– తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన దిశ
– ప్రజాభవన్‌లో చారిత్రక ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
– మంత్రి సీతక్క సారథ్యంలో మేధావుల సమాలోచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి మహిళల కోసం కొత్త విధానానికి రూపకల్పన చేయనున్నట్టు మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఆమె ప్రారంభించారు. కాన్ఫరెన్స్‌లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, ఇండిస్టియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, సీనియర్ ఐఏఎస్ అధికారులు సీతాలక్ష్మి, అనిత రామచంద్రన్, జి సృజన, శృతి ఓజా, పౌరసరఫరాలశాఖ కమిషనర్ ప్రియాంకా ఆల, అదనపు డీజీ అభిలష్ బిస్త్‌తో పాటు పలువురు మహిళా ఐపీఎస్‌లు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు, నిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, హక్కుల బలోపేతం కోసం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న వివక్షను పూర్తిగా తొలగించేందుకు నిపుణులు, మేధావులు, అధికారులు ఇచ్చే సూచనలు అత్యంత ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ, సమాజపు పోకడల కారణంగా అవి ప్రాక్టికల్‌గా అమలుకావడంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. పని ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యలను చెప్పుకునే అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చ రాజకీయ కార్యక్రమం కాదనీ, మహిళల భవిష్యత్తును నిర్ణయించే చారిత్రక ఘట్టం అని మంత్రి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, ఉద్యోగాలు, భద్రత వంటి రంగాల్లో మహిళలకు ఎలాంటి సౌకర్యాలు అవసరమో తెలుసుకుని, సమగ్ర నివేదిక రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా త్వరలో విస్తృత స్థాయి సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆడపిల్లల ఆరోగ్యం, వంద శాతం విద్య సాధన, మహిళల ఆర్థిక స్వావలంబన, మాతత్వ సెలవులు ప్రయివేటు రంగంలోనూ అమలయ్యేలా చూడటం, తండ్రులూ పిల్లల పెంపకంలో భాగస్వామ్యం కావడం వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. పాఠశాలల్లో అమ్మాయిలను గౌరవించే సంస్కారాన్ని పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. మహిళలు ”నా ఆరోగ్యం-నా బాధ్యత” అనే భావనతో ముందుకు రావాలనీ, వారికి తగిన ఆరోగ్య అవగాహన కల్పించే దిశలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిపుణులతో సబ్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి, ప్రత్యేక సమస్యలున్న ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వాటి పరిష్కార మార్గాలను గుర్తించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ సమావేశం తెలంగాణలో మహిళా సాధికారతకు పునాది వేసే తొలి మెట్టుగా నిలిచిపోతుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి తరం కోసం నేటి మేధోమదనం ఎంతో అవసరమని పేర్కొన్నారు. తెలంగాణను మహిళా సాధికారతలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో మహిళలకు ఉపాధి అవకాశాలు, వివక్ష నిర్మూలన, లింగ సమానత్వం, మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. నిపుణుల అభిప్రాయాలు, సూచనలు, అనుభవాలను ప్రభుత్వం తెలుసుకుని భవిష్యత్ విధానాల్లో ప్రతిబింబింపజేయాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ నిర్వహించారు.
మార్చి 8 నాటికి మహిళా విధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



