Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిమహిళా సమానత్వ సవాళ్లు

మహిళా సమానత్వ సవాళ్లు

- Advertisement -

మహిళా నేటికీ పురుషాధిక్య సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరురాలుగానే భావించబడుతున్నది.అసమానతల అంతరాల్లో వం టింటి కుందేలవుతున్నది. ఆర్థిక స్వేచ్ఛ ఇంకా ఆమడదూరంలోనే ఉన్నది. ఆమె గళం గడప దాటడం లేదు. పడతి మాటకు విలువుండటం లేదు. ఒంటరి మహిళను నేటికీ అసహ్యంగా చూస్తున్న దుస్థితి. ఆమె తెర వెనుక శ్రమజీవి, ఆయన తెరపైన కాలర్‌ ఎగిరేసే పురుష పుంగ వుడు. భర్త చనిపోతే సతీ సహగమనం పాటించిన సమాజం మనది. స్త్రీ శ్రమకు విలువ పాతాళంలో, పురుషుని శ్రమ విలువ ఆకాశమంత. ఆమె ఎప్పటికైనా అత్తింటికి వెళ్లే ఆడదేనన్న చిన్నచూపు ఇంకా మనం జీవిస్తున్న ఈ సమాజంలో వేళ్లూనుకుని ఉన్నది. దీన్ని అధిగమించడానికి అనేకరంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నా వారికి అడుగడుగునా వివక్షే ఎదురవుతున్నది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అక్కడ కూడా ఆధిపత్యమే రాజ్యమేలుతున్నది. అయినప్పటికీ ఈ సవాళ్లను అధిగమిస్తూ మహిళ తానేంటో నిరూపించుకుంటున్నది. కానీ పౌరసమాజం నుంచి కావాల్సినంత సహకారం ఉండటం లేదు. మహిళా సమానత్వంపై అవగాహన కల్పించడం నేటి పరిస్థితుల్లో చాలా ముఖ్యం.
కొన్ని దేశాల్లో మహిళలను ఓటు హక్కు కూడా లేకపోవడం విచారకరం. 1970సో అమెరికాలో మహిళా హక్కుల కోసం లక్ష మంది మహిళలు రోడ్డుపై చేరి ఆందోళన చేయడంతో నాటి అధ్యక్షుడు రిచర్డ్స్‌ నిక్సన్‌ చొరవతో అమెరికాలో 1920 ఆగష్టు 26వ తేదీన 19వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఈ విప్లవాత్మక ప్రగతిశీల నిర్ణయానికి గుర్తుగా ప్రతియేటా 26 ఆగస్టు రోజున (1971 నుంచి) ”మహిళా సమానత్వ దినం” లేదా ”వూమెన్‌ ఈక్వాలిటీ డే” పాటించడం కొనసాగుతున్నది. నాడు అమెరికాలో ప్రారంభమైన మహిళా సమానత్వ దినోత్సవం నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అభినందనీయం. భారతదేశంలో మహిళా సమానత్వ సాధన సవాల్‌గా మారింది. నేడు యుద్ధ పైలెట్లు, సైనికులు, అంతరిక్ష శాస్త్రవేత్తలుగా మహిళలు తమ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుంటున్నారు. అయినా చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నది. విద్య, రాజకీయ రంగాలు పురుషాధిక్యతను ప్రదర్శిస్తున్నా యి. సామాజిక కట్టుబాట్లు మహిళా సేచ్ఛను హరించి వేస్తున్నాయి. లింగ ఆధార ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి.

ఇంతటి వివక్ష కొనసాగుతున్నప్పటికీ మహిళలంటే పాలకులకు చిన్నచూపే ఉంటున్నది. ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మహి ళలకు రిజర్వేషన్లు కల్పించడం, నైపుణ్య విద్యలో, ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలోనూ వారిని పురుషులతో సమానంగా పరిగణలోకి తీసుకోని పరిస్థితి నెలకొంది. వీటికి తోడుగా సామాజిక కట్టు బాట్లు, ఆచారాలు, ముసుగులు మహిళాభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నాయి. అమ్మా యిలకు ఉన్నతవిద్య అందని ద్రాక్ష అవుతున్నది. రాజకీయ రంగంలో మహిళలకు అవకాశాలు కల్పించడంలో ఇంకా వైఫల్యం కనిపిస్తూనే ఉంది. ఆకాశంలో సగమంటూ ప్రగల్భాలు పలికే నేతలు వారికి సమాన అవకాశాలు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటున్న దుస్థితి దేశంలో ఉండం విచారకరం. వేతనాల కల్పనలోనూ అనేక వ్యత్యాసాలు వెక్కిరిస్తున్నాయి. శ్రమ చేయడంలో మహిళా శక్తికి విలువనివ్వడం లేదు. వారి భద్రత కూడా గాల్లో దీపం అవుతున్నది.
మహిళా సమానత్వ సాధనకు చట్టాలను చేసి, ఉన్న చట్టాలను అమలు పరిచి, ఆమెను ముందుకు నడిపించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. చట్టసభల్లో ఆమె సగభాగం కావాలి. శ్రమ చేయడానికి ఆమెకు ఉన్నత విద్య, నైపుణ్యాలను పెంపొందించాలి. సామాజిక కట్టుబాట్లు, మూఢనమ్మకాల గోడలను బద్దలు కొట్టాలి. మహిళా భద్రతకు పెద్దపీట వేయాలి. మహిళా సాధికారత దిశగా అడుగులు పడాలి. మహిళల్ని వివిధ రంగాల్లో నాయకత్వ స్థానాల్లోకి తీసుకురావాలి. బాలురకు సమానంగా బాలికలకు విద్యను అందించాలి. నేటి బాలికలో రేపటి నాయకురాలిని చూడగలగాలి. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, కైఅచిమార దశలోనే గర్భం దాల్చడం, లైంగిక వేధింపులు, శ్రమ దోపిడీ, మహిళలపై హింస లాంటి దురాచారాలకు స్వస్తి పలకాలి. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ, ఉద్యోగ ఉపాధులను కల్పిస్తూ, శ్రమదోపిడీని అరికడుతూ, విద్య అనే ఆయుధాన్ని అందిస్తూ, సామాజిక కట్టుబాట్లను ఛేదిస్తూ, లింగ సమానత్వ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆమెను అందలం ఎక్కించాలి. మహిళను కేంద్ర బిందువుగా చేసుకొని సుస్థిరాభివృద్ధికి పునాదులు వేయాలి.

(నేడు ”మహిళా సమానత్వ దినోత్సవం”)
– డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad