏర్పాటుచేసి జోన్‌లో వైద్య మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచారు.

ఇతి పాండే
(ఐఆర్‌టీఎస్‌ 1998 బ్యాచ్‌)

ఆగస్టు 2, 2025న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పీసీసీఎం (ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌)గా ఈమె బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య విభాగం అధిపతిగా ఉన్న ఈమె ప్రయాణీకుల సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో టిక్కెట్ల జారీ, రిజర్వేషన్లు, కస్టమర్‌ సహాయం, సరుకు రవాణా సేవలు, స్టేషన్‌ నిర్వహణ, ప్రకటనలు, ఛార్జీలు లేని ఆదాయం, మార్కెటింగ్‌, వ్యాపార అభివృద్ధి, ఆదాయ ఉత్పత్తి మొదలైనవి ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఇతి పాండే భూసావల్‌ డివిజన్‌లో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా, సెంట్రల్‌, పశ్చిమ రైల్వేలలో వివిధ ముఖ్యమైన పదవులతో పాటు సెంట్రల్‌ రైల్వే ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (ప్యాసింజర్‌ సర్వీసెస్‌)గా పనిచేశారు. ఆమెకు జనరల్‌ మేనేజర్స్‌ అవార్డు (రెండుసార్లు), మినిస్ట్రీ ఆఫ్‌ రైల్వేస్‌ అవార్డు ఫర్‌ ఎక్సలెన్స్‌ అండ్‌ మెరిటోరియస్‌ సర్వీసెస్‌ 2007, ఉమెన్‌ అచీవర్స్‌ అవార్డు 2016 లభించాయి. అంతేకాదు జూన్‌ 2025లో ఆమెను రైల్‌ మంత్రి రాజ్‌భాషా రజత్‌ పడక్‌తో సత్కరించారు. చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (సరుకు రవాణా)గా, ఆమె పశ్చిమ రైల్వేపై సరుకు రవాణా కార్యకలాపాల గురించి ‘రైడింగ్‌ ది ఫ్రైట్‌ ట్రైన్‌’ అనే పుస్తకాన్ని రాశారు. బ్యూరోక్రాట్స్‌ వార్షిక జాబితా 2024లో 24 మంది బ్యూరోక్రాట్‌ చేంజ్‌-మేకర్లలో ఆమె కూడా గుర్తింపు పొందారు. ఆమె మారథాన్‌ రన్నర్‌ కూడా. 2023లో దక్షిణాఫ్రికాలో కామ్రేడ్స్‌ మారథాన్‌ను పూర్తి చేసిన ఏకైక మహిళా సివిల్‌ సర్వెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 11 గంటల 47 నిమిషాల్లో 88 కిలోమీటర్ల పరుగును ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.

కె. పద్మజ (ఐఆర్‌టీఎస్‌ 1991 బ్యాచ్‌)
ఈమె జనవరి, 2025లో ఎస్‌సీఆర్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆమె జోన్‌ వాణిజ్య కార్యకలాపాల విభాగాన్ని చూసుకున్నారు. PCOM గా ఆమె రైల్వే రోజువారి కార్యకలాపాలను ప్లాన్‌ చేస్తారు. జోన్‌ అంతటా ప్రయాణీకుల, సరుకు రవాణా చూసేవారు. ముఖ్యంగా రైళ్లు సురక్షితంగా, సమర్థవంతంగా సమయానికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నా రు. ఈ విభాగం రైళ్ల షెడ్యూలింగ్‌, సమయపాలన, ట్రాఫిక్‌ నిర్వహణ, మౌలిక సదుపాయాలతో పాటు రోలింగ్‌ స్టాక్‌ అవసరాలను తీర్చడానికి ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటుంది. ఈమె నాయకత్వంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) జూలై వరకు, జోన్‌ 49 మిలియన్‌ టన్నుల సరుకు రవాణాను చేయగలిగారు. దీని ద్వారా రైల్వేకు రూ.4,601 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో సెలవు రోజుల్లో ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడానికి జోన్‌ 1,117 ప్రత్యేక రైలు సేవలను కూడా నిర్వహించారు. ఇవన్నీ పద్మజ ఆధ్వర్యంలో జరిగాయి.

అరోమా సింగ్‌ ఠాకూర్‌ (ఐఆర్‌పిఎఫ్‌ – 1993 బ్యాచ్‌)
జూలై 2023లో ఎస్‌సీఆర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ (IG-cum-PCSC)గా ఈమె బాధ్యతలు స్వీకరించారు. రైల్వే ప్రయాణీకులు, రైల్వే ఆస్తుల భద్రతకు బాధ్యత వహించే జోన్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌కు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఆర్‌పీఎఫ్‌గా నేరాలు, దర్యాప్తు నివారణ, విపత్తు ప్రతిస్పందన, జనసమూహ నిర్వహణ, నిఘా, పర్యవేక్షణ, ప్రయాణీకులకు సహాయం, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో స్థానిక అధికారులతో సమన్వయం చేసుకోవడం ఆమె బాధ్యతల్లో ముఖ్యమైనవి. పీసీఎస్‌ఆర్‌ నాయకత్వంలో భద్రతా విభాగం పర్యవేక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ప్రతిస్పందన సమయాన్ని మెరుగుపరచడానికి ఈమె అధునాతన సాంకేతికతలు, డేటా విశ్లేషణలను ఉపయోగిస్తున్నారు. ప్రయాణీకుల ప్రాణాలను, రైల్వే ఆస్తులను కాపాడటానికి జోన్‌ అంతటా ఆపరేషన్‌ యాత్రి సురక్ష, ఆపరేషన్‌ అమానత్‌, ఆపరేషన్‌ నాన్హే ఫరిష్టే, ఆపరేషన్‌ సతార్క్‌ వంటి వివిధ కార్యక్రమాలను చేపట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. మహిళా భద్రతను పెంచడానికి మహిళా శక్తి బృందాలు, యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్లు, విపత్తు నిర్వహణ, మేరీ సహేలి బృందాలు వంటి ప్రత్యేక యూనిట్లను కూడా ఈమె ప్రవేశపెట్టారు.

టి.హేమ సునీత (ఐఆర్‌ఏఎస్‌ 1993 బ్యాచ్‌)
2025 ఏప్రిల్‌లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా ఈమె బాధ్యతలు చేపట్టారు. అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌గా జోన్‌ ఆర్థిక స్థితిని నిర్ధారించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె లండన్‌, పారిస్‌లోని యూరోపియన్‌ బిజినెస్‌ స్కూల్‌లో ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పూర్తి చేశారు. అక్కడే ఆమె పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌, అక్రూవల్‌ అకౌంటింగ్‌, ఇంటర్నేషనల్‌ టాక్స్‌ లాస్‌ మొదలైన వాటిలో నైపుణ్యాన్ని పొందారు. అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆమె మలేషియా, సింగపూర్‌లోని ICLIF/INSEAD లో శిక్షణ పొందారు. ప్రిన్సిపల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆమె మే 2023 నుండి సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అండ్‌ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/ట్రాఫిక్‌ అండ్‌ కాపెక్స్‌ మేనేజ్‌మెంట్‌గా పనిచేశారు. ఈమె ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుండి జూలై వరకు జోన్‌ విభాగ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.7,813 కోట్లు ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.8,081 కోట్లకు చేరుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad