Monday, March 9, 2026
E-PAPER
Homeజాతీయంచట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పది శాతమే

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పది శాతమే

- Advertisement -

– మహిళలకు టికెట్లు ఇవ్వడంలో పార్టీల మీనమేషాలు
– సుమారు 52 వేల మంది ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పోటీ…
– అందులో మహిళలకు పార్టీలు ఇచ్చిన సీట్లు 5 వేలు మాత్రమే
– 4,666 ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో మహిళలు గెలిచింది 464 స్థానాల్లోనే
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

మహిళల విషయంలో ‘నేలపై సగం, నింగిలో సగం’ అన్న మాటలు రాజకీయాల్లో సూక్తులకే పరిమితమని తేటతెల్లమైంది. ఉదయం లేస్తే మైకులు పట్టుకొని మహిళా చట్టాలు, రిజర్వేషన్లపై గొంతెత్తే పార్టీలు, చట్ట సభల్లో మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టమైంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా సంబురంగా జరుపుకొన్న రోజునే… రాజకీయ పార్టీల తీరును అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ బట్టబయలు చేసింది. ఈ నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థ ‘విమెన్స్‌ పొలిటికల్‌ పార్టిసిపేషన్‌ అండ్‌ రిప్రజెంటేషన్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో ఆదివారం 93 పేజీల రిపోర్ట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా చట్ట సభల్లో(ఎంపీ,ఎమ్మెల్యేలు) మహిళలు ప్రాతినిధ్యం కేవలం 10 శాతం మాత్రమే ఉందని తన రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశంలోని 543 లోక్‌ సభ స్థానాలు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,123 అసెంబ్లీ స్థానాలకు పోటీ పడిన మొత్తం 51,708 మంది అభ్యర్థుల జాబితాను పరిశీలించినట్టు తెలిపింది. ఈ అభ్యర్థుల్లో కేవలం 5,095(10 శాతం) మాత్రమే మహిళ అభ్యర్థులు ఉన్నట్టు పేర్కొంది. అలాగే మొత్తంగా 4,666 లోక్‌ సభ, అసెంబ్లీ స్థానాల్లో 464 (10 శాతం) స్థానాల్లో మాత్రమే మహిళలు విజయం సాధించినట్టు వెల్లడించింది. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని సికింద్రాబాద్‌, వరంగల్‌ నియోజకవర్గాలు, మహారాష్ట్రలోని బారామతి స్థానానికి 8 మంది చొప్పున మహిళలు బరిలో నిలిచారని తెలిపింది. అలాగే ఆ తర్వాతి స్థానంలో తమిళనాడులోని కరూర్‌, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ కోల్‌కతా నుంచి ఏడుగురు చొప్పున మహిళలు పోటీ చేశారని పేర్కొంది. అయితే.. 2023 సెప్టెంబర్‌ 19న రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు-2023ను లోక్‌సభలో కేంద్రం పెట్టిందని గుర్తు చేసింది. ఈ బిల్లు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు స్థానాలను రిజర్వ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించింది.

దేశవ్యాప్తంగా మొత్తం 74 మంది లోక్‌సభకు ఎన్నికైనట్టు ఏడీఆర్‌ వివరించింది. ఇందులో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌ నుంచి 11 మంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రాల నుంచి ఏడుగురు చొప్పున, మధ్యప్రదేశ్‌ నుంచి ఆరుగురు మహిళ ఎంపీలు గెలుపొందినట్టు రిపోర్ట్‌లో పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 31, కాంగ్రెస్‌ 13, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నుంచి 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇదే సందర్భంలో అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేల సంఖ్య మరింత ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీలు) కలిపి మొత్తం 390 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాగా… తెలంగాణ నుంచి 222 మంది మహిళలు ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దేశవ్యాప్తంగా 492 పార్టీలు కలిపి 5,095 మంది మహిళలకు అవకాశం కల్పించాయి. ఇందులో బీఆర్‌ఎస్‌ పార్టీ 136 మంది ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించగా… అందులో 127 మంది పురుషులు, కేవలం 9 మంది(7శాతం) మహిళలకు అవకాశం కల్పించిందని పేర్కొంది. అత్యధికంగా నామ్‌ తమిలార్‌ కట్చి పార్టీ దాదాపు 50 శాతం మహిళలకు సీట్లు ఇచ్చింది. మొత్తం 302 మందికి సీట్లు ఇవ్వగా… 152 మంది పురుషులు, 150 మంది మహిళలకు అవకాశం కల్పించింది. అలాగే బిజూ జనతాదళ్‌ (బీజేడీ) 25 శాతం, కాంగ్రెస్‌ 14 శాతం, టీడీపీ 14 శాతం, వైసీపీ 12శాతం, బీజేపీ 11 శాతం, సీపీఐ(ఎం) 10, బీఎస్పీ 9, ఆప్‌ 8, ఇలా మహిళలకు అవకాశం ఇచ్చాయి.

అందులోనూ సుసంపన్న మహిళలే
మహిళ ప్రజా ప్రతినిధుల్లోనూ కోటీశ్వరులే ఎక్కువ. మొత్తం 464 మంది మహిళ ప్రతినిధుల సగటు ఆస్తుల విలువ రూ. 17.30 కోట్లుగా ఏడీఆర్‌ పేర్కొంది. మొత్తం ఆస్తుల విలువ రూ. 8,234 కోట్లుగా వెల్లడించింది. అత్యధిక ఆస్తులు కలిగిన మహిళ ఎమ్మెల్యేగా ఏపీకి చెందిన టీడీపీ కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఆమె ఆస్తుల విలువ రూ. 716 కోట్లుగా ఏడీఆర్‌ తెలిపింది. కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి (రూ.388 కోట్లు), నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి (రూ. 291 కోట్లు)తో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అయితే.. తెలంగాణ నుంచి గెలుపొందిన 11 మంది మహిళ ప్రతినిధుల ఆస్తులు రూ.159. కోట్లు కాగా, సగటు రూ.14 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఇక 464 మంది మహిళ ప్రతినిధుల్లో 127 మందిపై క్రిమినల్‌ కేసులు, 68 మందిపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -