Friday, September 19, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబందీఖానాలో కార్మికులు

బందీఖానాలో కార్మికులు

- Advertisement -

లాభాపేక్ష తప్ప శ్రామికుల సంక్షేమం పట్టని యాజమాన్యాలు
దుర్లభంగా వలస కార్మికుల బతుకులు
పని ప్రదేశాల్లో అవస్థలు…ప్రమాదపుటంచుల్లో జీవనం
రోజుకు 12 గంటలు పని చేయాల్సిందే
నెలలో 27 రోజులు పనిచేస్తేనే పూర్తి వేతనం
కనీస వేతనం, కార్మిక చట్టాల ఊసే లేనివైనం
ఫ్యాక్టరీ ప్రమాదాల్లో మరణిస్తే పట్టించుకునే వారు కరువు
బందెల దొడ్డి లెక్కే వసతి ఏర్పాట్లు

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా ముందుకెళ్తుంది. ఆ మేరకు కార్మిక వర్గం కూడా పెరుగుతోంది. కానీ పరిశ్రమల్లో కార్మికుల బతుకులు దుర్భరంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోని పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం. ఉద్యోగం, వసతి, వేతనం అంటూ ఆశలు చూపి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికుల్ని ఇక్కడకు తరలిస్తున్నారు. ఆ మాత్రం పనులు కూడా వారి రాష్ట్రాల్లో దొరక్కపోవడంతో తక్కువ వేతనం, మురికి కూపాలు వంటి వసతులు కల్పించినా, తలొంచుకొని పనిచేసుకెళ్లడానికే వలస కార్మికులు అలవాటు పడిపోతున్నారు. అనారోగ్యం పాలైతే తోటి కార్మికులే కుటుంబసభ్యులుగా మారి తమ జట్టు కార్మికుల జీవితాల్ని కాపాడుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులు వెట్టి చాకిరిని మించి ఉన్నాయి. 8 గంటల పనిదినం మర్చిపోయి చాలాకాలమైంది. కనీసం 12 గంటలు పనిచేయాల్సిందే. నెలలో హాజరు తప్పనిసరిగా 27 రోజులు ఉండాల్సిందే. అప్పుడే ఇచ్చే అరకొర వేతనాన్ని నెలరోజులకు లెక్కకట్టి ఇచ్చేది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు పర్మినెంట్‌ పద్దతి ఏనాడో పోయింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, డైలీవైజ్‌, క్యాజువల్‌ వంటి రకరకాల పేర్లతో శ్రమదోపిడీ చేయడానికే యాజమాన్యాలు అలవాటుపడ్డాయి. కనీస వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌, సెలవులనే హక్కులేవీ వీరికి వర్తించట్లేదు. సంపద సృష్టికర్తలు రెండు పూటలా తిండికి నోచుకోలేని దౌర్భాగ్యస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో దాదాపు 59,846 వివిధ రకాల పరిశ్రమలు ఉన్నాయి. భవన నిర్మాణం సహా ఇతర రంగాల్లోనూ భారీ సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా పరిశ్రమల్లో దాదాపు 16.64 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నట్టు కార్మిక శాఖ గణాంకాలు చెప్తున్నాయి. మేస్త్రీలు, లేబర్‌ కాంట్రాక్టర్లు, దళారుల ద్వారా పనిలో పెట్టుకున్న కార్మికుల సంఖ్య ఏ రికార్డుల్లోనూ నమోదుకావట్లేదు. రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ ఇతర ఉమ్మడి జిల్లాల్లోని అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో ఆటోమెబైల్‌, టెక్స్‌టైల్స్‌, ఖనిజాభివృద్ధి, ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫార్మా, రసాయన, బొగ్గు, సౌర విద్యుత్‌, వ్యవసాయ అనుబంధం, పేపర్‌ అండ్‌ ప్రింటింగ్‌, ప్లాస్టిక్‌ అండ్‌ రబ్బర్‌, బీడీ, బేవరేజెస్‌, నిర్మాణ రంగం, ఆహారశుద్ది, లెదర్‌, తేయాకు అనుబంధ పరిశ్రమలున్నాయి. భారీ, మధ్యతరహా, చిన్న పరిశ్రమల్లో పని చేస్తున్న శ్రామికులు సంపద సృష్టికర్తలుగా ఉన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం వల్ల కంపెనీల దయాదాక్షిణ్యాలతో వారు ఎంత ఇస్తే అంతే తీసుకొని పని చేయాల్సి వస్తుంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం దెబ్బతినడం వల్ల పారిశ్రమిక రంగంలోనే కాస్తకూస్తో ఉపాధి లభిస్తుందనే ఆశతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వలస కార్మికుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణకు ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి భారీగా వలస కార్మికులు వస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లోని పారిశ్రామికవాడల్లో వీరి సంఖ్య దాదాపు 3.25 లక్షలుగా ఉంది.

ప్రభుత్వం గుర్తించని కార్మికుల సంఖ్య దీనికి అదనం. ఆయా కార్మికుల కుటుంబనేపథ్యం, పేదరికాన్ని ఆసరా చేసుకుంటున్న యజమాన్యాలు తీవ్రమైన శ్రమదోపిడీ, ఆర్థిక వివక్షను ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా యాజమాన్యాల కొమ్ము కాస్తున్నాయే తప్ప, కార్మికుల పక్షాన నిలవట్లేదు. అనేక సంఘటనల్లో ఈ విషయం స్పష్టంగానే వెల్లడైంది. కార్మికులకు వారాంత సెలవులు కూడా ఇవ్వట్లేదు. పండుగలు, పబ్బాలు లేనేలేవు. పనిగంటల పరిమితీ లేదు. ఐదేండ్లకోసారి కనీస వేతనాలు సవరిస్తూ రాష్ట్ర కార్మికశాఖ గెజిట్‌ విడుదల చేయాలి. ఆ ప్రక్రియ 2007తో ఆగిపోయింది. స్వరాష్ట్రం వచ్చాక ఇప్పటి వరకు కనీస వేతనాల జీవోలు సవరించలేదు. కాగితాల్లోనే కార్మిక సంక్షేమం కనిపిస్తోంది. రాష్ట్రంలో 73 ఉపాధి రంగాలను ప్రభుత్వం గుర్తించింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లో దాదాపు 1.27 కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారని అంచనా. వారెవరికీ కనీస వేతనాలు లేవు. వీరిలో 38 లక్షల మంది మహిళలు ఉన్నట్లు కార్మిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కనీసం కంపెనీ కార్మికుడుగా గుర్తింపు కార్డులు కూడా ఇవ్వట్లేదు. వలస కార్మికుల్ని కంపెనీ సమీపంలో రేకుల షెడ్లు వేసి, అక్కడే వసతి కల్పిస్తున్నారు. ఇరుకైన గదుల్లో పదుల సంఖ్యలో కార్మికులు తలదాచుకోవాల్సి వస్తోంది. తాగునీరు, విద్యుత్‌ సదుపాయముండదు. డ్రైయినేజీ లేక దుర్గందం వెదజల్లుతున్నా అక్కడే పనిచేస్తూ బతకాలి. జీడిమెట్ల, చర్లపల్లి, బాలానగర్‌, షాద్‌నగర్‌, ఆదిభట్ల, కూకట్‌పల్లి, పాశమైలారం, బొంతపల్లి, బొల్లారం, గడ్డపోతారం, సంగారెడ్డి, కొండాపూర్‌, సదాశివపేట, పటాన్‌చెరు, హత్నూర వంటి పారిశ్రామిక వాడల్లో పని చేసే కార్మికుల బతుకులు దుర్బరం. ఏండ్ల తరబడిగా పని చేస్తున్నా రెగ్యులర్‌ చేయకపోవడం..వేతనం పెంచకపోవడంతో రెండు పూటల కడుపునిండా తినే పరిస్థితిలేదు.

తరచూ ప్రమాదాలు…వీధిన పడుతున్న కుటుంబాలు
కంపెనీల్లో కనీస భద్రతా చర్యలు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రసాయన, ఫార్మా, రబ్బర్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, అయిల్‌ పరిశ్రమల్లో బాయిలర్స్‌, రియాక్టర్లు పేలి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలిన ప్రమాదంలో 54 మంది కార్మికులు చనిపోయారు. 8 మంది కాలి బూడిదయ్యారు. అన్‌స్కిల్డ్‌ వర్కర్లకు తక్కువ జీతాలిచ్చి రియాక్టర్ల వద్ద పని చేయిస్తున్నారు. కనీస భద్రతా చర్యలులేవు. ఏదైన చిన్న తప్పిదం జరిగితే నివారించే సాంకేతికత అందుబాటులో ఉండదు. కనీసం ఫైర్‌ ఇంజన్స్‌ వచ్చేందుకు కూడా కంపెనీలకు రోడ్లు ఉండవు. బీఎస్‌ ఫార్మాలో ప్రమాదం జరిగి ఏడుగురు చనిపోయారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల్లో చనిపోయిన కార్మికుల శవాలే దొరకలేదు. వీరంతా వలస కార్మికులే కావడం గమనార్హం. సిగాచి దుర్ఘటనలో సీఐటీయూ పోరాటం వల్ల మృతుల కుటుంబాలకు రూ.కోటి రూపాయల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. యాజమాన్యం మాత్రం రూ.25 లక్షలిచ్చి చేతులు దులుపుకుంది. ఇలాంటి ప్రమాదాల్లో గాయాలపాలై వికలాంగులైన వారి కష్టాలు వర్ణనాతీతం.

బండ చాకిరి…చేతికందని జీతం
‘ఒడిశాకు చెందిన షణ్ముఖ్‌రావు రెండు నెలల క్రితం తెలంగాణకు వలసొచ్చాడు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ప్రాంతంలో రెసల్యూషన్‌ కంపెనీ థర్మకోల్‌, ఎలక్ట్రానిక్‌ టీవీల స్పేర్‌ పాట్స్‌ తయారీ కంపెనీలో లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ హమాలీ పనిలో కుదిరాడు. రోజుకు రూ.300 వేతనం ఇస్తామని కంపెనీ యజమాన్యం ఒప్పందం చేసు కుంది. రెండు నెలలుగా రోజుకు 12 నుంచి 14 గంటల వరకు పనిచేయించుకుంటున్న యజమాన్యం ఇప్పటి వరకు వేతనం ఇవ్వలేదు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కుట్టుమిషన్‌ కుట్టి కుటుంబాన్ని పోషిస్తోంది.’

సెలవుల పేర రూ.3 వేల జీతం కోత
‘ఉత్తరప్రదేశ్‌కి చెందిన సుదియ ఆరేండ్ల కింద భర్తతో పాటు ఉపాధి కోసం తెలంగాణకు వచ్చింది. వాటర్‌ ట్యాంక్‌ తయారీ కంపెనీలో భార్యభర్తలు పనిచేస్తున్నారు. రోజుకు 12 గంటలు పనిచేస్తే ఇద్దరికి వచ్చే వేతనం రూ.600. ఈ లెక్కన వారికి నెలకు రూ.18 వేల వేతనం రావాలి. కానీ యజమాన్యం మాత్రం ఆదివారం, సెలవు దినాల్లో వేతనం కోత పెట్టి రూ.15 వేలే ఇస్తుంది. వచ్చే జీతం కుటుంబ పోషణకే సరిపోవడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రమకు తగ్గ వేతనాలివ్వాలి చంద్రమోహన్‌, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
కార్మికుల అవసరాలను ఆసరాగా చేసుకుని కంపెనీల యజమాన్యాలు శ్రమను దోచుకుంటున్నాయి. వెట్టి చాకిరీ చేయించుకుని చాలీచాలని వేతనాలు ఇస్తున్నాయి. మిషన్ల వద్ద ఆపరేటర్లుగా పనిచేస్తున్న కార్మికులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పనిచేస్తున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ పోరాడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -