Friday, October 24, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమంగళాట్యూబ్‌ పరిశ్రమలో కార్మికుని మృతి

మంగళాట్యూబ్‌ పరిశ్రమలో కార్మికుని మృతి

- Advertisement -

కనీస భద్రతా ప్రమాణాలు పాటించనందుకే దారుణం
సీఐటీయూ ఆధ్వర్యంలో కంపెనీని ముట్టడించి ఆందోళన
నష్టపరిహారానికి యాజమాన్యం అంగీకారం

నవతెలంగాణ-జహీరాబాద్‌
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ బూచినేల్లి ఇండిస్టియల్‌ ఏరియాలోని మంగళాట్యూబ్‌ పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదంలో అసోంకు చెందిన కార్మికుడు రోహిత్‌ గొగోయ్ (49) మృతి చెందాడు. మృతిచెందిన కార్మిక కుటుంబానికి న్యాయం చేయాలని, మరణానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకొని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కంపెనీ గేటు ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యాజమాన్య ప్రతినిధులకు సీఐటీయూ నాయకులకు పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దాంతో చిరాగ్‌పల్లి ఎస్‌ఐ రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాజమాన్యంతో చర్చలు జరపగా.. నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. కార్మికుని కుటుంబంలో ఒకరికి పర్మినెంట్‌ ఉద్యోగం, అంత్యక్రియలు తదితర ఖర్చులకు రూ.10లక్షలు ఆర్థిక సాయం చేయడానికి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. కాగా, ఈ ఘటనపై మృతుని బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, జహీరాబాద్‌ ఇండిస్టియల్‌ క్లస్టర్‌ కన్వీనర్‌ ఎస్‌.మహిపాల్‌ మాట్లాడుతూ..పరిశ్రమలో కనీసం భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో నే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే పరిశ్రమ శాఖ అధికారులు పరిశ్రమను తనిఖీ చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. యాజమాన్యం ఇస్తున్న నష్టపరిహారంతో పాటు చట్టపరంగా కార్మికునికి రావాల్సినవన్నీ కూడా ఇప్పించేందుకు యాజమాన్యం బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నరేష్‌, మహేశ్వర్‌, సందీప్‌ రెడ్డి, రవి, నాయకులు బాల్‌ రాజ్‌, నజీర్‌, శ్రీకాంత్‌, వాహబుద్దీన్‌, భార్గవ్‌, రాజ్‌ కుమార్‌, ఉమా,ముతబీర్‌, పులెందర్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -