Sunday, October 19, 2025
E-PAPER
Homeజాతీయంమాటలు ఘనం..చేతలు శూన్యం

మాటలు ఘనం..చేతలు శూన్యం

- Advertisement -

నిధుల కొరతతో కేంద్ర పథకాలు నత్తనడక

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో అనేక బడ్జెటరీ హామీలు కురిపించారు. ఆరేండ్లు గడిచినప్పటికీ వాటికి అతీగతీ లేకుండా పోతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం 906 పథకాలను ప్రకటించగా వాటిలో 71.9 శాతం పథకాలు నిధుల కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రకటించిన ప్రతి ఐదు పథకాలలో ఒక దానికి బడ్జెట్‌లో ఇచ్చిన హామీలో సగం కూడా ఖర్చు చేయలేదు. దేశంలో మూడు కోట్ల మంది చిల్లర వర్తకులు, కిరాణా షాపులు నడుపుకునే చిన్న వ్యాపారులకు పెన్షన్‌ ప్రయోజనాలు కల్పిస్తామని 2019 జులైలో చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్‌ అందించడానికి మొదటి సంవత్సరంలో రూ.750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం తెలియ జేసింది. అయితే ఆ ఐదు సంవత్సరాలలో ఈ పథకానికి బడ్జెటరీ కేటాయింపులు దారుణంగా ఉన్నాయి. చివరి ఏడాదిలో అయితే మూడు కోట్ల రూపాయలు కేటాయించి అందులో కూడా కేవలం పది లక్షల రూపాయలే ఖర్చు చేశారు. మొత్తంగా చూస్తే ఐదు సంవత్సరాల కాలంలో రూ.1,133 కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.162 కోట్లు మాత్రమే విదిల్చారు.

2023 జనవరి వరకూ కేవలం ఐదు వేల మందికి మాత్రమే పెన్షన్‌ అందజేశారు.అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ప్రారంభించిన పథకం కూడా విఫలమైంది. దేశవ్యాప్తంగా 42 కోట్ల మందికి లబ్ది చేకూర్చాల్సి ఉండగా పథకాన్ని ప్రారంభించిన తర్వాత మొదటి మూడు సంవత్సరాల కాలంలో 42 లక్షల మందికి మాత్రమే ప్రయోజనం కలిగింది. ఇక వృద్ధుల కోసం తీసుకొచ్చిన పథకం కూడా నీరుకారిపోయింది. పెన్షన్‌ పథకాల అమలు నత్తనడక నడుస్తోందనడానికి ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇదిలావుంటే సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల్లో భారీగా కోతలు పెట్టారు. నాలుగింట మూడు వంతుల సంక్షేమ పథకాలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన దాని కంటే తక్కువగానే కేటాయింపులు జరిగాయి. ప్రకటించిన మౌలిక సదుపాయాల పథకాల్లో 73 శాతం పథకాలకు జరిపిన కేటాయింపులు కూడా తక్కువగానే ఉన్నాయి. పప్పులు, చమురు గింజలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఎన్నికలు జరిగిన 2019, 2024లో మినహా మిగిలిన సంవత్సరాల్లో ఆ ఊసే ఎత్తలేదు. అలాగే విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పడమే కానీ చేసింది చాలా తక్కువ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -