Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంతటా మహిళా భాగస్వామ్యం

అంతటా మహిళా భాగస్వామ్యం

- Advertisement -

నిత్యం సామ్రాజ్యవాదపు దాడికి ఒళ్లంతా గాయాలతో మనుగడ సాగిస్తున్న క్యూబా… తన దేశపు ఆడబిడ్డలను మాత్రం ప్రపంచపటంలో అగ్రభాగాన నిలబెట్టింది. ప్రపంచంలోనే స్త్రీ పురుష లింగ వివక్షకు తావులేని సమానత్వపు పరిమళాలను వెదజల్లే దేశంగా క్యూబాను యునెస్కో ఏనాడో గుర్తించింది. క్యూబన్‌ మహిళలు చదువులో, ఉన్నత ఉద్యోగాల్లో, చట్టసభల్లో, దేశ ఆర్థిక పురోగతిలో, వ్యవసాయంలో, కార్మికశక్తిలో అన్నింటా పైచేయిగా ఉన్నారు. ఉచిత విద్య, వైద్యం, సామాజిక సంరక్షణ, చట్టపరమైన రక్షణ, సమాన రాజకీయ భాగస్వామ్యం వంటి కీలక విధానాల మేళవింపు ఫలితమే క్యూబన్‌ స్త్రీ విజయం.
ఏ దేశ ప్రజలైనా గెలవాలంటే ఆదేశంలో తొట్టతొలిగా అందుబాట్లో ఉండాల్సినవి విద్య, వైద్యం. ఇవి రెండూ క్యూబాలో అందరికీ ఉచితం. ఉచితం ఒక్కటే కాదు, అవి అత్యున్నతం కూడా. మహిళలు వివిధ రంగాల్లో రాణించాలంటే వారికి కావలసింది భద్రత, భరోసా. పనిప్రదేశాల్లో వేధింపులు, అసమానతలకు తావులేని స్వేచ్ఛాయుత వాతావరణాన్ని చట్టబద్ధంగా సృష్టించింది అక్కడి ప్రభుత్వం. ఆ దేశ కార్మిక శక్తిలో, ప్రభుత్వ రంగంలో 66 శాతానికి పైబడి మహిళలే పనిచేస్తున్నారు. ఉన్నత ఉద్యోగాల్లో, అధికారిక హోదాల్లో మహిళా భాగస్వామ్యం అత్యధికం కావడంతో వారి సంక్షేమానికి ప్రభుత్వం తనకున్న కొద్దిపాటి వనరుల్లో భారీగానే వెచ్చిస్తోంది.

