ఆంగ్ల విమర్శలో ఇమేజ్‌గా వాడుకలో ఉన్న మాటకు తెలుగులో పదచిత్రం, బింబం సమానార్థకాలు. దీన్నే భావచిత్రం అని కూడా అంటున్నాం. ఇమేజరీని ఇమేజ్ కు బహువచనంగా, మనసులో పదచిత్రాలను పుట్టించే భాషగా చెప్పుకోవచ్చు. కానీ, ఇమేజ్ కు సరిగ్గా పొసగే ఒరిజినల్ (మొదటి) మాట ప్రతిమ అంటారు సాహిత్య విమర్శకులు. ఇంద్రియాలకు గోచరమయ్యే అనుభవం తాలూకు శబ్దార్థ ప్రకారమైన (literal), లేదా ఇదమిత్థమైన (concrete) నివేదన అన్నమాట. ఇక్కడ కాంక్రీట్ అంటే అమూర్త (abstract) కు వ్యతిరేకం అని గ్రహించాలి. 1930 ల తర్వాతి విమర్శకులు, ముఖ్యంగా ‘నవ్య విమర్శకులు’ ఉ వీళ్లు New Critics పేరుతో ప్రసిద్ధులు ఉ పదచిత్రాలకు గల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ అవి కవిత్వంలో అర్థానికి, రూపానికి, ప్రభావానికి అవసరమయ్యే ప్రముఖ అంశాలు అన్నారు. మంచి కవిత్వంలో పదచిత్రాలు ఉంటాయి. కొన్నిసార్లు అన్నిటిని కలిపి కవితను పదచిత్రాల సమాహారంగా మనసులో బొమ్మ కట్టించుకోవచ్చు. పదచిత్రాలు ఇంద్రియ గోచరత్వంతో భావోద్వోగాలను అనుభవేకవేద్యం చేస్తాయి. అవి భావోద్వేగానికీ అభివ్యక్తికీ మధ్య వారధులు.
పద చిత్రాలు శబ్దార్థపరమైనవి (literal) కావచ్చు, లేక ఆలంకారికమైనవి (figurative) కావచ్చు. ఈ కింది విలియమ్ వర్డ్స్ వర్త్ సానెట్ ను పరిశీలిద్దాం.
It is a beauteous evening, calm and freeÑ
The holy time is quiet as a Nun
Breathless with adorationÑ the broad sun
Is sinking down in its tranquillity
మొదటి, చివరి పంక్తులు భౌతిక అంశాలను వివరిస్తూ దశ్యాన్ని సరిగ్గా కళ్లకు కడుతున్నాయి. వాటిలోని భావాన్ని గ్రహించేందుకు కేవలం వాటి పదాల అర్థాలు చాలు. కానీ రెండవ, మూడవ పంక్తులలో ఆలంకారికమైన వక్రత ఉంది. పదచిత్రాలు మనసులో ఆకారాల, దశ్యాల దగ్గోచరత్వాన్ని కలిగిస్తాయి నిజమే కానీ, పాఠకులందరి విషయంలో అదే విధంగా జరగకపోవచ్చు. జరిగినా దాని స్పష్టత, ప్రభావం అందరిలో ఒకే పరిమాణంలో ఉండకపోవచ్చు. పైగా పదచిత్రాలు వినికిడి, స్పర్శ, వాసన, రుచి లాంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించినవి కూడా అయివుండవచ్చు. లార్డ్ టెన్నిసన్ రచించిన In Memoriam అనే ఈ కింది కవితలో ఈ విశేషాన్ని గమనించండి.
Unloved, that beech will gather brown,
And many a rose-carnation feed
With summer spice the humming air….
చాలా సందర్భాలలో పదచిత్రాలు ఆలంకారికతను కలిగి వుంటాయి. అవి ముఖ్యంగా రూపకాలకు, ఉపమలకు వాహికలుగా పని చేస్తాయి. షేక్స్పియర్ నాటకాలలో పునరావతమయ్యే ఆలంకారిక సన్నివేశాలను వివరిస్తూ కారొలిన్ స్పర్జన్, King Lear లో జంతుసంబంధమైన పదచిత్రాల నమూనాలు, Hamlet లో వ్యాధి, అవినీతి, చావుకు సంబంధించిన పదచిత్రాల నమూనాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని వెల్లడించారు. ఇవి రచయితల స్వభావాన్ని, వ్యక్తిగత ఇష్టాలను, అనుభవాలను పట్టిస్తాయని సూచించారు. ఈ నమూనాలను విమర్శ పరిభాషలో motifs అంటారు.
ప్రాచీన తెలుగు కావ్యాలలో పదచిత్రాలకు ఉదాహరణలు కోకొల్లలు.
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ …
ఇంతింతై వటుడింతింతై మఱియు దానింతై …
సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడు …
అల వైకుంఠపురంబులో మందార మకరంద మాధుర్యమున దేలు …
ఇవన్నీ పోతనవి.
ఇక వచన కవిత్వంలో దాహరణలు ఇవ్వవలసివస్తే, ఈ కిందివి అందుకు అనుకూలంగా ఉంటాయి.
రైళ్ళు లేని ప్లాట్ ఫార్మ్‌లు/ నీళ్ళు లేని కాలువ గట్లవుతాయి
ఇద్దరమూ ఎండిన చెట్లల్లె నిలబడతాం (కొప్పర్తి)
మండు వేసవిలో వేడి గాలులు చెలరేగి/ వేలాడే చీర ఉయ్యాలలలోని
పసిపిల్లలతో సహా చెట్లని/ ఆకాశంలోకి ఎగరేసుకు పోవచ్చు (దేవిప్రియ)
పై రెండు పదచిత్రాలు దష్టికి సంబంధించినవి కాగా ఈ కిందిది ఘ్రాణేంద్రియానికి సంబంధించింది.
మట్టిని తాకితే మనిషి వాసన వేస్తుంది/ మనిషిని స్పృశిస్తే మట్టి వాసన లేదు
మనిషి మట్టి పరిమళాన్ని కోల్పోయాడు/ ఒట్టి కాగితం పువ్వు మనిషి (మల్లెల నరసింహమూర్తి)
భగ్వాన్ రాసిన విరిగిన మగ్గం అనే కవితలో వినికిడికి సంబంధించిన పదచిత్రాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పంక్తులను పరిశీలించండి.
మగ్గం ఆడే చప్పుడు/ ఇంట్లో సిరుల తల్లి నడుస్తున్న చప్పుడులా ఉండేది
అది కొయ్యకాళ్ళ చప్పుడని ఋజువయింది
అది పాడెకోసం వెదురును చీల్చుతున్న చప్పుడని తేలిపోయింది
అది ఖాళీ కంచాల చప్పుడని తెలిసొచ్చింది
(మధ్యలో alternate పంక్తులలో మరికొన్ని ఇలాంటి అభివ్యక్తులే ఉన్నాయి.)
పదచిత్రాలు ఇంద్రియ దగ్గోచరత్వం సహాయంతో కవితలను అనుభూతిమయంగా, అనుభూతికరంగా మార్చడానికి పనికి వచ్చే చక్కని సాధనాలు.



