ఒక దేశాన్ని కొలవాలంటే ముందుగా అక్కడి మహిళ ఏ స్థానంలో ఉందో తెలుసుకోవాలంటారు. అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదంటే గౌరవమైనా కావచ్చు. ‘ఆమె’ పోటీపడనటువంటి రంగమే లేదు. ఇంత ప్రతిభ చాటుతున్నా సమాజంలో చిన్నచూపే. వందల ఏళ్ల నుంచి అనాదిగా కొనసాగుతున్న పితృస్వామిక భావజాలం అనాదిగా కొనసాగుతున్న దురావస్థ, దాన్ని పాలకులు పోషిస్తున్న ఫలితం ఇది. ఇన్ని సమస్యలు, సవాళ్ల మధ్య కూడా కొన్ని మహిళలకు ఆశాజనకమైన తీర్పులొస్తే వాటిని ఆహ్వానించాలి. ఇటీవల భారత సుప్రీంకోర్టు సానిటరీ న్యాప్కిన్లపై ఇచ్చిన తీర్పు అలాంటిదే. అది యావత్తూ దేశాన్ని ఆలోచింపజేసేలా ఉండటమే కాదు, మహిళల నెలసరి ఆరోగ్యం గురించి మళ్లీ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎందుకంటే, ఒక బాలిక నెలసరి వచ్చిన రోజున పాఠశాలకు వెళ్లలేకపోతే, అది ఆమె బలహీనత కాదు. ఒక మహిళ పాత బట్టలు వాడాల్సి వస్తే, అది ఆమె ఎంపిక కాదు. ఇవన్నీ మహిళల ఆరోగ్య అవసరాలను సమాజం, పాలక వ్యవస్థ సరైన స్థాయిలో పట్టించుకోకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితులు. ఈ వాస్తవాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించడం మంచి పరిణామం.
సానిటరీ న్యాప్కిన్ కేవలం ఒక వస్తువు కాదు, అది మహిళల ఆరోగ్యం, గౌరవం, చదువు, జీవన ప్రమాణాలతో నేరుగా ముడిపడి ఉందని న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. ఉచితంగా ఇవ్వాలా వద్దా అన్న విషయంలో నేరుగా ఆదేశాలు ఇవ్వకపోయినా, మహిళలకు ఇవి సులభంగా అందుబాటులో ఉండటం ప్రాథమిక ఆరోగ్య హక్కులతో సంబంధం ఉన్న అంశమని కోర్టు గుర్తించింది. అయితే, ఈ అంశమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వ్యక్తి తన వాదనలో ”దేశంలో చాలామంది బాలికలు, మహిళలకు నెలసరి సమయంలో సానిటరీ న్యాప్కిన్లు సులభంగా దొరకడం లేదని” వివరించారు. దీనివల్ల వారు అపరిశుభ్రమైన పద్ధతులు పాటించాల్సి వస్తోందని, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. పాఠశాలలకు వెళ్లడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారని న్యాయస్థానం ముందు చెప్పారు. ”నెలసరి సమయంలో అవసరమైన సానిటరీ న్యాప్కిన్లు బాలికలు, మహిళలకు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా, మార్గదర్శకాలు ఇవ్వాలని” అభ్యర్థించారు. ముఖ్యంగా పేద, వెనుకబడిన వర్గాల మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. అతను చెప్పిన అంశాలన్నీ కూడా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి.
ప్రస్తుతం దేశంలోని మహిళల ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎ)-5 గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం మహిళల్లో సగానికి మించిన వారు రక్తహీనతతో బాధపడుతున్నారు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, సరైన పరిశుభ్రత లేకపోవడం దీనికి ఒక ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. సానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో లేకపోవడం మహిళల ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతోంది. అలాగే గణనీయమైన సంఖ్యలో బాలికలు, మహిళలు సురక్షిత నెలసరి ఉత్పత్తులు వాడలేని పరిస్థితిలో ఉన్నారు. దీని ప్రభావం వారి చదువు, పని, సామాజిక జీవనంపై పడుతోంది. నెలసరి కారణంగా పాఠశాలకు సరిగా వెళ్లలేకపోతున్న బాలికల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఇది మహిళల వ్యక్తిగతమైనది అనడం కన్నా, ఇది సమాజం మొత్తం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యగా చూడాలి.
ఉదాహరణకు నెలసరి సమయంలో సానిటరీ న్యాప్కిన్లు లేనందున ఒక బాలిక పాత బట్టలు వాడుతుంది. అవి శుభ్రంగా లేకపోవడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, గర్భాశయ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరిలో దుర్వాసనతో కూడిన స్రావం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి తొలిదశలో గుర్తించి చికిత్స చేయకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గర్భధారణ సమయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. అందువల్ల నెలసరి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం మహిళల భవిష్యత్తు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సానిటరీ న్యాప్కిన్ల లభ్యత ఇంకా పరిమితంగానే ఉందని జాతీయ గణాంక కార్యాలయ ఆరోగ్య సర్వే సూచిస్తోంది. సరఫరా సరిగా లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం వల్ల మహిళలు సురక్షిత ఉత్పత్తులు వాడలేకపోతున్నారు. దీని ప్రభావం మహిళల ఆరోగ్యంపై నేరుగా పడుతోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పులో న్యాయస్థానం ఒక విషయం స్పష్టంగా తెలిపింది. ”దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన ఆదేశాలు అమలు చేయడం కష్టం కనుక, ఉచిత పంపిణీని హక్కుగా ప్రకటించలేము. కానీ, మహిళల ఆరోగ్యం, గౌరవం ప్రభుత్వ బాధ్యత”అని స్పష్టం చేసింది. ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేయడానికి ప్రభుత్వాలకు అవకాశం లేదని పేర్కొంది.
ప్రభుత్వాలు కొన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితిలో సరఫరా సక్రమంగా లేకపోవడం, నాణ్యతపై పర్యవేక్షణ తక్కువగా ఉండటం, అవగాహన లోపించడం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. సానిటరీ న్యాప్కిన్లు కేవలం కాగితాలపై మాత్రమే కాకుండా, నిజంగా అవసరమైన మహిళల చేతికి చేరాల్సిన అవసరం ఉంది. మహిళల నెలసరి సమస్యను వ్యక్తిగతంగా చూడటం మానాలి. ఇది విద్య, ఉద్యోగం, సమానత్వం, సామాజిక అభివృద్ధితో నేరుగా ముడిపడి ఉంది. ఒక బాలిక చదువు మధ్యలో ఆగిపోతే, దాని ప్రభావం ఆమె జీవితం మీద పడుతుంది. మహిళ ఆరోగ్యంగా లేనప్పుడు వారు కుటుంబ, సమాజంలో సమగ్ర అభివృద్ధికి దోహదం చేయలేరు. అందుకే ప్రభుత్వాలు చేయాల్సిందల్లా ప్రతి పాఠశాల, కళాశాల, ప్రజా కేంద్రాల్లో సానిటరీ న్యాప్కిన్లు సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలి. పేద, వెనుకబడిన ప్రాంతాల్లో సరైన పంపిణీ వ్యవస్థ ఉండాలి. నెలసరి ఆరోగ్యం గురించి బాలికలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. సరఫరా, నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.
ఈ తీర్పు ఒక సూచన మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా. చట్టాలు మారినా, పథకాలు వచ్చినా, మహిళల జీవితాల్లో మార్పు కనిపించకపోతే వాటికి అర్థం ఉండదు. మహిళల ఆరోగ్యం, గౌరవం, పరిశుభ్రతను నిజంగా ప్రాధాన్యంగా చూసిన రోజే సమాజాభివృద్ధి చెందిందని చెప్పగలం. ప్రభుత్వం ఈ అంశాన్ని సంక్షేమంగా కాకుండా బాధ్యతగా చూసినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది.
డాక్టర్ ఎం.రమాదేవి
9490300863



