సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం 24 గంటల సమ్మె విజయవంతం
బ్యూనస్ ఎయిర్స్ : వివాదస్పద కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా అర్జెంటీనా ఆందోళనలు వెళ్లువెత్తాయి. 24 గంటల పాటు సమ్మెను కార్మికులు విజయవంతంగా నిర్వహించారు. సమ్మె కారణంగా దేశంలో రవాణా వ్యవస్థ స్థంభించింది. దుకాణాలు, సూపర్‌మార్కెట్లు మూసివేశారు. అయితే అనేక ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా పార్లమెంట్ వెలుపల నిరసన చేస్తున్న కార్మికులను చెదరగొట్టడానికి పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. కార్మికులు ప్రతిఘటించడంతో వారిపై జలఫిరంగులను ప్రయోగించారు. అయినా కార్మికులు అక్కడే నిలబడ్డంతో అధికారులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లతో విరుచుకుపడ్డారు.
పదుల సంఖ్యలో కార్మికులను అరెస్టు చేశారు. అర్జెంటీనా ప్రస్తుత అధ్యక్షుడు జేవియర్ మిలే హయాంలో కార్మికులను సార్వత్రిక సమ్మెను నిర్వహించడం ఇది నాలుగోసారి. అమెరికా అధ్యక్షుడై డొనాల్డ్ ట్రంప్‌కు సైద్ధాంతిక మిత్రుడుగా మిలేకు పేరుంది. మిలే తీసుకొచ్చిన వివాదాస్పద సంస్కరణలకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే అర్జెంటీనా బడ్జెట్ కోతలును ఎదుర్కొంటుంది. ఉద్యోగ భద్రత కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో మిలే తీసుకొచ్చిన సంస్కరణలు కార్మికులను నియమించుకోవడం, తొలగించడం సులభతరం చేస్తాయి. అలాగే, వేతనాలు చెల్లింపును తగ్గిస్తాయి. సమ్మె చేసే హక్కును పరిమితం చేస్తాయి. సెలవులను పరిమితం చేస్తాయి. పని గంటలను పెంచుతాయి.
ఈ వివాదస్పద సంస్కరణలను తుది ఆమోదం కోసం సెనేట్‌కు పంపారు. ఈ సంస్కరణలపై కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, అధికారంలో వచ్చిన తరువాత చేస్తున్న చర్యలకు సంబంధం లేదని కార్మికులు విమర్శిస్తున్నారు. రెండేండ్ల మిలే హయాంలో 21 వేల కంటే ఎక్కువ కంపెనీలు మూతబడ్డాయని, 3 లక్షలకు పైగా ఉద్యోగాలు పోయాయని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా అర్జెంటీనాలోని ప్రధాన టైర్ ఫ్యాక్టరీ ఫేట్ ఈ నెల 18న బ్యూనస్‌ఎయిర్స్‌లోని తన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య దాదాపు 1000 ఉద్యోగాల కోతకు దారి తీసింది. అర్జెంటీనాలో కార్మికుల్లో దాదాపు40 శాతం మందికి అధికారిక ఉపాధి ఒప్పందాలు లేవని, నూతన సంస్కరణలు కార్మికుల పరిస్థితిని మరింత దిగజార్చుతాయని యూనియన్ల నాయకులు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ రంగంలో భారీ ఉద్యోగాల కోతలు, ఆదాయం తగ్గుదల కారణంగా వినియోగ శక్తి దిగజారి ఆర్థిక కార్యకలాపాలు క్షీణించాయని నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు గురువారం నిర్వహించిన సమ్మెకు భారీ మద్దతు లభించింది. విజయవంతమయింది. అయితే దేశంలో తీవ్ర స్థాయిలో సమ్మె జరుగుతుంటే అర్జెంటీనా అధ్యక్షుడు మిలే స్వదేశంలో లేకపోవడం గమనార్హం. ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ మొదటి సమావేశానికి హాజరుకావడం కోసం వాషింగ్టన్ వెళ్లారు. ట్రంప్ ప్రతిపాదించిన ఈ బోర్డుపై ఐరాసతో సహా అనేక దేశాలు విమర్శలు చేస్తున్నా మిలే దానికి మద్దతు ఇవ్వడం గమనార్హం.



