కూలి కోసం పోరాటం..
12వ రోజుకు చేరుకున్న కార్మికుల సమ్మె
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రజా పాలనలో కార్మికులు కూలి పెంపు కోసం పోరాటం చేస్తూ పస్తులుంటున్నారని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాముల రమేష్ చంద్ర అన్నారు. టెక్స్ టైల్ పార్క్ లో కార్మికులకు యజమానులు కూలి పెంపు చేయకుండా మొండివైఖరిని నిరసిస్తూ కార్మికులు శనివారం ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం రోజుకు 12 రోజులకు చేరుకుంది. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాముల రమేష్ చంద్ర కార్మికులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వస్త్రాలకు సిరిసిల్లలో కార్మికులకు వస్తున్న వేతనంలో సగం వేతనం కూడా పార్కు కార్మికులకు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్డర్ వస్త్రానికి మీటర్ కు అధిక రూపాయల లాభం తీసుకుంటూ కూడా కార్మికుల కూలీ పెంచకుండా యజమానులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారన్నారు.
యజమానులు ప్రదర్శిస్తున్న మొండి వైఖరికి కార్మికులు పస్తులు ఉంటున్నారని వాపోయారు. శాసనసభ్యులు కేటీఆర్ స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కారం చూపాలన్నారు. పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ హిందువులు బంధువులు అంటూ ప్రజల సమస్యలు నుండి దృష్టి మళ్లిస్తూ తన రాజకీయ జీవితం పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్మికులందరూ హిందువులు కాదా..కార్మికుల ఆకలి కేకలు మీకు వినపడవా అని ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి స్పందించి, యాజమాన్యంతో చర్చలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
లేకుంటే కార్మికులందరూ కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని, పోరాటం ఉదృతం చేసి మా న్యాయమైన డిమాండ్స్ సాధించుకునే వరకు ముందుకు వెళ్తామన్నారు. పార్కులో కూలి పెంచే వరకు సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్కు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ , జెల్ల సదానందం , కారంపూరీ మహేష్ కనుకయ్య కిషన్ , శ్రీకాంత్ , సంపత్ , శ్రీనివాస్ , వెంకటేష్ ,మహేష్ , ఆంజనేయులు , భాస్కర్ , సత్యనారాయణ , రమేష్ , అంబదాస్ , రాజేష్ , శంకర్ , వేణు , రాజశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు.