– నేతన్నల సమస్యలపై మహాధర్నా : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సంక్రాంతి లోపే ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రారంభించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేతన్నల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై బీఆర్‌ఎస్ మహాధర్నా నిర్వహిస్తుందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అపెరాల్ పార్క్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వర్కర్ టు ఓనర్’ అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని సంక్రాంతి లోపలే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోందని విమర్శించారు. గతంలో రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పవర్ లూమ్‌లను సబ్సిడీపై కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను వచ్చే బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి లోపలే ఆసాముల లిస్టును ఫైనల్ చేసి, అర్హులైన నేత కార్మికులకు లెటర్లు ఇవ్వాలని కోరారు. ఒకవేళ సంక్రాంతి లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, సంక్రాంతి అనంతరం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నేత కార్మికులందరినీ సమీకరించి ఆందోళనకు దిగుతామన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉన్న మూడంచెల వ్యవస్థను అధ్యయనం చేయాలని బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ అధికారులను ఆదేశించారని చెప్పారు. కార్మికులు, ఆసాములు, సీట్లు అనే వ్యవస్థలో కార్మికుడు కార్మికుడిగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ, కార్మికుడిని ఆసామిగా మార్చే విప్లవాత్మక ఆలోచనతో ‘వర్కర్ టు ఓనర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఇది దేశంలోనే కాక, బహుశా ప్రపంచంలోనే ఎక్కడా లేని వినూత్న పథకమన్నారు. బీడీలు చుడుతూ ఆరోగ్యాన్ని కోల్పోతున్న మహిళలకు మంచి వాతావరణంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపెరాల్ పార్కును, దానికి అనుసంధానంగా వర్కర్ టు ఓనర్ కార్యక్రమాన్ని రూ.400 కోట్లతో కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. దాదాపు 50 షెడ్ల నిర్మాణాలు రెండేండ్ల కిందటే పూర్తయ్యాయని, పవర్ లూమ్‌లను సబ్సిడీపై అందించి కార్మికులనే యజమానులుగా మార్చాలనే ఆలోచన అందులో భాగమేనని అన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నేత కార్మికులు ఆసాములుగా, వర్కర్ ఓనర్లుగా మారాలని, సిరిసిల్ల ఒక తిరుపూర్ మాదిరిగా వేల కోట్ల రూపాయల వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి లోపే ‘వర్కర్ టు ఓనర్’ ప్రారంభించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