మహిళా సాధికారత సాధించేందుకు క్యూబా ‘జాతీయ మహిళా పురోగతి కార్యక్రమం’ (పిఎఎం) అవలంబించింది. దీని ద్వారా సుమారు 46 రకాల మహిళా సంక్షేమ చర్యలను అమలు చేస్తోంది.
స్త్రీల ఆరోగ్యంపై దృష్టిపెట్టి, శారీరక దృఢత్వం సాధించే దిశగా పౌష్టికాహారాన్ని బాలిక స్థాయి నుంచే అందిస్తోంది. రేషను దుకాణాల ద్వారా వస్తువులను తక్కువ ధరలకు పంపిణీ చేస్తుంది. ఆహార దినుసుల దిగుమతులపై సైతం అమెరికా అడ్డగోలు ఆంక్షల నేపథ్యంలో క్యూబా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం వాటాకు మనదేశంలో దశాబ్దాలుగా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. చిన్న దేశమైన క్యూబాలో చట్ట సభల్లో స్త్రీలు నిర్ణయాత్మక శక్తిగా 55.7 శాతంగా ఉన్నారు. ఇది ప్రపంచ రికార్డు.
ఇంకా ఇతర రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉన్నారు.
– క్యూబా జాతీయ అసెంబ్లీలో మహిళా ప్రతినిధుల శాతం 55.7. ప్రపంచ చట్టసభల్లో లింగ సమానత్వం సాధించిన అతి కొద్ది దేశాల్లో క్యూబా ఒకటి.
– శాస్త్ర సాంకేతిక పరిశోధనారంగాల్లో మహిళలు 41.7 శాతంగా ఉన్నారు. లాటిన్‌ అమెరికా దేశాల్లో సైన్స్‌ రంగంలో పురుషులతో సమానంగా స్త్రీలు నిలబడ్డ దేశాల్లో క్యూబా అగ్రభాగాన ఉంది.
– క్యూబాలో అక్షరాస్యత 100 శాతం. మహిళల అక్షరాస్యత రేటు 99.8 శాతంగా ఉంది. ఆ కొద్దిపాటి నిరక్షరాస్యత పాత తరం వృద్ధ మహిళల్లో ఉంది. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం 70 శాతానికి మించి ఉంది. యునెస్కో 2023 జండర్‌ రిపోర్టు ప్రకారం… ప్రపంచ వ్యాప్తంగా విద్యలో లింగ సమానత్వం అత్యధికంగా ఉన్న దేశం క్యూబా.
– మొత్తం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 66.8 శాతం ఉంది. మేనేజీరియల్‌ (నిర్వహణ పదవుల్లో మహిళలు 33.1 శాతంగా ఉన్నారు.
– సాంస్కృతిక రంగంలో… 61 శాతం కార్మికులు మహిళలే. వీరిలో సగం కంటే ఎక్కువ మంది (54 శాతం) ఉన్నత విద్యా అర్హతలు కలిగిన వారు.
– ప్రపంచంలో నాయకత్వ స్థానంలో మహిళలు అత్యధికంగా ఉన్న అతి తక్కువ దేశాల్లో క్యూబా ఒకటి. అంటే ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది స్త్రీలే. అక్కడ 16 సంవత్సరాలకే ప్రతి వ్యక్తికీ ఓటుహక్కు ఉంటుంది. క్రిమినల్‌ కేసులు ఉన్న వారు పోటీచేయడానికే కాదు, ఓటు వేయడానికి సైతం అనర్హులు.
– 66 శాతం మహిళలు వివిధ రంగాల్లో నిపుణులు. 50 శాతం మంది ఆరోగ్య రంగంలో అత్యున్నత స్థితిలో పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న మహిళ గర్భం దాల్చాక ప్రసవానికి ముందు ఆరు వారాల వేతనంతో కూడిన సెలవు ఉంటుంది. ప్రసవానంతరం మరో మూడు నెలలు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది. ఇది కాకుండా 60 శాతం జీతంపై బిడ్డకు ఒక ఏడాది వయసు వరకు సెలవు తీసుకోవొచ్చు. గర్భిణికి పోషకాహారం, మందుల పంపిణీ, తల్లీబిడ్డల సంరక్షణ బాధ్యతంతా ప్రభుత్వానిదే. 100 శాతం ప్రసవాలు డాక్టర్ల పర్యవేక్షణలో అత్యన్నత సేవల మధ్య జరుగుతాయి. మాతాశిశుమరణాలు దాదాపుగా లేవు. బిడ్డల సంరక్షణ కోసం తండ్రి కూడా లీవ్‌ తీసుకోవచ్చు. ప్రసూతి సెలవు అనంతరం స్త్రీలు పని ప్రారంభించాక పనిప్రదేశాల్లో ఫ్రీటైం, పిల్లల సంరక్షణకు తగిన సదుపాయాలు ఉన్నాయి. పిల్లలకు ఎల్లవేళలా ఉచిత, ఉన్నత వైద్యం, విద్య అందుబాట్లో ఉంటాయి.
– పని ప్రదేశాల్లో, రవాణా సదుపాయాల్లో అన్నింటా కవచం లాంటి భద్రత మహిళలకు ఉంది. ఆడవారిపై వేధింపులు, దాడులు, మోసాలు అత్యల్పం. అలాంటి వారికి తగిన శిక్షలు అమలులో ఉన్నాయి.
– వ్యవసాయంలో మహిళా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు క్యూబా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితితో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ఫలితంగా సహకార సంఘాల్లో మహిళల భాగస్వామ్యం అదనంగా 29 శాతం పెరిగింది. నాయకత్వం వహించే మహిళల సంఖ్య 50 శాతానికి పెరిగింది.
– క్యూబా రోడ్లపై కారుపై వెళ్తున్న వారిని ఆపి లిఫ్ట్‌ అడగొచ్చు. లిఫ్ట్‌ ఇవ్వటాన్ని ఒక సదవకాశంగా ప్రజలు భావిస్తారు. ప్రభుత్వ వాహనమైనా కూడా ప్రజలు ఆపితే ఆగి లిఫ్ట్‌ ఇవ్వాల్సిందే. అందులోనూ శ్రామికులకు ప్రాధాన్యత ఇస్తారు.
– ఇంటర్నెట్‌పై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండడంతో అశ్లీల సాహిత్యానికి, సైబర్‌ నేరాలకు తావుండదు.
ఆకలి, దారిద్య్రం, అసమానతలపై విజయం సాధించే దిశగా కమ్యూనిస్టు క్యూబా ఒక్కటొక్కటిగా అడుగులు ముందుకు వేస్తోంది. ఆరు దశాబ్దాలుగా అమెరికా అనేక కుట్రలూ కుతంత్రాలూ చేస్తున్నా, అమానవీయంగా ఆంక్షలు పెడుతున్నా- క్యూబా వెన్ను వంచకుండా ధైర్యంగా మున్ముందుకు సాగుతోంది.

– ఎల్‌.శాంతి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -