Tuesday, January 27, 2026
E-PAPER
Homeజాతీయంతిరోగమనంలో మహిళల హక్కులు

తిరోగమనంలో మహిళల హక్కులు

- Advertisement -

సాధించుకున్న పురోగతిని పదేండ్లుగా కోల్పోతున్నాం
హాథ్రాస్‌ వంటి కేసుల్లోనూ బాధితులకు న్యాయం దక్కట్లేదు
మైక్రోఫైనాన్స్‌లతో అప్పుల ఊబిలోకి మహిళలు
నవతెలంగాణతో ఇంటర్వ్యూలో సీనియర్‌ అడ్వకేట్‌ కీర్తి సింగ్‌

ములాఖాత్‌


‘మహిళలు ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు తిరోగమనంలోకి వెళ్లిపోతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పదేండ్లుగా మహిళల హక్కులకు తీవ్ర భంగం కలుగుతున్నది. సుశీల గోపాలన్‌ కాలం నుంచి ఎన్నో పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. సెక్షన్‌ 498 ఎ, షాబానో కేసు, ముస్లిం మహిళల భరణం, వరకట్నం, మైక్రోఫైనాన్స్‌ సమస్యలపై జరిగిన పోరాటాల్లో పాలుపంచుకున్నాను. 40 ఏండ్ల నుంచి ఐద్వాతో కలిసి పనిచేస్తున్నాను. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు.

బీజేపీ భ్రమల్లో మునిగిపోకుండా మహిళలంతా సంఘటితమై పోరాటాలు చేయడం ద్వారానే హక్కులను కాపాడుకోగలుగుతాం’ అని ఐద్వా ఆలిండియా ఉపాధ్యక్షులు, లా కమిషన్‌ మాజీ సభ్యులు, సీనియర్‌ అడ్వకేట్‌ కీర్తిసింగ్‌ చెప్పారు. దశాబ్దాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న పురోగతిని కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) 14వ జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా నవతెలంగాణకు కీర్తిసింగ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు.

దేశంలో ఏటా ఎన్ని వరకట్న కేసులు నమోదవుతున్నాయి? వాటిని అడ్డుకునేందుకు ఐద్వాగా మీరు చేస్తున్న పోరాటమేంటి?
దేశంలో ఏడాదికి 7,000 నుంచి 8,000 వరకట్న మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికీ వరకట్న వేధింపులు చట్టం సెక్షన్‌ 498ఎ కింద అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల్లో గృహహింస కేసులు కూడా భారీగా పెరిగాయి. ఒక మహిళ శారీరకంగా, మానసికగా పని చేయలేని స్థితికి వెళ్లేలా వేధింపులు పెరిగిపోతున్నాయి. దీనికి మూడేండ్ల శిక్షను ఖరారు చేశారు. దీనితో పాటు 1983లో అత్యాచార చట్టాలలో మార్పుల కోసం పోరాడాము. మేం 1979లోనే వరకట్న వేధింపుల వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించాం. ఆ రోజుల్లో మహిళలను సజీవ దహనం చేసేవారు. పోలీసులు వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిం చేవారు. 1961 నాటి వరకట్న నిషేధ చట్టం పూర్తిగా నిరుపయోగంగా ఉందని మేం గుర్తించాం. వీధుల్లో ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన పోరాటాలు, పార్లమెంట్‌లో మధు దండవతే, సుశీల గోపాలన్‌ వంటి వారు చేసిన కృషితో వరకట్న చట్టాలు మరింత కఠినతరం అయ్యాయి.

మోడీ పదేండ్ల పాలనపై ఏమంటారు ?
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నేరం కాని విషయాలను కూడా నేరంగా మారుస్తోంది. ఉదాహరణకు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం, మతం మార్చుకోవడం వంటి వాటిపై ఆంక్షలు విధిస్తున్నారు. లవ్‌ జిహాద్‌ వంటి భావనలతో మహిళల స్వయం ప్రతిపత్తిపై దాడి చేస్తున్నారు. కుల, మత దురంహకార హత్యల నిరోధానికి చట్టం తీసుకురావడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. ప్రధాని మోడీ హయంలో మనం చాలా వెనక్కి వెళ్లాం. ఉదాహరణకు చూసినట్లయితే ముస్లిం మహిళల చట్టాన్ని కేవలం పురుషులను శిక్షించడానికే ఉపయోగించారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ పేరుతో హిందూ కోడ్‌నే రుద్దాలని చూస్తున్నారు. వాటిలోని లోపాలను సవరించడం లేదు. ఉత్తరాఖండ్‌లో వ్యవసాయ భూమిలో మహిళల హక్కులను కాలరాస్తున్నారు. గృహ హింస, ఆస్తి హక్కు వంటి ప్రగతిశీల చట్టాలను నీరుగారుస్తోంది.

హథ్రాస్‌ ఘటనలో న్యాయ వ్యవస్థ విఫలమయ్యిందా?
హథ్రాస్‌ ఘటన ఆధిపత్య కులాల వాళ్లు దళిత మహిళపై చేసిన దాడి. నిందితులు అధికారంలో ఉన్నవారికి సన్నిహితులు. అందుకే వారిపై పాలకులు చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడున్న సమస్య ఏమిటంటే నిందితులు అధికార బీజేపీకి, ఆ ప్రభుత్వానికి దగ్గరగా ఉండేవారు ఉంటున్నారు.అందుకే వారిపై చర్యలుండవు. ఆశారాం బాపు, రామ్‌ రహీమ్‌ వంటి వారికి శిక్ష పడినా పదే పదే బెయిల్‌ వస్తోంది. ఇది పరిపాలన బలహీనతకు, న్యాయవ్యవస్థ విఫలమైందనడానికి నిదర్శనం. శిక్ష పడిన తర్వాత కూడా కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ వంటి నిందితులకు బెయిల్‌ రావడం అత్యంత దురదృష్టకరం.

మహిళలపై మైక్రోఫైనాన్స్‌ ప్రభావం ఎలా ఉంది..?
మైక్రోఫైనాన్స్‌ సంస్థలు మహిళలను మాత్రమే కాదు మొత్తం కుటుంబాలను మరింత పేదరికంలోకి నెట్టుతున్నాయి. ప్రయివేటు ఫైనాన్స్‌ సంస్థలకు లబ్ది చేకూర్చడానికి ప్రభుత్వం వీటిని ప్రోత్సహించింది. బ్యాంకుల నుండి మైక్రోఫైనాన్ప్‌ సంస్థలు తక్కువ వడ్డీకి డబ్బు తీసుకుని.. అదే సొమ్మును ప్రజలకు అప్పుగా ఇచ్చి వారి నుంచి విపరీతమైన వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు ఇచ్చి మహిళలను తీవ్రమైన అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయి. కేరళ మినహా దేశమంతా మైక్రోఫైనాన్స్‌ అప్పులను చెల్లించలేక, వేధింపులను భరించలేక అనేక మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

మహిళా సాధికారతపై ఏమి చెబుతారు..?
చట్టపరంగా పురోగమిస్తున్నామనుకున్న దశలో ఇప్పుడు తిరోగమనం కనిపిస్తోంది. గృహహింస చట్టం, సతీ నిషేధ చట్టం, ఆస్తి హక్కు చట్టం వంటివన్నీ మేము పోరాడి సాధించుకున్నవి. కానీ ప్రస్తుత ప్రభుత్వం సామాజికంగా ఉపయోగపడే చట్టాలను తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ పోతున్నది. దీంతో మనం సాధించిన పురోగతిని కోల్పోతున్నాం. మహిళలు తమ హక్కులను కాపాడుకోవడానికి ఉద్యమాలే అంతిమ ప్రత్యామ్నాయం. పోరాటాలే శరణ్యం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -