ట్రంపులవారూ కాస్త ఆపరా వారూ
చూసి చూసి ఆ రాకెట్ల హోరు
కొడుతోంది మాకు బోరు
అవుతోంది మనసు బేజారు
పడేయకండి మా బతుకులు బజారు
ఎలాగుంది నా యుద్ధ కవిత ప్రశ్నించాడు యాద్‌గిరి దామోదర్‌ని. ఏడ్చినట్లే ఉంది, యుద్ధ కవితంటే ఇదా, అక్కడ చనిపోతున్న జనాల గురించి, ధ్వంసమౌతున్న ఆస్తుల గురించి, కాలి గాలిలో కలుస్తున్న చమురు గురించి, సముద్రంలో కాలుతున్న చమురు పడవల గురించి, మానవత్వమన్నది లేకుండా చిన్న అమ్మాయిలు, స్త్రీలను ఎలా చంపుతున్నారో ఇవిరా భరు రాయాల్సింది. వారు, హోరు, జోరు, బేజారు, బజారు ఇవొస్తే కవిత అంటారా అని చిన్న సైజు క్లాసే పీకాడు దామోదర్. నాకామాత్రం తెలీదా బావా, ఆ ట్రంపులవారికి అర్థమయ్యేలా రాద్దామన్నదే నా ప్రయత్నం. బాధలు చెప్పుకుంటే తనుకాని, తన మిత్రుడు నెతన్యాహుకాని వినేరకం కాదని నా బాధ అన్నాడు. అవునా, సారీ, యుద్ధం మీద ఇలా రాసేటప్పటికి నాకు కోపమొచ్చిందిలే అన్నాడు దామోదర్. చారు తాగుదాం పద అన్నాడు యాద్‌గిరి. ఎంతుంది జేబులో అంటే ఇరవై అన్నాడు, సర్లే పైన నాలుగు రూపాయలు నేను వేసుకుంటా పద అని దామోదర్ అనేసరికి, ఎందుకు అన్నాడు. తెలీదా నీకు, యుద్ధం వల్ల చారు రెండు రూపాయలు పెరిగింది. ఇద్దరు మిత్రులు మనకిచ్చిన బహుమతుల్లో ఇదొకటి. ఇలాంటి బహుమతులింకా ఏమేమి ఉన్నాయో చారు తాగుతూ మాట్లాడుకుందాం అనేసరికి యాద్‌గిరి ఉత్సాహంగా అడుగులేశాడు.
సిగ్గు శరం ఉన్నోడెవడూ ఇన్ని దెబ్బలు తగులుతున్నా పట్టించుకోనట్టు నటిస్తూ యుద్ధాన్ని పదిరోజులాపినానంటూ, మరో యుద్ధాన్ని నివారించినానంటూ అబద్ధాలు చెప్పే అమెరికా ప్రెసిడెంటును ఇంకొకరిని చూడలేదు బావా అన్న యాద్‌గిరి మాటలకి అంతకుముందు ఆ సీట్లో కూచున్నోళ్లు ఇలాగే ఉన్నార్లే చాలామంది, ఈయన ఇంకొన్ని అడుగులు ముందుకేస్తున్నాడు. పాతోళ్లకు చాలామందికి మంచి పేరు తెప్పిస్తున్నాడు మరి. ఇలా సాగిపోతున్నాయి వాళ్ల మాటలు.
ముందుకే పోతాం అంటే అర్థం తెలియకుండా ఇద్దరు మిత్రులు మాట్లాడే మాటలు వెగటుగానూ, మొరటుగానూ ఉన్నాయి. ముందుకు పోవడం, ముందు దారి అంటే కనీస అవగాహన కల్పించాలి వీరికి.
”ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని ఉన్నా
ముందు దారి మాది
ఉన్నచోటు చాలును మీకు
ఇంకా వెనక్కి పోతామంటారు కూడా మీలో కొందరు
ముందుకు పోతాం మేము
ప్రపంచం మా వెంట వస్తుంది…” – శ్రీశ్రీ కవిత.
ఆ ఇద్దరు యుద్ధపిపాసులు మాత్రం నిజంగానే వెనక్కి, ఇంకా ఇంకా వెనక్కి పోతున్నారు. రోజూ వార్తల్లో కనిపించడం, భయంకరమైన ప్రకటనలు చేయడం, అబద్ధాలాడడం ఆ ఇద్దరికీ అంత ఇష్టం మరి. బూచోడు, గబ్బర్‌సింగు వస్తున్నారంటే నిద్రపోని పిల్లలు, పాలుతాగని పిల్లలు ఉండరంటారు. వీళ్లిద్దరిముందూ ఎవ్వరూ కొరగాకుండా పోతున్నారు. టీవీల్లో వీళ్ల మొహాలు చూస్తే తిండికూడా సహించడంలేదు మనుషులకు. ఎన్నిదేశాలు సహాయం ఆపేసినా, వ్యతిరేకించినా, ఇక ఆపేసి మర్యాదగా నిష్క్రమిద్దామని సైన్యాధికారులు చెప్పినా వీళ్లకు అర్థం కాదు. జుట్టుపట్టుకొని బయటకీడ్చినా, చూరుపట్టుకొని వేలాడదాం ఇద్దరం అని ఒప్పందమేదో చేసుకున్నట్టున్నారు. చర్చలంటూ కావలించుకొని, వెన్నుకనుండి కత్తితో పొడిచే ధీర భీరువులు వీళ్లు.
తన కార్యదర్శిని పిలిచి ట్రంపులవారు యుద్ధం ఆపడం ఒక కళ అన్న పుస్తకం ఉందా అనడిగాడు. ఇంతవరకూ వచ్చినట్టు లేదు సారి అన్నింటిలోనూ సర్చ్ చేసి చెప్పాడు. ఐతే నేనే ఒకటి రాసేస్తా. లేదంటే నా ఆత్మకథ రాస్తా మంచి పేరు సూచించు. బోల్తా కొట్టిన నాయకుడు, బోర్లాపడ్డ వీరుడు, ఇంటాబయటా ఛీత్కారం ఈ మూడు ఇప్పటికి తట్టినాయి మిస్టర్ ప్రెసిడెంట్ అన్నాడు కార్యదర్శి. మరీ ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి పేర్లు. ట్యాగ్‌లైన్లు కూడా ఉంటాయి సార్, తిరిగి కెరటంలా లేస్తాడు, రబ్బరుబంతిలా వస్తాడు, ఐనా ఒక్క మిత్రుడుంటే చాలు ఇలాగన్న మాట. ఎన్ని యుద్ధాలాపినా నాకు శాంతి బహుమతి ఇవ్వరు కాని ఆత్మకథకు సాహిత్యంలో నోబెల్ బహుమతో, బుకర్స్ బహుమతో వచ్చేలా చూడవయ్యా. ఇంకా రాయందే? కార్యదర్శి అనుమానం వ్యక్తం చేశాడు. రాయడం మొదలు పెట్టవయ్యా… అనే సరికి ఓహో అధ్యక్షులవారు కదా నేనే రాయాలి కాబోలు అనుకున్నాడు కార్యదర్శి.
ప్రపంవ్యాప్తంగా చాలాచోట్ల ట్రంపులవారి దిష్టిబమ్మలు తగులబెట్టారు. యుద్ధంలో ఎగిసిపడుతున్న మంటలకు ఇవి ఏ మాత్రం తక్కువ లేవు. ఆ వెలుగులే ప్రపంచానికి చీకటిని దూరం చేసి, వెలుగులు పంచుతాయన ఆశ కలుగుతోంది. ప్రపంచ ప్రజలు ఇద్దరు యుద్ధమిత్రులకు దినంపెట్టే రోజెప్పుడొస్తుందని ఎదురుచూడ్డంలో తప్పేమీ లేదు కాని అది ఈ యుద్ధాలకు ముగింపు కాదు. హిట్లర్‌ను చిత్తుచేసిన రష్యా ఎర్రసైన్యంలాంటిది కావాలిప్పుడు. అప్పటివరకూ ఈ కష్టాలు తప్పవు.
జంధ్యాల రఘుబాబు
9849753298
ట్రంపుల ”వారు” కాస్త తగ్గరూ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



